ప్రపంచ దేశాలలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా జరుగుతునే ఉంది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడంతో ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్‌ను ప్రకటించి, ఆ తరువాత వైరస్ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టాక అన్‌లాక్ చేసుకున్నారు. అయితే ఇలా చేసినా కానీ కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా తగ్గలేదనే చెప్పాలి. ఇప్పటికీ అమెరికా, భారత్‌తో పాటు ఇతర దేశాలలో ఇంకా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతునే ఉంది. ప్రతి రోజూ వేల కేసులు నమోదవుతునే ఉన్నాయి. తెలంగాణలో అయితే డైలీ 1000 నుంచి 2వేల మధ్యలో కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
సెకనుకు 2 మీ. వేగంతో…
కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి తుంపర్లతో గాలి ద్వారా ఎలా వ్యాపిస్తుందనే విషయంపై సింగపూర్‌లోని ఏ-స్టార్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ శాస్త్రవేథలు అధ్యయనం చేశారు. వారు చేసిన ఆ అధ్యాయన పాఠాన్నిఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయడ్స్ అనే జర్నల్‌లో ప్రచురించారు. కరోనా వైరస్ ఇంతలా వేగంగా లక్షల మందికి వ్యాప్తి చెందడానికి గల కారణాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి వాతావరణంలోని తేమ, గాలి, ఉష్ణోగ్రతలు దోహదం చేస్తున్నాయని తెలిపారు. గాలివేగంపైనే కరోనా వైర్‌స్ వ్యాప్తి ఆధారపడి ఉంటుందని తమ పరిశోధనలో తెలిపారు. దగ్గినప్పుడు వచ్చే చిన్న పాటి దగ్గు తుంపర్ల ద్వారా గాలితో కలిసి కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుందని తేలింది. సెకనుకు 2 మీటర్ల వేగంతో వంద మైక్రోమీటర్ల నోటి దగ్గు తుంపర్లు ప్రయాణిస్తాయని కనుగొన్నారు. ఇలా గాలి ద్వారా వెళ్లే దగ్గు తుంపర్లు 6.6 మీటర్ల వరకు ప్రయాణిస్తాయని పేర్కొన్నారు. గాలిలో తేమ ఉన్నప్పుడే కాకుండా పొడిగాలిలోనూ ఈ తుంపర్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుందని వెల్లడించారు.
మాస్కుతోటే నివారణ..
వైరస్ వ్యాప్తి వేగాన్ని కేవలం మాస్కుతోటే తగ్గించవచ్చనే అంశాన్ని కూడా పరిశోధకులు వెల్లడించారు. మాస్కును ధరించడం వల్ల ఒక మీటరు దూరంలో ఉన్న వ్యక్తిపై దగ్గు తుంపర్ల ప్రభావాన్ని అరికట్టవచ్చని అధ్యయన రచయిత ఫాంగ్ యు లీయోంగ్ తెలిపారు. ఇంతేకాకుండా గాలి లేనప్పుడు కూడా కనీసం ఒక మీటరు దూరం వరకు వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలిపారు. పెద్ద పెద్ద తుంపర్లు మాత్రం భూమిపై పడిపోతాయని నిర్ధారించారు. తేలికపాటి తుంపర్లు గాలి ద్వారా ప్రయాణించి వాటిని ఊపిరితిత్తుల్లోకి లోతుగా పీల్చుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే పెద్ద భాష్పీబవన బిందువులతో పోల్చితే తేలికపాటితో కాస్త ఇన్ఫెక్షన్ స్థాయి తక్కువగానే ఉంటుందని పేర్కొన్నారు.
ఏదేమైనా వాహనాలే కాదు వైరస్‌లు కూడా ప్రయాణించగలవనే విషయం మనకు దీంతో అర్థమైంది.