మింగ మెతుకు లేదు గానీ.. మీసాలకు సంపెంగ నూనె అన్నట్టుగా ఉంది ఏపీలోని జగన్ సర్కారు తీరు. సర్కారీ ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకే అప్పుల కోసం గంగవెర్రులెత్తుతున్న జగన్ సర్కారు.. వాస్తవ పరిస్థితి మరిచి గొప్పలకు పోతోంది. అప్పటికే పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తూ.. ఏటా కోట్లాది రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న సలక హంగులు ఉన్న భవనాలు పావతయ్యాయని, వాటి స్థానంలో కొత్త భవనాలు కట్టేస్తామంటూ తనదైన శైలి నిర్ణయాలతో సాగుతోంది. ఈ తరహా చర్యల్లో భాగంగా విశాఖలోని రుషికొండలోని ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కి చెందిన బీచ్ రిసార్ట్ ను నేలమట్టం చేసేసి.. దాని స్థానంలో కొత్త రిసార్టును కట్టేందుకు పూనుకుంది. ఇందుకోసం ఏకంగా రూ.91 కోట్లను కేటాయించింది. అనుకున్నదే తడవుగా ఓ వైపు కూల్చివేతలను మొదలెట్టేసి.. కొత్త భవనాల నిర్మాణం కోసం ఏకంగా టెండర్లను కూడా పూర్తి చేసేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీలో కొత్త చర్చకు తెర తీసింది.
రిసార్ట్ పాతదేమీ కాదుగా
తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో 14 ఏళ్ల క్రితమే ఈ రిసార్టును ఏపీటీడీపీ నిర్మించింది. ప్రస్తుతం ఈ రిసార్ట్ రూ.30 కోట్ల మేర టర్నోవర్ తో నడుస్తోంది. కేవలం రూ.3 కోట్లతో నిర్మించిన ఈ రిసార్ట్ రూ.30 కోట్ల టర్నోవర్ తో నడుస్తోందంటే.. మంచి లాభాల్లో నడుస్తున్నట్లే లెక్క. ఇదిలా ఉంటే.. ఏడాదిక్రితమే ఈ రిసార్ట్ లోని 22 గదుల మరమ్మతులు, ఇతర చిన్న చిన్న రిపేర్ల కోసం ఏకంగా రూ.2 కోట్ల మేర వెచ్చించారు. ఈ పనులు చేసిన కాంట్రాక్టర్ కు ఇప్పటిదా రూ.1 కోటి మాత్రమే చెల్లించగా.. ఇంకో రూ.1 కోటి మేర బకాయి ఉంది. ఆ బకాయిల కోసం సదరు కాంట్రాక్టరు జగన్ సర్కారు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం నాడు రెస్టారెంట్, కాన్ఫరెన్స్ హాలు నిర్మాణం కోసం మరో రూ.1 కోటి ఖర్చు చేశారు. హుద్ హుద్ తుపాను తర్వాత మరమ్మతుల కోసం కోట్ల రూపాయలను కూడా వెచ్చించాల్సి వచ్చింది. అన్నీ కలిపితే.. ఈ రిసార్ట్ కోసం ఇప్పటిదాకా రూ.8 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. అంటే.. రూ.8 కోట్లు ఖర్చు పెట్టిన రిసార్ట్ ఏటారూ.30 కోట్ల టర్నోవర్ తో నడుస్తున్నదన్న మాట.
రూ.91 కోట్లతో కొత్త రిసార్ట్
ఇక ఇప్పుడు అందుబాటులో ఉన్న రిసార్ట్ ను కూల్చివేసి దాని స్థానంలో కొత్తగా కట్టే రిసార్ట్ కు జగన్ సర్కారు ఏకంగా రూ.91 కోట్లను కేటాయించింది. ఈ మేర నిధులతో చేపట్టే పనుల కోసం ఇప్పటికే టెండర్లు పిలవగా.. డీఈసీ అనే సంస్థ పనులను దక్కించుకుంది. ఈ రూ.91 కోట్లతో స్థలాన్ని అభివృద్ధి చేసేందుకే ఏకంగా రూ.20 కోట్ల మేర ఖర్చు చేయనున్నారట. ఇదిలా ఉంటే.. కొత్తగా కట్టే రిసార్ట్ ను కేవలం 15 నెలల్లో కట్టి ఇవ్వాలనేది ప్రభుత్వ నిబంధనట. ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు చెల్లించేందుకు జగన్ సర్కారు కాంట్రాక్టర్లను ముప్పుతిప్పలు పెడుతోంది. ఇక ఈ స్థలంలోని రిసార్ట్ మరమ్మతులు చేసిన కాంట్రాక్టరుకు ఇంకా పూర్తిగా బిల్లే చెల్లించలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా చేపట్టబోయే పనులకు నిర్ణీతలో సమయంలోగా కాంట్రాక్టరుకు బిల్లులు చెల్లించకుంటే.. నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి అయ్యే ఛాన్సే లేదన్న మాట వినిపిస్తోంది. అయినా సకల హంగులతో నిత్యం పర్యాటకులతో కళకళలాడుతున్న రిసార్టును కూల్చేసి.. దాని స్థానంలో కొత్త రిసార్ట్ కట్టడం దేనికి? దాని కోసం ఏకంగా రూ.91 కోట్లు ఖర్చు చేయడం ఏమిటి? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.











