ysఆ నేతను మరోసారి వివాదాలు వెంటాడుతున్నాయా ? జగన్ సర్కార్ ఆ నాయకుడిని మళ్ళీ టార్గెట్ చేసిందా ?తనకున్న అధికార బలంతో అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారా ? రెండేళ్ల తర్వాత అదే అంశం పై కేసును తిరగతొడుతుండడం వెనుక కారణాలు ఏమిటి ? ఇంతకీ ఎవరా నేత ? ఆయనను వెంటాడుతున్న వివాదాలు, కేసులు ఏమిటి ?
అనంతపురం జిల్లాలో జెసి ఫ్యామిలీ అనేది ఒక బ్రాండ్. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వారికి ఉండే ఫాలోయింగే వేరు. అందుకేనేమో జెసి ఫ్యామిలీ అంటేనే జగన్ కి అస్సలు పడదట.దీంతో ఎలాగైనా జెసి కుటుంబాన్ని అణచివేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళ నుంచే ఆయనపై ఆయన కుటుంబం పై జగన్ తన కక్ష సాధింపును మొదలు పెట్టారు.సుధీర్గ రాజకీయ అనుభవం ఉన్న జెసి ప్రభాకర్ రెడ్డిని టార్గెట్ చేసిన జగన్ సర్కార్, ఒక కేసు నుంచి కొలుకునే లోపే మరో కేసు అంటూ వేధిస్తూ వస్తోంది.దీంతో జెసి ప్రభాకర్ రెడ్డి ని వివాదాలు, కష్టాలు, కేసులు వెంటాడుతున్నాయనే చర్చ జోరందుకుంది.
జగన్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజుల నుంచే ప్రభాకర్ రెడ్డి పై కేసుల పేరిట వేధింపులు మొదలయ్యాయి. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ అంటూ జెసి ప్రభకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలపై 24 కేసులు పెట్టిన జగన్ ప్రభుత్వం, ఆయన ఆర్ధిక మూలాలపై దెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది. ఈ కేసులో జెసి , ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి అరెస్ట్ అవగా.. దాదాపు 54 రోజుల పాటు కడప జైలులో ఉన్నారు.సుమారు రెండు నెలల తర్వాత కేసులో బెయిల్ లభించడంతో ఇరువురు జైలు నుంచి బయటకు వచ్చారు.
ఇక జైలు నుంచి విడుదల అయిన రోజు నుంచి జగన్ ప్రభుత్వం మళ్ళీ ఆయనను వేధించడం మొదలు పెట్టింది.ప్రభాకర్ రెడ్డి జైలు నుంచి విడుదల అవుతుండడంతో టిడిపి కార్యకర్తలు, ఆయన అనుచరులు, అభిమానులు వందల సంఖ్యలో వాహణాలతో జైలు వద్దకు చేరుకున్నారు. ఇక కడప జైలు నుంచి ప్రభాకర్ రెడ్డి భారీ ర్యాలీగా తన నియోజకవర్గానికి బయలు దేరారు. అయితే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు ఆయనపై విడుదల అయిన 24 గంటల్లోనే ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కేసు పెట్టడంతో ఆయన మళ్ళీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో ఆయనకు కరోనా పాజిటివ్ సోకిన నేపధ్యంలో చికిత్స కోసం బెయిల్ మంజూరు చేయాలనీ కోర్ట్ లో ప్రభాకర్ రెడ్డి పిల్ దాఖలు చేయగా.. ఆరోఘ్య దృష్ట్యా న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.దీంతో ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు.
ఇదిలా ఉంటే.. తాజాగా జగన్ సర్కార్ జెసి ప్రభాకర్ రెడ్డి ని మళ్ళీ టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో జెసి ప్రభాకర్ రెడ్డి , ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలు బెయిల్ పై బయటకు వచ్చాక రెండేళ్లుగా ఆ కేసుల విషయం పెద్దగా ప్రస్తావనకు రాలేదు. కాగా, ప్రస్తుతం మళ్ళీ రవాణా శాఖ అధికారులు ఈ కేసుపై దృష్టి పెట్టినట్లు సమాచారం.జెసి సంస్థ కొనుగోలు చేసిన వాహనాలకు సంబంధించిన ఇన్సూరెన్స్ ల వివరాలను సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి కోరినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ పెద్దల ఆదేశాలతోనే రెండేళ్ల తర్వాత అధికారులు ఈ కేసులో వేగం పెంచారని.. అందుకే కేసును చాలా లోప్రొఫైల్ గా విచారిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అధికారంలో ఉన్నప్పుడు తాము ఎటువంటి తప్పు చేయలేదని, ఎటువంటి విచారణకు అయినా సిద్ధంఅని జెసి ప్రభాకర్ రెడ్డి గట్టిగానే చెబుతున్నారు.
మొత్తానికి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నాయకులే టార్గెట్ గా కక్ష సాధింపు చర్యలతో వారిని, వారి కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేస్తున్న జగన్ సర్కార్ జెసి ప్రభాకర్ రెడ్డి వ్యవహారంలో మళ్ళీ తన నియంత ధోరణిని చూపించుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తంఅవుతున్నాయి.