( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
ప్రభుత్వాలు మారాయి… పాలకులు మారారు … కానీ వారి తల రాతలు మాత్రం మారలేదు. ఎవరికైనా జబ్బు చేస్తే మరో ఇద్దరు లేదా నలుగురు డోలీలో కిలోమీటర్ల దూరం మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందే. ఎన్నాళ్లీ నరకప్రాయం.. పాలకులకు ఎన్ని వినతులు సమర్పించిన ప్రయోజనం శూన్యమని నిర్ణయించుకున్న యువత చేయి చేయి కలిపారు. ఎనిమిది కిలోమీటర్ల రోడ్డును శ్రమదానంతో నిర్మించుకున్నారు.
యువత తీర్మానం..
కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ జాజులబంద గ్రామం, రోలుగుంట మండలం కొత్తగా ఏర్పడిన ఆర్ల పంచాయతీ శివారు పిత్రి గడ్డ గిరిజన గ్రామాల్లో యువకులు సమావేశం ఏర్పాటు చేసుకుని రోడ్డు నిర్మాణం చేసేందుకు తీర్మానం చేసుకున్నారు.
నాలుగు నెలలు పనులు..
అరకు పార్లమెంటు సభ్యురాలు సొంత మండలంలో చోడవరం, పాడేరు నియోజకవర్గాల శివారు గ్రామాలైన ఆదివాసీ గిరిజనులు నాలుగు నెలల వ్యవధిలో శ్రమదానంతో 8 కిలోమీటర్లు కచ్చా రోడ్డు నిర్మించుకున్నారు. రోలుగుంట మండలం ఆర్ల గ్రామం నుంచి కొయ్యూరు మండలం మూలపేట పంచాయితీ జాజులబంద గ్రామం వరకు నిర్మించారు. సుమారు 150 మంది దఫాలుగా శ్రమదానం చేశారు. ఈ ఆదివాసీ కోందుతెగకు చెందిన గిరిజనులు కొయ్యూరు మండల కేంద్రానికి వెళ్లాలంటే 60 కిలోమీటర్ల దూరం.. పంచాయతీ కేంద్రానికి వెళ్లాలంటే 20 కిలోమీటర్ల దూరం.. రేషన్ బియ్యం తీసుకురావాలంటే 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. జాజులుబంద గ్రామం నుండి పితృ గడ్డ మీదుగా ఆర్ల గ్రామానికి చేరుకోవాలంటే ఎత్తయిన రెండు కొండలు దాటాల్సి వస్తుంది. తారు రోడ్డు నిర్మిస్తే తమ కష్టాలు తీరతాయని గ్రామస్తులు ఆశిస్తున్నారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడితే గాని తమ జీవితాలు మారవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.











