తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సీఎం కానున్నారని చానాళ్లుగా చర్చ నడుస్తోంది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా క్షేత్ర స్థాయిలో కూడా ప్రజలను ప్రిపేర్ చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆ పార్టీ నేతలు రెండు రోజులుగా చేస్తున్న కామెంట్లు అందులో భాగంగానే ఉన్నాయనే చర్చ నడుస్తోంది.
వ్యూహాలకు బ్రేక్
2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత ఈ నిర్ణయం ఉంటుందని పార్టీలోనే చర్చ నడిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బంపర్ మెజార్టీతో గెలిచినా 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ వ్యూహం దెబ్బతింది. సారు..కారు. సర్కారు నినాదంతో 16 ఎంపీ స్థానాలను గెలుచుకుంటామని చెప్పినా.. కొంత నిరాశే ఎదురైంది. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుకున్నట్లుగానే 16 సీట్లు వచ్చి ఉంటే, బీజేపీకి మెజార్టీ తగ్గి ఉంటే.. కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయా ల వైపు వెళ్లేవారని, కేటీఆర్ అప్పుడే సీఎం అయ్యేవారనే చర్చ నడిచింది. ఫలితాలు భిన్నంగా రావడంతో ఆ వ్యూహాలకు బ్రేక్ పడిందని చెబుతారు.
చర్చ జరిగేలా వ్యూహాలు..
ఒకటి రెండు నెలల తరువాత కేటీఆర్ సీఎం అవుతారననే చర్చ మళ్లీ మొదలైంది. ఒక రకంగా చెప్పాంటే టీఆర్ఎస్ నుంచే కొంత మంది లీడర్లు వ్యూహాత్మకంగా లీకులు ఇచ్చారని కూడా చెప్పవచ్చు. ప్రజల్లోనూ ఈ అంశంపై చర్చజరగడం, ప్రిపేర్ కావడం లక్ష్యంగా ఈ ప్రచారం జరిగిందని చెబుతున్నారు. కేటీఆర్‌ని సీఎం చేసేందుకు అడ్డుగా ఉండే అంశాలన్నింటినీ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఆ పార్టీకి ఏడాది సమయం పట్టిందని చెబుతారు. లాక్ డౌన్ సమయంలోనే కేటీఆర్‌ని సీఎం చేసేస్తారని ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా కామెంట్లు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీల కామెంట్లు సత్యదూరమని, కేవలం రాజకీయం కోసమే వారు ఎలాంటి విమర్శలైనా చేస్తారని నిరూపించేందుకు కూడా టైం తీసుకున్నారని చెబుతున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీకి ఎదురు దెబ్బలు తగ్గినా.. దుబ్బాక విషయంలో కేటీఆర్ పాత్ర లేదనే అభిప్రాయం వచ్చే విధంగా వ్యూహం కూడా అమలైందని చెబుతారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల విషయంలోనూ.. బీజేపీ ఎలాంటి ప్రచారం చేసి గెలిచిందో ప్రజలకు తెలుసు అని టీఆర్ఎస్ నాయకులే వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌పై జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల ప్రభావం లేదని చెప్పడంతో పాటు కేటీఆర్‌ని సీఎం చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ అయిందని చెప్పవచ్చు.

లీకులు అందుకేనా..
ఉద్యమ నాయకుడిగా కేసీఆర్‌కి ఉన్న గుర్తింపు వేరు. 2009 నుంచి కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నారని చెబుతున్నా చానాళ్లపాటు ఆయనను కేసీఆర్ కుమారుడిగానే గుర్తించినవారు ఎక్కువ. సీఎం అయ్యేందుకు కేవలం వారసత్వ ఉంటే సరిపోతుందా అనే ప్రశ్న తలెత్తకుండా ఆయనే ప్రజాక్షేత్రంలో గెలవడం (సిరిసిల్ల వ్యూహాత్మక ఎంపిక),పలు ఎన్నికల్లో గెలుపు బాధ్యతలు, పార్టీ బాధ్యతలు, మంత్రి పదవులు అప్పగించి సక్సెస్ ఫుల్ వ్యక్తిగా ప్రజల్లో ఓ అభిప్రాయం వచ్చేవరకు వేచి చూశారని పార్టీ లీడర్లే చెబుతున్నారు. అదే సమయంలో కేటీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నామని చెప్పే స్థితి నుంచి కేటీఆర్ సీఎం అయితే తప్పేముంది అనే వరకు చర్చను తీసుకొచ్చారు. మరికొంత కాలంలో కేటీఆర్ సీఎం కావాల్సిందే అని కేడర్ నుంచి వచ్చే డిమాండ్ మేరకు..కేటీఆర్‌ని సీఎం చేస్తున్నారనే ప్రకటన రావచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
అసమ్మతికి చెక్ పెట్టేలా..
ఇక ఈ విషయంలో అసమ్మతివాదులకు కూడా చెక్ పెట్టే యత్నం భారీ స్థాయిలోనే జరుగుతోందని చెప్పవచ్చు. డైరెక్ట్‌గా కాకుండా.. పార్టీలో ఉన్న లీడర్లు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య లీడర్ల అభిప్రాయాల ద్వారా ఆ అసమ్మతిని సైడ్ చేసే కార్యకమం కూడా జరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారిక కార్యకలాపాల్లో 99 శాతం కేసీఆర్ బాధ్యతలను కేటీఆర్ చూస్తున్నారని సీనియర్ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. పార్టీలో, ప్రజల్లో విశ్వసనీయత ఉన్న వ్యక్తిగా, వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తిగా పేరున్న ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రమంతా చర్చ నడిచింది. పార్టీ నిర్ణయం ఎలా ఉంటుందనేందుకు ఈటల కామెంట్లు సంకేతాలనే చర్చ మొదలైంది. మంత్రులు తలసాని , కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు షకీల్, బాజిరెడ్డి, మెతుకు ఆనంద్‌లు కూడా ఈ విషయంలో మాట్లాడుతూ..కేటీఆర్ సీఎం కావాలని, అవుతారని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లు చేస్తూనే.. కేవలం వ్యక్తిగత అభిప్రాయమని వ్యాఖ్యానించారు. పార్టీ పరంగా ఎలాంటి సమస్యలు రాకుండా కూడా కామెంట్లు చేశారు. ఆ కామెంట్లు వ్యక్తిగతంగా చేశారా, పార్టీ పరంగా చేశారా అనే విషయం పక్కన బెడితే.. ప్రజల్లోకి వెళ్లాలనుకున్న మెస్సేజ్ వెళ్లింది. పల్స్ తెలసిపోయింది. పార్టీ కేడర్ అంతా జై కొట్టే వాతావరణం క్రియేట్ అయిపోయిందని కొందరు నాయకులు అభిప్రాయ పడుతున్నారు.
కేసీఆర్ తరువాతి స్టెప్‌పై ఆసక్తి
ఇక ఈ విషయంలో కేసీఆర్ తరువాతి స్టెప్ ఏంటనే విషయంపై పలు అంచనాలున్నాయి. ఇదే విషయంపై గతంలో కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ తానే మరో 20ఏళ్లు సీఎంగా ఉంటానని, బక్కగా ఉన్నా గట్టిగా ఉన్నానని వ్యాఖ్యానించారు. మరి కేటీఆర్‌ని సీఎం చేసే విషయంలో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది రానున్న కాలంలో తేలాల్సిన అంశం. మరోవైపు రాష్ట్రంలో పార్టీపై వ్యతిరేకతను తగ్గించడం, బీజేపీ దూకుడుకు అడ్డుకోవడం, ఢిల్లీ టూర్ ప్రభావం ఉందని, కేసీఆర్ దేశ రాజకీయాలకు వెళ్లాల్సిన అవసరం తలెత్తిందనే అభిప్రాయం, ఆరోగ్యపరమైన అంశాలు కూడా కేటీఆర్‌ని సీఎం చేసేందుకు దోహదం చేస్తున్నాయన్న చర్చ కూడా నడుస్తోంది.











