ఏపీలో బడులు ప్రారంభం అయ్యాయి. విద్యాసంవత్సరం వృథా కాకుండా చూడాలనే ప్రభుత్వ ప్రయత్నాన్ని తప్పుపట్టలేం. అయితే పాఠశాలలు ప్రారంభమైన వారంలోనే వందలాది విద్యార్థులు, ఉపాధ్యాయలు కోవిడ్ భారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో కరోనా కేసులు గణనీయంగా తగ్గిన సమయంలో పాఠశాలల ప్రారంభంతో మరలా కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
ఏపీలో పాఠశాలలు తెరచి వారం గడవక ముందే 829 ఉపాధ్యాయులు, 575 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. తూర్పుగోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో మధ్యాహ్న భోజనం తయారు చేసే సిబ్బందికి కూడా కరోనా సోకింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ పాఠశాలల్లో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. విద్యార్థులు కరోనా బారిన పడకుండా అన్ని చర్యలు తీసుకున్నామని విద్యాశాఖ మంత్రి సురేష్ కుమార్ చెబుతున్నా, కోవిడ్ తాజా గణాంకాలు చూస్తుంటే ఆందోళన కలిగిస్తోంది.
సామాజిక దూరం సాధ్యమేనా?
విద్యార్ధులను పాఠశాలల్లో సామాజిక దూరం పాటించేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల మధ్య సాధ్యమైనంత దూరం పాటించేలా సూచనలు చేస్తున్నారు. అయితే విద్యార్ధులు బడులకు వచ్చేప్పుడు ఆటోల్లో, బస్సుల్లో ప్రయాణం చేయడం కరోనా వ్యాప్తికి కారణంగా భావిస్తున్నారు. ఒక్కో ఆటోలో 15 మంది విద్యార్థులను కుక్కి పాఠశాలల వద్ద దింపుతున్నారు. బస్సుల్లోనూ సామాజిక దూరం పాటించడం లేదు. దీని ద్వారా విద్యార్ధులు, ఉపాధ్యాయులు ప్రయాణ సమయంలోనూ కరోనా భారినపడుతున్నారని తెలుస్తోంది.
ఉపాధ్యాయులే ఎక్కువగా కరోనా బారిన ఎందుకు పడ్డారు…
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో 96 శాతం మంది సమీపంలోని పట్టణాల నుంచి వారు పని చేసే పాఠశాలలకు ప్రయాణం సాగిస్తున్నారు. పాఠశాలకు 25 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉపాధ్యాయులు సొంత వాహనాల్లోనే దాదాపుగా పాఠశాలలకు వస్తున్నారు. కొందరు ఉపాధ్యాయులు వారు పనిచేసే పాఠశాలకు 60 నుంచి 80 కిలోమీటర్ల దూరంలోని జిల్లా కేంద్రాల నుంచి కూడా ప్రయాణాలు సాగిస్తున్నారు. వీరంతా బస్సుల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇలా వీరు ప్రతి రోజూ ప్రయాణాలు చేయడం వల్ల కరోనా ఎక్కడైనా సోకే ప్రమాదం ఉంది. టీచర్లకు కరోనా వచ్చిందంటే ఆ ప్రమాదం విద్యార్ధులకు కూడా పొంచి ఉన్నట్టే.
ప్రభుత్వం ఏం చేయాలి?
ముందుగా ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. అనుమానం వచ్చిన ప్రతి ఉపాధ్యాయుడికి కరోనా టెస్టులు నిర్వహించాలి. కరోనా వచ్చిన వారిని క్వారంటైన్ కు తరలించి వైద్య సేవలు అందించాలి. ముందుగా ఉపాధ్యాయుల ద్వారా విద్యార్ధులకు కోవిడ్ సోకే ప్రమాదాన్ని నివారించాలి. ఇక ప్రతి విద్యార్ధికి కరోనా టెస్టులు చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే వారి సంఖ్య ఏపీలోనే 72 లక్షలు ఉంది. వీరందరికీ కరోనా టెస్టులు సాధ్యంకాదు కనుక, ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అనుమానం వచ్చిన ప్రతివారి నుంచీ కరోనా శాంపిల్స్ సేకరించాలి. అలా కరోనా వచ్చిన వారిని ముందుగానే గుర్తించడం ద్వారా మిగతా వారికి వ్యాపించకుండా నిరోధించవచ్చు. ఇక ముఖ్యంగా మధ్యాహ్న భోజన సిబ్బంది కూడా కరోనా భారినపడుతున్నారు. వారికి కరోనా వస్తే మరింత ప్రమాదం. వారు విద్యార్థులకు భోజనం వడ్డించే సమయంలో పాఠశాల మొత్తానికి కోవిడ్ వ్యాపించే ప్రమాదం ఉంది. మధ్యాహ్న భోజన సిబ్బంది మొత్తానికి కరోనా టెస్టులు తప్పనిసరి చేయాలి.
ప్రారంభించే ముందు కరోనా పరీక్షలు చేశారు గానీ.. ఆ తర్వాత కూడా సోకే ప్రమాదం ఉంది. ఇలాంటి వ్యవహారాల్లో ప్రతిరోజూ ప్రాణగండం కిందే లెక్క. అసంప్టమేటిక్ గా సోకితే.. వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
రెండు తరగతులు ప్రారంభిస్తేనే…
ప్రస్తుతానికి ఏపీలో 9, 10 తరగతుల విద్యార్థులకు మాత్రమే తరగతులు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో అన్నీ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇదే జరిగితే విద్యార్థి లోకం కరోనా భారిన పడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చే వరకూ ఆన్ లైన్ క్లాజులు నిర్వహించి, విద్యాసంవత్సరం వృధా కాకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
మంత్రిగారి మాట
పాఠశాల ప్రారంభం వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కరోనా రాలేదని విద్యాశాఖ మంత్రి సురేష్ కుమార్ సెలవిచ్చారు. వీరు పాఠశాలలకు రాక ముందే కరోనా వచ్చి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కరోనా పాఠశాలలకు ప్రారంభానికి ముందే వస్తే అలాంటి వారిని గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా. అప్పట్లో పరీక్షలు కూడా నిర్వహించారు కదా.. మరి ఇప్పుడే ఎలా బయటపడుతున్నాయనేది ప్రశ్న.
కరోనా వచ్చిన వారిని క్లాసులకు ఎలా అనుమతించారు. కరోనా సోకిన ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒకేచోట చేరితే కోవిడ్ అందరికీ వ్యాప్తించే ప్రమాదం ఉంది కదా? ఇవన్నీ ఆలోచించకుండా ఏదో విద్యార్థులను ఉద్దరిస్తున్నాం, అన్న చందంగా హడావుడిగా పాఠశాలలు ప్రారంభించారనే విమర్శలు వస్తున్నాయి. కరోనా ఈ విధంగా వ్యాప్తి చెందితే త్వరలో మరలా పాఠశాలలు మూసివేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. పాఠశాలల ప్రారంభానికి ముందే వారికి కరోనా వచ్చిందా? పాఠశాలల ప్రారంభం వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందా అనే విషయాలను కూడా పరిశీలించాలి. కరోనా సామాజిక వ్యాప్తి చెందుతోంది. కాబట్టి అన్నీ వర్గాల్లో కరోనా ఉండి ఉండవచ్చు. కానీ పాఠశాలల ప్రారంభం వల్ల అది మరింత మందికి సోకే ప్రమాదాన్ని అరికట్టాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వానిదే.