హైదరాబాద్‌లో శనివారం కురిసిన కుండ పోత వర్షానికి దారులన్నీ ఏరులై పారితే, రహదారులేమో చెరువులను తలపించాయి. దీంతో ఓ వ్యక్తి ఎంచక్కా.. ఈత కొడుతూ తన గమ్యస్థానానికి పయనమయ్యాడు. నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి ఎల్బీనగర్-వనస్థలిపురం రహదారి గోదావరిని తలపించింది. దీంతో ఎల్బీనగర్, చింతల్‌కుంట, పనామా, వనస్థలిపురం రోడ్డుపై వరద నీరు చేరింది. మరో పక్క ట్రాఫిక్‌జామ్‌లో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
రోడ్డుపైనే ఈదుకుంటూ…
చింతల్ కుంటలో ఓ వ్యక్తి రోడ్డుపైనే నీళ్లల్లో ఈదుకుంటూ వెళ్లిపోయాడు. ఆ వ్యక్తి ఈ ట్రాఫిక్‌లో గంటల తరబడి చిక్కుకుపోవడమెందుకు అనుకున్నాడో ఏమో.. రోడ్డుపై నిలిచిన వరద నీటిలోనే ఎంచక్కా ఈత కొడుతూ తన గమ్య స్థానానికి పయనమయ్యాడు. వర్షం కురుస్తున్నా.. అలా జాలీగా.. ఈత కొడుతూ వెళ్లాడు. అక్కడున్న వారంతా ఆ వ్యక్తిని ఆశ్చ్యర్యంగా చూస్తూ ఉండిపోయారు. మరికొంతమందేమో ఆ వింత దృశ్యాన్ని తమ సెల్‌ఫోన్లు తీసి కెమెరాల్లో బందించారు. తీసిన వాళ్లు ఊరికినే ఉండరుగా.. అలా బందించిన దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేశారు. దాంతో ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది.
అయితే ఈ వీడియోపైన సోషల్ మీడియాలో ఒక్కొక్కరు.. ఒక్కోలా కామెంట్లు చేసుకుంటున్నారు. ఈ వర్షం కారణంగా మనం.. ఎటైనా వెళ్లాలంటే వాహనాలతోపాటు పడవలు, బోట్లు కూడా భవిష్యత్ లో కొనవలసి వస్తుందేమోనని సరదా కామెంట్లు చేసుకుంటున్నారు. కాగా, హైదరాబాద్ వాసులను వర్షం తన ప్రతాపంతో భయపెట్టడమే కాదు.. ఇలా ఆశ్చ్యర్యానికి గురిచేసే దృశ్యాలను కూడా చూసేలా చేస్తోందని నగరవాసులు అనుకుంటున్నారు.











