ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) చైర్మన్ గా వైసీపీ యువ నేత, కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ ఇంచార్జీ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి శుక్రవారం నాడు పదవీ బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. బైరెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున హాజైన ఈ కార్యక్రమంలో ఈలలు, కేకలు మారుమోగాయనే చెప్పాలి. కుర్రోడైన బైరెడ్డికి కుర్రకారులో మంచి ఫాలోయింగే ఉంది. సోషల్ మీడియాలో ఈ విషయం చాలా స్పష్టంగానే కనిపిస్తోంది. బైరెడ్డికి చెందిన ట్విట్టర్, ఫేస్‌బుక్ పేజీలను చూస్తేనే ఈ విషయం బోధపడుతుంది. బైరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం కిక్కిరిసిపోయిందట. తన సొంత జిల్లా నుంచి తరలివచ్చిన కుర్రకారు కళాక్షేత్రాన్ని తమదైన జోరుతో హోరెత్తించారు. కుర్రకారు కేకలు, ఈలలు ఓకే గానీ.. సిద్ధార్థరెడ్డి సొంత జిల్లాకు చెందిన మెజారిటీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కాని విషయం.. ఆయనపై జిల్లాలో ఏ మేర వ్యతిరేకత ఉందో చెప్పకనే చెప్పేసింది.
11 మంది ఎమ్మెల్యేలు డుమ్మా
కర్నూలు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ, 2 లోక్ సభ నియోజకవర్గాలు ఉండగా.. మొన్నటి ఎన్నికల్లో అన్నింటా వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. అంటే.. ఆ జిల్లాలో ఆ పార్టీకి 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నట్లు లెక్క. అయితే బైరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి మాత్రం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం హాజరయ్యారు. వారిలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికిశోర్ రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఉన్నారు. ఇక చోటామోటా నేతలు చాలా మందే హాజరైనా.. ఈ కార్యక్రమానికి ఏకంగా 11 మంది ఎమ్మెల్యేలు.. వారిలో ఇద్దరు మంత్రులు.. జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు కూడా ఈ వేడుకకు డుమ్మా కొట్టేశారు. బైరెడ్డి ఇంచార్జీగా వ్యవహరిస్తున్న నందికొట్కూరు ఎమ్మెల్యే అర్థర్ కూడా ఈ వేడుకకు హాజరు కాలేదు. వాస్తవానికి బైరెడ్డి వల్లే తాను గెలిచానని గతంలో అర్థర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే.. బైరెడ్డి గెలిపించిన ఎమ్మెల్యేనే ఆయన ప్రమాణానికి డుమ్మా కొట్టారన్న మాట. ఇక సీనియర్ రాజకీయవేత్తలుగా ఉన్న ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, సాయిప్రసాద రెడ్డి, బాలనాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డిలతో పాటు ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి కూడా ఈ వేడుకకు దూరంగానే ఉండిపోయారు. ఇక జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి, గుమ్మనూరు జయరాంలు కూడా ఈ వేడుకలో కనిపించకపోవడం గమనార్హం.
హాజరైన వారెవరు?.. వారి లెక్కలేంటి?
ఇక ఈ వేడుకకు హాజరైన వారిలో రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లు ఉన్నారు. శాప్ అంటే క్రీడలకు సంబంధించిన అంశమే కాబట్టి.. ఈ వేడకకు అవంతి తప్పనిసరిగా హాజరు కావాల్సిందే. ఇక జలవనురుల మంత్రి అనిల్ కుమార్.. కర్నూలు జిల్లా ఇంచార్జీ మంత్రి హోదాలో హాజరయ్యారు. ఇక జిల్లా నుంచి హాజరైన ఎమ్మెల్యేల్లో హఫీజ్ ఖాన్.. కర్నూలు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన యువకుడి కిందే లెక్క. పెద్దగా సొంతవర్గమంటూ లేదు. ఈ నేపథ్యంలో ఆది నుంచి బైరెడ్డితో కలిసి నడుస్తున్నారు. దీంతోనే ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇక శిల్పా రవికిశోర్ రెడ్డి.. కడప జిల్లాకు చెందిన వారే అయినా చాలా కాలం క్రితమే నంద్యాలకు వచ్చి స్థిరపడ్డారు. సిద్ధార్థ రెడ్డి ఫ్యామిలీ కర్నూలుకు చెందినదే అయినా.. కడప జిల్లాలో స్థిరపడ్దారు. అందులోనూ రవి కూడా కుర్ర నేతే. ఈ నేపథ్యంలోనే బైరెడ్డి కార్యక్రమానికి శిల్పా జూనియర్ వచ్చారు. ఇక కంగాటి శ్రీదేవి విషయానికి వస్తే.. ఏదో ఆ సమయంలో ఆమె విజయవాడలో ఉన్న నేపథ్యంలోనే బైరెడ్డి కార్యక్రమానికి ఆమె వచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వేడుకకు హాజరైన నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి ఎక్కడో అనామకుడిగా ఉండిపోయారే తప్పించి పెద్దగా.. ముందు వరుసలో కనిపించలేదు. సో.. వచ్చిన వారంతా కుర్రోళ్లే తప్పించి జిల్లా ముఖ్య నేతలవెరూ బైరెడ్డి వేడుకకు హాజరు కాలేదన్న మాట.











