కీసర ఎంఆర్ఓ నాగరాజు వ్యవహారంలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి పేరు వినబడటం కాంగ్రెస్ పార్టీని ఉలిక్కిపడేలా చేసింది. భూవివాదాన్ని పరిష్కరించేందుకు రూ 1.10 లక్షలు లంచం తీసుకుంటూ ఎంఆర్ఓ నాగరాజు పట్టుబడ్డ సంగతి తెలిసిందే. అంజిరెడ్డికి చెందిన గెస్ట్ హౌస్ లో భారీగా సొమ్ము బయట పడటంతో ఆయన ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి చెందిన ఎంపీ ల్యాండ్స్ నిధులకు సంబందించిన ఫైల్స్ తో బాటు కలెక్టర్ కార్యాలయానికి సంబందించిన కీలకమైన ఫైల్స్ దొరికాయని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. రియల్టర్ ఇంట్లో ఎంపీ ల్యాండ్స్ , కలెక్టర్ కార్యాలయానికి సంబందించిన ఫైల్స్ రియల్టర్ ఇంట్లో దొరకడంపై ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల మేరకు కీసర మండలం రాంపల్లిలో 19 ఎకరాలకు సంబందించిన భూమి వివాదం చాలా రోజులుగా నడుస్తోంది. ఇటీవలే 19 ఎకరాలలో 8 ఎకరాలు పట్టాదారులకు చెందుతుందని కోర్ట్ తీర్పు చెప్పింది. తీర్పు ప్రకారం ఆ 8 ఎకరాల భూమిని పట్టాదారుల పేరిట మార్చవలసి ఉంది. మిగిలిన 11 ఎకరాలు ఆర్డీఓ పరిధిలో ఉంది. ఆ భూమిని కూడా పట్టాదారుల పేరిట మార్చాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎంఆర్ఓ నాగరాజుని కలిశారు. భూమిని పట్టాదారుల మీద మార్చాలంటే ఎంఆర్ఓ నాగరాజు 2 కోట్లు లంచం అడిగారు. అందుకు రియల్టర్ అంజిరెడ్డి ఒప్పుకున్నారు. దీంతో భూమిని బదలాయించిన ఆయన అంజిరెడ్డికి సంబందించిన గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. పక్కా సమాచారంతో గెస్ట్ ఆఫీస్ పై దాడి చేసిన ఏసీబీ అధికారులు నాగరాజుతో బాటు అంజిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అంజిరెడ్డికి ఎంపీ రేవంత్ రెడ్డి సన్నిహితుడు కావడంతో అధికారులు ఆ కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.
మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసిన సమయంలో అంజిరెడ్డి అన్నీ తానై రేవంత్ రెడ్డికి అండదండలు అందించిన విషయం తెలిసిందే. అంజిరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడు కావడం ఆ పార్టీకి షాక్ కు గురి చేసింది. రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి అంజిరెడ్డి ఆయన వెంట ఉన్నారనే వార్తలు వినబడుతున్నాయి. టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డికి కూడా అంజిరెడ్డి ప్రధాన అనుచరుడుగా వ్యవహరించాడు. మల్లారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరినా అంజిరెడ్డి మాత్రం పార్టీ మారకుండా టీడీపీలోనే ఉండిపోయాడు. ఆ తరువాత రేవంత్ రెడ్డితో బాటు అంజిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అధికార టీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేస్తూ నిరంతరం వార్తలలో ఉండే రేవంత్ రెడ్డికి ఈ భూవివాద కేసు ఇబ్బందులలోకి నెట్టిందని చెప్పక తప్పదు.