ఏపీలో దేవాలయాల ధ్వంసం కొనసాగుతోంది. విజయవాడ నెహ్రూ బస్టాండ్ సమీపంలోని సీతారామాలయంలోని సీతమ్మ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. రామతీర్థం ఘటన మరువక ముందే మరో మూడు దేవాలయాలను దుండగులు ధ్వంసం చేయడంపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదని విశ్వహిందూ పరిషత్ నేతలు మండిపడుతున్నారు. విజయవాడలో జరిగిన ఘటనపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. టీడీపీ, బీజేపీ నేతలతో పాటు, విశ్వహిందూ పరిషత్ కు చెందిన సభ్యులు పెద్ద ఎత్తున సీతారామాలయానికి చేరుకుని నిరసన తెలిపారు.
పోలీసుల వింత వాదన
బెజవాడ బస్టాండ్ సమీపంలోని సీతారామాలయంలో సీతమ్మ విగ్రహాన్ని ఎలుకలు ధ్వంసం చేసి ఉంటాయని పోలీసులు ప్రకటించంపై విశ్వహిందూపరిషత్ నేతలు మండిపడ్డారు. ఏపీలో 145 దేవాలయాలు, విగ్రహాలను దుండగులు ధ్వంసం చేసినా పోలీసులు ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడంపై బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. దేవాలయాలపై దాడుల వెనుక ఎంతటి వారున్నా కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. దేవాతామూర్తుల విగ్రహాలను ఎలుకలు ధ్వంసం చేశాయని విజయవాడ పోలీసులు చెప్పడంపై పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభంచారు.
రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి టీడీపీ రంగం సిద్దం
ఏపీలో దేవాలయాలపై వరుస దాడులకు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డే కారణమని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. బెజవాడలో తాజాగా ధ్వంసం చేసిన సీతారామాలయాన్ని ఆయన సందర్శించారు. దేవాలయాలపై దాడుల వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దుండగులను ప్రభుత్వం వెంటనే అరెస్టు చేయకుంటే దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని బుద్దా వెంకన్న హెచ్చరించారు. దేవాలయాలపై వరుసదాడులకు వైసీపీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఏపీలో హిందూ దేవాలయాలు లేకుండా చేయాలనే కుట్రలో భాగంగానే ఈ దాడులు సాగుతున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోకుంటే టీడీపీ రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడుతుందని ఆయన హెచ్చరించారు.
కొనసాగుతున్న దాడులు
ఏపీలో ప్రతి రోజూ ఏదో ఒక దేవాలయాన్ని, దేవాతామూర్తుల విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. దీనిపై ఏపీ బీజేపీ నేతలు పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థంలో సాక్షాత్తూ రాములోరి తలను వేరుచేసి దుండగులు కోనేరులో పడేయడంపై కేంద్ర బీజేపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో 145 దేవాలయాలను, విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలు నమోదయ్యాయి. తాజాగా విజయవాడ పట్టణంలో సీతారామాలయంలోని విగ్రహాలు ధ్వంసం చేయడంపై సిటీ బీజేపీ నేతలు తీవ్ర ఆందోళన చేపట్టారు. దేవాలయాలపై ఇన్ని దాడులు జరుగుతున్నా సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడంపై వారు సీరియస్ గా ఉన్నారు. మరోవైపు విశ్వహిందూ పరిషత్ కూడా దేవాలయాలపై దాడులను సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. అంతర్వేదిలో చర్చి అద్దం పగిలితే 40 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించిన జగన్మోహన్ రెడ్డి, 145 దేవాలయాలు, విగ్రహాలు ధ్వంసం చేసినా ఇప్పటికీ ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read: విజయవాడలో సీతమ్మ విగ్రహం ధ్వంసం;