బాలూకు తొలి పాటకూ చివరి పాటలకూ చేదు అనుభవాలే తోడయ్యాయి. సినిమా పాటల ప్రయాణంలో ఆయన ఎప్పుడూ అలసిపోలేదు.. ఆయన తుది శ్వాసలోనూ స్వరాల ఆలాపనే ధ్వనించి ఉంటుంది. తొలి పాట నుంచి సినిమాల్లో చివరి పాట వరకూ బాలు సాగించింది మహా ప్రస్థానం. గురువు కోదండపాణి శాసించారు.. బాలు దాన్ని పాటించారు. ఇచ్చిన మాట ప్రకారం తొలి పాట పాడే అవకాశం ఎస్పీ కోదండపాణి నుంచే వచ్చింది. అది హాస్య నటుడు పద్మనాభం నిర్మిస్తున్న ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ సినిమా. దానికి సంగీతం అందించింది కోదండపాణి అయితే బాలు పాడాల్సిన తొలిపాటను వీటూరి రాశారు. మాల్కోస్, యమన్, కళ్యాణి, భాగేశ్వరి రాగాల్లో స్వరాలల్లారు. ‘యేమి ఈ వింత మొహం’ అనే పల్లవితో సాగే పాటను రేఖ అండ్ మురళీ ఆర్ట్స్ కార్యాలయంతో రికార్డు చేశారు.
అభిమాన లేఖ : ‘అంతా అత్యుక్తులే’ అన్న బాలు!
ఆ పాట పాడటానికి స్టూడియోకి వెళితే సెక్యూరిటీ గార్డు బాలును లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నాడ. ఆ పాట పాడాల్సింది తనేనని బతిమాలుకుని లోపలికి అడుగుపెట్టాడట బాలు. పాట తను ఒక్కడే పాడతానని బాలు అనుకున్నారుగానీ చివరకు అది సోలో పాట కాదని నలుగురు కలిసి పాడేదని తెలిసింది. అలవాటు ప్రకారం ప్రాక్టీసుకు వెళితే అక్కడ పి.సుశీల, కల్యాణం రఘురామయ్య, పి.బి. శ్రీనివాస్ కనిపించారు. తడబడుతున్న బాలును కోదండపాణి వారికి పరిచయంచేశారు. ‘యేమి ఈ వింత మొహం’ పాట మొత్తాన్నీ బాలుతోనే పాడించి వినిపించారు. ముగ్గురు గాయనీగాయకులతో కలిసి బాలు పాడిన ఈ తొలిపాటను 1966 డిసెంబరు 15న విజయా గార్డెన్స్‌లో రికార్డిస్ట్ స్వామినాథన్ రికార్డు చేశారు. ముగ్గురితో కలిసి పాడటం చేదు అనుభవమే అయినా ఆ తర్వాత అది ఎన్నో మధుర స్మృతుల్ని మిగిల్చింది.

అయ్యో చివరి పాటలో ఇలా జరిగిందేంటి?
బాలు చివరి పాట విషయంలోనూ ఈ చేదు అనుభవం తప్పలేదు. అది ఇటీవలే వచ్చిన ‘పలాస 1978’ సినిమా. ఇందులో హీరోహీరోయిన్లు సినిమాకి వెళితే ఆ సినిమా పాత్రల్లోకి వెళ్లి పాట పాడుకునే సందర్భంలో ఈ పాట వస్తుంది. ‘ఓ సొగసరి, ప్రియ లాహిరి తొలకరి వలపుల సిరి’అనే పల్లవితో ఈ పాట సాగుతుంది. లక్ష్మీ భూపాల రాసిన ఈ పాటను రఘు కుంచె స్వరపరిచారు. బాలు, వడిశలేరు బేబి కలిసి పాడారు. ఒక విధంగా బాలుతో కలిసి పాడటం వడిశలేరు బేబికు వచ్చిన అదృష్టంగానే చెప్పాలి. దురదృష్ణం ఏమిటంటే బాలు పాడిన ఈ చివరి పాట సినిమాలో లేదు.
ఈ సినిమా విడుదలకు ముందు దీన్ని రామానాయుడు ప్రివ్యూ ధియేటర్లలో అనేక ప్రివ్యూ షోలు వేశారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమాలో సందర్భం లేకుండా ఈ పాట వచ్చినట్టుందని అనడంతో చేసేది లేక ఆ చిత్ర దర్శకుడు కరుణ కుమార్ ఆ పాటను కట్ చేయాల్సి వచ్చింది. ధియేటర్లో సినిమా చూసిన వారికి ఈ పాట కనిపించదు. ఆడియోలో మాత్రం ఉంటుంది. తమ చిత్రంలో బాలు పాడటం ఓ అదృష్టంగా భావించామని కరుణకుమార్, రఘుకుంచె అన్నారు. ఈ సినిమాలో ఈ పాట అనుభవాలను వారు మా లియో న్యూస్ తో పంచుకున్నారు. వారు ఏమన్నారో వారి మాటల్లోనే చూద్దాం…
కరుణ కుమార్ (పలాస చిత్ర దర్శకుడు): ఆ పాటను ఆయన మాత్రమే బాగా పాడగలరు అనుకున్నాం. 1970 దశకంలో వచ్చే పాట కాబట్టి ఆ లేత వాయిస్, ఆ బాలుగారి పాట ఉండాలనిపించింది. ఆ పాటను అంత మధురంగా పాడాలంటే ఆయనవల్లే అవుతుందనేది ఇంకో కారణం. ఆయన మద్రాసులోనే రికార్డింగ్ చేయించి పంపించారు. ట్రాక్స్, లిరిక్స్ పంపించమని అడిగితే మా సంగీత దర్శకుడు రఘు కుంచె పంపించారు. సినిమాలో పాట తీసేశాం.. సినిమాలో ఉండి ఉంటే బాగుండేది. అందరూ అలా అభిప్రాయపడ్డారని తీసేశాం. ఆ పాట సినిమాలో ఉండి ఉంటే బాగుండేదని ఇప్పుడనిపిస్తోంది.
రఘు కుంచె (సంగీత దర్శకుడు): అది సెవెంటీస్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే పాట. అది కొంచెం రెట్రో స్టయిల్ లో ఉంటుంది. నేను సంగీత దర్శకుడినై పదేళ్లయినా నేను ఆయనతో పనిచేయలేకపోయాను. సరైన పాట లేనందునే ఆయనతో పాడించలేదు. ఈ పాట ఈయన పాడితే బాగుంటుంది అనిపించింది. ఆయన పాడతారో లేదోనన్న సందేహం ఉన్నా అడిగాను. పాట విని చాలా నచ్చి పాడారాయన. ‘పాత తరం పాట అని నా దగ్గర కొచ్చారా..’ అని జోక్ కూడా వేశారు. ‘దీన్ని మీరు తప్ప ఇంకెవరూ ఇలాంటి పాటను ఇవ్వలేరండీ’ అనడంతో ఒప్పుకున్నారు. ఆఖరి పాట నాకు రావడం అదృష్టమో దురదృష్టమో కూడా నాకు తెలియడం లేదు. ఆయన ఇంకా ఎన్నో పాటలు పాడతారని అనుకున్నా.. నా పాటతోనే ఆయన జీవితం ముగిసిపోతుందని అనుకోలేదు. ఆఖరి పాటను నాకివ్వడం భగవంతుడు నాకిచ్చిన అదృష్టం.. ఆయనను కోల్పోవడం పరిశ్రమ చేసుకున్న దురదృష్టం. కథకు అడ్డం పడుతోందని సినిమాలో దీన్ని తీసేయాల్సి వచ్చింది.
విశేషం ఏంటంటే…
ఆయన పాడిన తొలిపాటను బ్లాక్ అండ్ వైట్ లో చిత్రీకరించారు. ఇన్నేళ్ల తర్వాత.. సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందిన యుగంలో పలాస చిత్రంలోేని పాటను కూడా బ్లాక్ అండ్ వైట్ లోనే చిత్రీకరించారు.
– హేమసుందర్ పామర్తి











