ఎస్పీ బాలు ఇకలేరన్న వార్త సినీ అభిమానులతో పాటు తెలుగు, తమిళ ప్రజలకు తీవ్ర విషాదంలో నెట్టివేసింది. నాలుగు దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీలో గాయకుడిగా తన గాత్రాన్ని అందించిన ఎస్పీ బాలు మరణించారనే వార్తా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో తన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇండస్ట్రీలోని ప్రతి హీరోకు అయన పాటలు అందిస్తే మరికొంత మంది హీరోలకు వాయిస్‌ను కూడా అందించారు.
తన సినీ కెరీర్లో మొత్తం 16 భాషల్లో 41,230 పాటలు పాడిన ఘనత బాలుకే సొంతం. ఎలాంటి కష్టతరమైన స్వరాలను సైతం అవలీలగా తన గాత్రం ద్వారా పలికించగలిగిన గాన గాంధర్వుడుగా బాలుకు పేరుంది. శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించలేదు. అయినా విన్నవెంటనే ట్యూన్ పట్టేయడం బాలు స్పెషాలిటీ. కఠినమైన పదాలతో ఉన్న పాటలను కూడా ఒకే టేకులో పాట పాడే ఘనుడు. అందుకే బాలు అంటే సినీ దర్శకులకు, సంగీత దర్శకులకు అభిమానం ఎక్కువ. కెరీర్లో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు.
మృత్యువుతో 40 రోజులుగా పోరాటం.. తుదికోరిక తీరలేదు
ఎస్పీ బాలు చివరి కోరిక.. తీరని కోరిక లాగే మిగిలిపోయింది. చావు దగ్గరకు వచ్చినట్లు తనకు తెలియకుండానే మరణించాలని తన కోరికగా చెప్పుకున్నారు. కానీ బాలు గత కొంత కాలంగా చావుతో పోరాడుతూ ఈ రోజు మధ్యాహ్నం కన్నుమూశారు. ఎస్పీ బాలు గతంలో ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన అనేక విషయాల గురించి తన భావాలను బాలు పంచుకున్నారు. తన జీవితంలో 20 ఏళ్లు సిగరెట్ తాగానని, 40 ఏళ్లలో ఉన్నప్పుడు రోజుకు 10 గంటల పాటూ పాటలు పాడినట్టు తెలిపారు. ఇంజినీరింగ్ కావాలని కలలు కన్నతాను చివరకు గాయకుడిగా మారినట్టు తెలిపారు. తను ఎవరికీ గొంతు మార్చి పాటలు పాడేవాడిని కాదని, అల్లూరి రామలింగయ్య, రాజబాబుకు పాటలు పాడే సమయంలో వారి గొంతుకు దగ్గర ఉండే విధంగా పాటలు పాడినట్టు తెలిపారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు పాటలు పాడిన సమయంలో గొంతు మార్చి పాడినట్టు బాలు ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.
”మరణించే వరకు పాడుతుండాలని, చావు దగ్గరకి వచ్చినట్టు తనకు తెలియకుండానే మరణించాలి ” అని అదే తన చివరి కోరిక అని ఆ ఇంటర్వ్యూలో ఎస్పీ బాలు పేర్కొన్నారు. కానీ కోవిడ్ సోకి ఆసుపత్రిలో అడ్మిట్ అయిన బాలు సుదీర్ఘంగా దాదాపు 40 రోజులకు పైగా మృత్యువుతో పోరాడారు. కోవిడ్ రూపంలో చావు.. బాలు దగ్గరకు చేరిందనే విషయాన్ని మనం అర్ధం చేసుకోవాల్సి ఉంటుందేమో. ఆయన కరోనా బారిన పడే ముందు వరకు ఎస్పీ బాలు పాటలు పాడుతూనే ఉన్నారు.
రేపు సాయంత్రం అంత్యక్రియలు..
ఇవాళ సాయంత్రం 4 గంటలకు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి నుంచి కోడంబాకంలోని తన కుమారుడు ఎస్పీ చరణ్ ఇంటికి బాలు పార్థివదేహాన్ని తరలిస్తున్నారు. అభిమానుల సందర్శనార్థం కోడంబాకంలో బాలు పార్థివదేహాన్ని ఉంచనున్నట్లు తెలిసింది. అనంతరం రేపు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహిస్తారని సమాచారం.











