ఓ సామాన్యుడు అసామాన్యుడిగా మారడం ఒక్క సినిమాల్లోనే జరుగుతుంది. కొందరు సినిమా హీరోలు సినిమాల్లోకి రాకముందు కూడా సామాన్యులే. ఎంతో కృషి, ఎదగాలన్న కసి ఉంటే తప్ప అది సాధ్యం కాదు.
పాతతరం నటుల్లోనే ఇది చూశాం. ఆ తర్వాత వారి వారసులు వచ్చి హీరోలుగా నిలబడ్డారు. కొత్త వారు సూపర్ స్టార్ కావడం మాత్రం దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. తమిళ్ సూపర్ స్టార్ అజిత్ అక్కడ సూపర్ స్టార్ అయినా పూర్వాశ్రమంలో ఓ సామాన్యుడు అనే సంగతి కొందరికే తెలుసు. పైగా ఆయన తెలుగువాడు. నిజానికి అతని పేరు శ్రీకర్. గొల్లపూడి మారుతీరావు కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్ తన దర్శకత్వంలో ‘ప్రేమపుస్తకం’ అనే సినిమా చేస్తూ అందులో హీరోగా అజిత్ ని పరిచయం చేశారు. ఆ సినిమాకి శ్రీకర్ గానే అజిత్ తెలుసు. ఆ తర్వాత ఇప్పుడు తమిళనాట అజిత్ స్థాయి ఏమిటో అందరికీ తెలుసు.
ఆ విషయాల్లోకి వెళ్లే ముందు వర్తమానంలోకి వద్దాం. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో ఓ సామాన్యుడిలా తిరిగిన అజిత్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. హైదరాబాద్ రోడ్ల మీద సైక్లింగ్ చేస్తూ తిరగడం, టీ తాగడం లాంటి ఫొటోలన్నమాట. అజిత్ లోని మరో విశేషం ఏమిటంటే తన వెంట్రుకలు తెల్లబడినా అలాగే నటిస్తుంటాడు. అది ఓ ఫ్యాషన్ గానూ మారింది. హైదరాబాద్ రోడ్లపై అజిత్ ఇలా తిరగడం ఇది కొత్త కాదు. ఎందుకంటే అతను పుట్టి పెరిగిందంతా సికింద్రబాద్ లోనే. నిజానికి ఒకప్పుడు అతను బైక్ మెకానిక్. పెద్దగా చదువుకోలేదు. పదో తరగతితోనే చదువు ఆపేశాడు. వైజాగ్ లోనూ బైక్ మెకానిక్ గా జీవితం గడిపాడని చెబుతుంటారు. డ్రైవింగ్ అంటే మహాఇష్టం. అలా బైక్ రేసర్ గానూ పేరు తెచ్చుకున్నాడు.
చదువు తక్కువే అయినా చిన్నప్పటి నుంచి అనేక భాషలు మాట్లాడగలడు. అజిత్ కు లాంగ్ డ్రైవ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా బైక్ లంటే మహా ఇష్టం. కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నా బైక్ లేదా కార్లపై లాంగ్ డ్రైవ్ చేస్తుంటాడు. అలాగే సైక్లింగ్ కూడా చేస్తుంటాడు. ఇటీవల సిక్కిం వరకూ బైక్ ట్రిప్ వేశాడట. ప్రస్తుతం వందల కిలోమీటర్ల దూరం సైక్లింగ్ కు కేటాయించాడు. అలా చెన్నై నుంచి హైదాబాద్ కు చేరాడు. ఈ సైకిల్ మీదే కోల్ కతా వరకూ వెళతాడట. తను హీరో అజిత్ అని గుర్తుపట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎవరో ఒకరు గుర్తుపట్టకుండా ఉండరు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అజిత్ వయసు ఇప్పుడు 50 ఏళ్లు. మొదటి నుంచి తమిళ సినిమాలతో అతని బంధం పెనవేసుకుపోయింది. తన 19వ ఏటనే తమిళ సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించాడు. ఆ తర్వాత అమరావతి అనే సినిమాలో చేశాక తెలుగులో ‘ప్రేమపుస్తకం’ సినిమాలో హీరోగా చేసే అవకాశం వచ్చింది. 1992లో ఈ సినిమాను అంగీకరించాడు. హీరోహీరోయిన్లుగా శ్రీకర్, చరిత్ర అనే పేర్లు కనిపిస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే అతని సినిమా జీవితానికి 30 ఏళ్లు అని చెప్పవచ్చు. ప్రస్తుతం వినోద్ దర్శకత్వంలో ‘వలిమై’ సినిమా చేస్తున్నాడు. దీనికి బోనీ కపూర్ నిర్మాత.
ఇందులో ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది విడుదలయ్యే అజిత్ సినిమా ఇదే. పురుచ్చి తలైవి జయలలితతో అజిత్ కు మంచి అనుబంధం ఉంది. కానీ అజిత్ కు రాజకీయాల మీద అంత మక్కువ లేదు. 2000 సంవత్సరంలో నటి శాలినిని పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్లడు. సినిమాలు లేదా ఇలా లాంగ్ డ్రైవ్ లు వంటి వాటికే అజిత్ ప్రాధాన్యం ఇస్తుంటాడు. ఇప్పుడు తమిళ్ లో యూత్ లో క్రేజ్ ఉన్న హీరోలు విజయ్, అజిత్ ఇద్దరే. సినిమాల పరంగా వీరిద్దరూ పోటీ పడుతుంటారు.