(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
వైఎస్ రాజశేఖర రెడ్డిని తొలిసారిగా ముఖ్యమంత్రిని చేసిన పథకం.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాకు బ్రేక్ పడేలా ఉంది. ప్రతి నెలా రైతుల ఖాతాలో ప్రభుత్వం విద్యుత్ బిల్లుకు చెందిన నగదు జమ చేస్తామని ప్రభుత్వ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ వెల్లడించారు. ప్రభుత్వం రైతుల ఖాతాలో వేసిన కరెంటు బిల్లు డబ్బును విద్యుత్ సంస్థలకు చెల్లించాలని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
పంపు సెట్లకు మీటర్లే లేవు… రైతుల ఖాతాలో నగదు ఎలా జమ చేస్తారు?
ఏపీలో మొత్తం 13 జిల్లాల్లో 16 లక్షల పంపు సెట్లు ఉన్నాయి. 2004 నుంచి రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా అవుతోంది. ప్రభుత్వమే విద్యుత్ సంస్థలకు వ్యవసాయ విద్యుత్ కు బిల్లులు చెల్లిస్తూ వస్తోంది. ఈ విధానం వల్ల ఏ రైతు ఎంత విద్యుత్ వినియోగించారో తెలియడం లేదని విద్యుత్ సంస్థలు మొత్తుకుంటున్నాయి. వ్యవసాయ విద్యుత్ సరఫరా చేసే కొన్ని ట్రాన్సుఫార్మర్ల వద్ద మీటర్లు పెట్టారు. ఆ టాన్సుఫార్మర్ పరిధిలో ఎన్ని మోటార్లు ఉన్నాయి. ఎన్ని యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుందో విద్యుత్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇది ఖచ్చితమైన విధానం కాదు. ర్యాండమ్ గా జిల్లాలో ఒక చోటు లెక్కించి మొత్తానికి దాన్నే వర్తింపజేస్తున్నారు. ఇలా లెక్కించిన విధానం ద్వారా ఏటా ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ కు రూ.5000 కోట్లు చెల్లించాలని విద్యుత్ పంపిణీ సంస్థలు కోరుతున్నాయి. ప్రభుత్వం మాత్రం ఏటా రూ.3500 కోట్లు చెల్లించి చేతులు దులుపుకుంటూ వస్తోంది. అది కూడా ఏ సంవత్సరానివి ఆ సంవత్సరం కాకుండా బకాయిలు పెడుతున్నారు. ఒక్కోసారి మూడు నాలుగు సంవత్సరాల బిల్లులు కూడా రాక విద్యుత్ పంపిణీ సంస్థల బకాయిలు ఒక్క ఏపీలోనే రూ.20000 కోట్లకు చేరాయి.
నూతన విధానం ఎవరికి మేలు చేస్తుంది?
వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి రీడింగ్ తీయడం సాధ్యంకాని పని. ఎందుకంటే పొలాల్లో ఎక్కడెక్కడో మారుమూల ఉండే మోటార్లను గుర్తించి రీడింగ్ తీయడానికి అవసరమైన సిబ్బంది కూడా విద్యుత్ పంపిణీ సంస్థల వద్ద లేరు. అందుకే ర్యాండమ్ గా 3,5,10 హార్స్ పవర్ మోటార్లకు సామర్థ్యాన్నిబట్టి ప్రతి నెలా ప్రభుత్వం రైతుల ఖాతాలో నగదు జమ చేయాలని భావిస్తోంది. దీని ద్వారా రైతుల కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో తెలియజేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధానం బూమ్ రాంగ్ అయ్యే అవకాశం ఉంది. రైతులు ఖాతాలో నగదు జమ చేయడం వరకూ బాగానే ఉంటుంది. వారికి అనేక అవసరాలు ఉంటాయి. రైతులు ప్రతి నెలా విద్యుత్ బిల్లులు చెల్లించగలరా అంటే
కష్టమేనని చెప్పాలి. రాబోయే కొద్ది రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్ సరఫరా సంక్షోభంలో పడే ప్రమాదం లేకపోలేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.











