వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఏపీ కేబినెట్ శుక్రవారం భేటీ అయ్యింది. పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే దిశగా సాగిన ఈ భేటీలో ఆ అంశాలు ఎటు పోయాయో తెలియదు గానీ.. మంత్రుల తీరుపై మాత్రం జగన్ తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించారట. విపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్లు ఇవ్వలేని స్థితిలో ఉన్నారా? అంటూ ఆయన మంత్రులపై విరుచుకుపడ్డారట. ప్రభుత్వానికి అనుకూలంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారని కూడా జగన్ వారిని నిలదీసినంత పనిచేశారట. ఇకపై ఇలాంటి ప్రేక్షక పాత్ర పోషించే మంత్రుల తీరును సహించేది లేదని, ప్రతి మంత్రి పనితీరును పరిశీలిస్తానని కూడా జగన్ డేంజర్ బెల్స్ మోగించారట. విపక్షాల మాటలకు మనం కౌంటర్లు ఇవ్వకుంటే.. విపక్ష నేతలు చెప్పిన మాటలు ప్రజల్లోకి వెళ్లిపోతాయి కదా.. ప్రజలు వాటినే నమ్ముతారు కదా అంటూ జగన్ తనదైన శైలిలో అగ్గి ఫైరయ్యారట.
విమర్శలపై మౌనం ఎందుకు?
పాలనకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించేందుకు జగన్ తన మంత్రివర్గ సహచరులతో శుక్రవారం భేటీ అయ్యారు. మధ్యాహ్నం మొదలైన ఈ భేటీ సుధీర్ఘంగా సాయంత్రం దాకా కొనసాగింది. సమావేశంలోని అజెండాను త్వరత్వరగా ముగించిన సీఎం జగన్.. ఆ తర్వాత అసలు విషయాన్ని ప్రస్తావించారని సమాచారం. ఓ వైపు టీడీపీ, మరోవైపు బీజేపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తుంటే.. మంత్రులంతా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారట. అంతేకాకుండా టీడీపీ, బీజేపీ నేతల విమర్శలు చేస్తుంటే.. ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆయన నిలదీశారట. విపక్షాల విమర్శలను తిప్పికొట్టడంతో పాటుగా ప్రభుత్వానికి అనుకూలంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారని కూడా ప్రశ్నించారట. ప్రత్యేకించి ఇకపై బీజేపీ నేతల విమర్శలకు కౌంటర్లు ఇవ్వాల్సిందేనని, ఈ విషయంలో ఎంతమాత్రం అలసత్వం ప్రదర్శించినా ఊరుకునేది లేదని కూడా జగన్ తేల్చి చెప్పేశారట. ఇకనైనా పద్దతి మార్చుకోవాలేని కూడా జగన్ తన మంత్రులకు వార్నింగ్ ఇచ్చారట.
ఇకపై అన్నింటిపైనా మదింపేనట
భేటీలో భాగంగా బాగా ఇనాక్టివ్ గా ఉన్న ముగ్గురు మంత్రులను జగన్ ప్రత్యేకించి దుమ్ము దులిపేశారట. తమ సొంత శాఖలకు చెందిన అంశాలపై విపక్షాలు విమర్శలు సంధించినా కౌంటర్లు ఇవ్వకపోతే.. ఇక మంత్రులుగా ఎందుకు కొనసాగుతున్నారని కూడా జగన్ వారిని నిలదీశారట. ఇలా జగన్ తో పేరు చెప్పించుకుని మరీ తిట్టించుకున్న ఆ ముగ్గురు మంత్రులు ఎవరన్న చర్చ ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. అంతేకాకుండా బీజేపీ విమర్శలను ప్రస్తావించిన సందర్భంగా జగన్.. ఇద్దరు బీజేపీ నేతల పేర్లను ప్రస్తావించారట. బీజేపీ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నా.. మంత్రులంతా ఎందుకు సైలెంట్ గా ఉంటన్నారని జగన్ అసహనం వ్యక్తం చేశారట. జగన్ నోట నుంచి పేర్లు వినిపించిన ఆ ఇద్దరు బీజేపీ నేతలు ఎవరన్న చర్చ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇకపై ఉదాశీనంగా ఉండే మంత్రులను సహించేది లేదని, ఇకపై ప్రతి అంశంలో మంత్రులు వ్యవహరిస్తున్న తీరును తీసుకుని మదింపు చేస్తానని జగన్ హెచ్చరికలు జారీ చేశారట. మొత్తంగా జగన్ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో శుక్రవారం నాటి కేటినెట్ భేటీ హాట్ హాట్ గా సాగిందట.
బీజేపీపై పేర్ని ఫైరింగ్
జగన్ ఆగ్రహించిన ఫలితమో ఏమో తెలియదు గానీ.. కేబినెట్ భేటీ వివరాలు వెల్లడించేందుకు మీడియా ముందుకు వచ్చిన సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (పేర్ని నాని) బీజేపీపై ఓ రేంజిలో ఫైరయ్యారు. ఏపీలోని వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాషాయ కండువా కప్పుకున్న వారు ఏపీ సీఎం సీట్లో కూర్చోవాలని చూస్తున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ అప్పులపై మాట్లాడే కేంద్రం.. తాను మాత్రం అప్పులు చేయకుండానే పాలన సాగిస్తోందా? అని కూడా ఆయన ప్రశ్నించారు. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్రం ఎలా మాట్లాడుతుందని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.











