ఈశాన్య ఢిల్లీలో రేగిన అల్లర్లు దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించాయి. సీఏఏ-ఎన్‌ఆర్‌సీ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం హింసాత్మకంగా మారడంతో 53 మంది పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ నిబంధనలు పాటించకుండా ‘హేట్ ప్రసంగాలను’ అనుమతి ఇచ్చిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ‘శాంతి సామరస్య’ కమిటీని నియమించారు. దీనిపై విచారణ జరిపిన ఆ కమిటీ ఫేస్ బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ ను తమ ముందు హజరుకావాలని నోటీసులు జారీ చేసింది. ఇతర దేశాలలో ఒక తీరుగా ఇండియాలో ఒక తీరుగా ఫేస్‌బుక్ వ్యవహరిస్తోందని విపక్షాలు కూడా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.
అసెంబ్లీ కమిటీ ఇచ్చిన నోటీసులపై అజిత్ మోహన్ సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై త్రీసభ్య ధర్మాసనం ఈ రోజు విచారించనుంది. ఎస్కే కౌల్, అనిరుధ్ బోస్, కృష్ణమురారిలతో కూడిన ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కేసును విచారించనున్నారు. అజిత్ మోహన్ తరుపున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి తమ వాదనలను వినిపించనున్నారు.
ఫేస్‌బుక్ పై విమర్శలు
ఇండియాలో ఫేస్‌బుక్ అధికార పార్టీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని వాల్ స్ట్రీట్ జనరల్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంతో విపక్షాలు ఫేస్ బుక్ పై నిప్పులు చెరుగుతున్నారు. దీంతో ఫేస్‌బుక్ అంతర్గత విచారణ చేపట్టింది. కానీ బీజేపీ నాయకుల విద్వేషకరమైన ప్రసంగాలను తొలగించలేకపోయింది. బీజేపీ నాయకులపై చర్య తీసుకుంటే ఇండియా లాంటి పెద్ద మార్కెట్ ను నష్టపోతుందనే ఉద్దేశంతో ఫేసుబుక్ చూసి చూడనట్లు వ్యహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి కే వేణుగోపాల్ ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ కు ఓ లేఖ వ్రాశారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అయితే ఏకంగా పార్లమెంటరీ కమిటీకి ఫిర్యాదు చేశారు.
ఫేస్‌బుక్ ఇండియా డైరెక్టర్ వాదన
పార్లమెంట్ ప్యానెల్ లో ఈ అంశంపై విచారణ జరుగుతున్న సమయంలో ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ నోటీసులు పంపడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ నోటీసుల నుంచి మినహాయింపులు ఇవ్వమని కోరారు. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఛార్జ్ షీట్ ను నమోదు చేసి కేంద్రానికి తెలియచేశారని ఢిల్లీ ప్రభుత్వానికి కాదని పిటీషన్ లో తెలిపారు. విచారణ జరగకముందే ఢిల్లీ సర్కార్ ఫేసుబుక్ దోషి అని నిర్దారించడంపై విచారాన్ని వ్యక్తం చేశారు. తనను ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ ముందు హజరుకమ్మని సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులకు తప్పా ఛార్జ్ షీట్ దాఖలు చేసే అర్హత ఎవరికి లేదని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ‘ఫేస్‌బుక్’ ఎండీ పిటీషన్ పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఆసక్తి నెలకొంది.