కరోనా సెకండ్ వేవ్ చాలామంది సినీజనాలను కబళించేస్తోంది. ఈరోజు ప్రముఖ బాలీవుడ్ నటుడు విక్రమ్ జీత్ కన్వర్ పాల్ (52) కన్నుమూశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నిన్న కుమార్ వట్టి అనే దర్శకుడు కన్నుమూశారు. ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రావణ్ అనే డైరెక్టర్ కూడా కరోనాతోనే మరణించారు. ఇలా వరుస మరణాలు చిత్ర పరిశ్రమను కలవర పెడుతున్నాయి. బాలీవుడ్ నటుడు విక్రమ్ జీత్ విషయానికి వస్తే ఆయన రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. 2003 నుంచి సినిమాలు చేస్తున్నారు.
టీవీ సీరియల్స్, సినిమాలు, వెబ్ సిరీస్ లో నటించారు. కుమార్ వట్టి విషయానికి వస్తే అతను యువకుడు. ‘మా అబ్బాయి’ చిత్రంతో దర్శకుడిగా మారారు. అందులో శ్రీవిష్ణు హీరో. శ్రీకాకుళం జిల్లాలోని నర్సన్నపేటకు చెందిన కుమార్ పరశురామ్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసి దర్శకుడయ్యారు. కోవిడ్ తో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నా ఫలితం లేకపోయింది. ఈరోజు శ్రావణ్ అనే మరో యువకుడు కూడా చనిపోయాడు. అతను నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్. రాజు దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసినట్టు సమాచారం.
వరుణ్ సందేశ్ సినిమా ‘ప్రియుడు’కు దర్శకత్వం వహించారు. ఈ మధ్య వచ్చిన ఎమ్మెల్యే, బ్రోచేవారెవరుగా చిత్రాలకు కోడైరెక్టర్ గా కూడా పనిచేశారు. ఇటీవలే త్రివిక్రమ్ దగ్గర కోడైరెక్టర్ గా చేసిన సీనియర్ సత్యం కూడా కరోనాతోనే కన్నుమూశారు. సప్తగిరి హీరోగా ఓ సినిమా చేస్తున్న నంద్యాల రవి అనే దర్శకుడు కూడా కరోనాతో ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్టు తెలుస్తోంది.
Must Read ;- నువ్వు హీరోనా.. నేను కరోనా.. కాస్కో!











