కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్ చైనా లోని వుహాన్ లో ఉద్బవించింది. అక్కడి నుంచి ఈ వైరస్ 215 దేశాలకుపైగా వ్యాప్తి చెందింది. ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల మందికి పైగా ఈ వైరస్ బారిన పడగా దాదాపు 7 లక్షల 70 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్థికంగా, సామాజికంగా దేశాలను దెబ్బ కొట్టిన ఈ వైరస్ కు చైనా కారణమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ (డబ్ల్యూ.హెచ్.ఓ)తో కలిసి చైనా ఈ దారుణానికి ఒడిగట్టిందని ట్రంప్ మండిపడుతున్నారు. కానీ జరగవలసిన ఘోరం జరిగిపోయింది. ఇంకా చాలా దేశాలలో ఈ వైరస్ అదుపులోకి రాలేదు. సామాజిక దూరం, మాస్క్, శానిటైజేషన్ లాంటి నియంత్రణ చర్యలను పాటిస్తున్నా రోజుకు లక్షలాది మంది ఈ మహమ్మారి భారిన పడుతూనే ఉన్నారు. ఈ వైరస్ జన్మస్థలమైన చైనా కూడా తీవ్ర సమస్యలు ఎదురుకుంటుందని అందరూ భావిస్తున్నారు. కానీ అందుకు విరుద్ధంగా చైనాలో అందునా వుహాన్ లో జరగడం గమనార్హం.
ఓపెన్ ఎయిర్ వాటర్ పార్కులో జరిగిన ఒక భారీ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఫెస్టివల్ లో వేలాది మంది అక్కడ ప్లే చేసిన సంగీతానికి డాన్స్ చేశారు.మాస్క్ లేకుండా, భౌతిక దూరం పాటించకుండా వేలాది మంది వాటర్ పార్క్ కు రావడం ప్రపంచ దేశాలను షాక్ కు గురి చేసింది. వుహాన్ మాయ బీచ్ మొత్తం సందర్శకులతో నిండిపోవడం అందరిని షాక్ కు గురి చేసింది. వుహాన్ కు చెందిన మాయ బీచ్ కరోనా ఉదృతి తగ్గిపోవడంతో జూన్ నెల చివరి వారంలో ఓపెన్ చేశారు. కానీ చైనాలో భారీ వర్షాల కారణంగా తిరిగి ఈ బీచ్ ను మూసివేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో బీచ్ ను ఇటీవలే తిరిగి ప్రారంభించారు.
వుహాన్ జనాభ 11 మిలియన్లు. దేశంలో మొదటి కరోనా కేసు నమోదు కావడంతో నగరంలో 76 రోజుల పాటు లాక్ డౌన్ ను విధించారు. లాక్‌డౌన్‌ను ఖచ్చితంగా అమలు చేయడంతో జీవితం సాధారణ స్థితికి చేరుకుంది. మే మధ్య నుండి ఇప్పటి వరకు అక్కడ కొత్త కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. వుహాన్‌లో చివరి ముగ్గురు కరోనా వైరస్ రోగులు జూన్ 5 న డిశ్చార్జ్ అయ్యారు. దీని తరువాత సుమారు 10 మిలియన్లకు పైగా పరీక్షలు జరిపి ప్రభుత్వం వుహాన్ కరోనా రహిత రాష్ట్రంగా ప్రకటించారు. డిసెంబర్ లో మొదటి కేసు నమోదయిన వుహాన్ జీరో స్థాయికి చేరుకోవడం అందరికి ఆదర్శంగా మారనుంది. ఇదే సమయంలో తమ దేశంలో నమోదయిన 84,000 కేసులలో 60 శాతం సీజనల్ వ్యాదులని చైనా ప్రభుత్వం ప్రకటించడం మాత్రం అనుమానాలకు తావిస్తోంది. ప్రపంచాన్ని ముంచేసి వుహాన్ ప్రజలు పండగ చేసుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.