జగన్ కు చెందిన బినామీ కంపెనీపై కొద్ది రోజులుగా ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. జగన్ బినామీ కంపెనీగా చెబుతున్న షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీలో నాలుగు రోజుల నుంచి ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఆ సంస్థకు చెందిన ఫ్యాక్టరీలు, కార్యాలయాలు, యాజమాన్యం ఇళ్లు అన్ని చోట్లా ఏకకాలంలో సోదాలు జరుగుతుండగా.. జగన్ కు టెన్షన్ పట్టుకుంది. ఈ కంపెనీకి సంబంధించిన కార్యాలయాలు, రికార్డులు అన్నీ కడపలోనే ఉన్నాయి. అక్కడ సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) బందోబస్తుతో సోదాలు జరుగుతున్నాయి. సాధారణ తనిఖీలైతే ఒకటి లేదా రెండు రోజుల్లో ముగుస్తుంటాయి. నాలుగు రోజులుగా నిరంతరాయంగా సోదాలు జరుగుతున్నాయంటేనే అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కడప కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ అనేది విశ్వేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి నడుపుతున్నారు. ఈ విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రరి జగన్మోహన్ రెడ్డి దగ్గరి బంధువు. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి కూడా సన్నిహితుడు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాక ముందు ట్రాన్స్ ఫార్మర్లు తయారు చేసే ఓ చిన్న పరిశ్రమ లాంటిది షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ. పేరు కూడా పెద్దగా ఎవరికీ తెలియదు.
అలాంటిది 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెడుతోంది. ఈ ప్రకటన సంస్థ నుంచి రాగానే అందరూ అవాక్కయ్యారు. ఓ చిన్న పరిశ్రమ అంతలా లక్ష కోట్ల పెట్టుబడులు ఎలా పెడుతుందని అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే దీని వెనక ఎవరు ఉన్నారని కూపీ లాగడం మొదలు పెట్టారు. ఇందులో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. ఈ కంపెనీని ఇండోసోల్ అనే అనుబంధ సంస్థ మొదలుపెట్టింది. ఆ సంస్థలోకి ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చాయి. అరబిందో సంస్థ కూడా షేర్స్ కొనుగోలు చేసింది. అలా మొత్తానికి చాలా అనుమానాస్పద లావాదేవీలు జరిగాయి.
మరోవైపు, జగన్ వచ్చాక ఏపీ ప్రభుత్వం వేల ఎకరాల భూముల్ని అప్పనంగా షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కి దారాదత్తం చేసింది. అవసరం లేకపోయినా వేల కోట్ల విలువైన ట్రాన్స్ ఫార్మర్లను కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఎన్నో అవకతవకలు జరిగాయని ఆ సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఐటీ సోదాలు జరుగుతూ ఉండడం ఆ అవకతవకలకు మరింత బలాన్ని చేకూర్చింది. సమాచారం ఏమీ బయటకు రాకపోతూ ఉండడంతో సోదాల్లో అధికారులు ఏం గుర్తించారనేది తెలియాల్సి ఉంది. నాలుగు రోజులుగా నిరంతరంగా ఐటీ సోదాలు జరుగుతున్నాయంటే.. ఆర్థిక అవకతవకలు భారీగానే జరిగి ఉంటాయని భావిస్తున్నారు. సాధారణంగా తనిఖీల్లో ఎలాంటి తప్పులు బయటపడకపోతే.. సోదాలు ఆపేస్తుంటారు. ఏవైనా తప్పులు అధికారులు గుర్తిస్తే.. వాటి మూలాలు తెలుసుకుంటారు. అలా ఒక్కోసారి తవ్వేకొద్దీ అక్రమాలు బయట పడుతుంటాయి. ఈ విషయంలో కూడా ఊహించనంత అక్రమాలు బయటపడి ఉంటాయని భావిస్తున్నారు.











