దశాబ్దాల కాలం నుంచి నానుతున్న ఎస్సీ, ఎస్టీల వర్గీకరణపై సర్వోన్నత న్యాయస్థానం తమ అభిప్రాయాలను వెలువరించింది. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల జాబితాల్లో ఎన్నో అసమానతలు ఉన్నాయని అభిప్రాయపడ్డ సుప్రీం రిజర్వేషన్ ఫలాలు కిందిస్థాయి వరకు చేరడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. వారి జీవనం ఆధారంగా పైకి తీసుకువచ్చేందుకు తగిన విధంగా రిజర్వేషన్లు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న హక్కును కాదనలేం అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. సుప్రీం నిర్ణయం శుభ పరిణామమని అసమానతలను రూపు మాపేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని మేధావులు, వర్గీకరణ కోరుకునేవారు చెబుతున్నారు. ఈ నిర్ణయం విషయంలోనే జగన్ సంకటం తప్పకపోవచ్చుననే వాదన వినిపిస్తోంది.
జగన్‌కు ఇబ్బంది ఏంటంటే..
సుప్రీం సూచన మేరకు వర్గీకరణ చేయాల్సివస్తే జగన్‌కు తీవ్ర రాజకీయం ఇబ్బంది తప్పకపోవచ్చు.పార్టీ ఆవిర్భావం నుంచి మాలలు వైసీపీ వెంట నడుస్తున్నారు. వైసీపీకి తమ మద్దతు తెలపడమే గాక అధికారంలోకి వచ్చేందుకు తమ వంతు సాయం చేశారు. మాలలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే మాదిగల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకానుంది. మాదిగలు ఏ,బీ,సీ,డీ వర్గీకరణ చేసేందుకు గతంలో ప్రయత్నించిన టీడీపీకి మద్దతు పలుకుతున్నారు. ఈ విషయంలోనే మాదిగలు వైసీపీ ప్రభుత్వంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వర్గీకరణ చేయకుండా న్యాయవ్యవస్థలపై నెపం నెట్టాలనే విషయంలో కూడా జగన్ కు అవకాశం లేదు. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం వర్గీకరణకు శ్రీకారం చుట్టింది. రిజర్వేషన్ ఫలాలు అట్టడుగు స్థాయికి చేరుకోవాలని చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం చేశారు. కానీ న్యాయస్థానాలకు ఈ అంశం చేరుకోవడంతో అమలు జరగలేకపోయింది.
తాజాగా సుప్రీం చెప్పిన ప్రకారం ఎస్సీల వర్గీకరణ అనేది రాష్ట్రప్రభుత్వ పరిధిలోనే అంశమే అవుతుంది. అమలు చేయదలచుకుంటే.. ఏపీ జగన్ ప్రభుత్వం విభిన్న వర్గాల వారి జీవన విధానాన్ని పరిశీలించ వలసి ఉంది. రిజర్వేషన్ ఫలాలు పొందుతూ అభివృద్ధి చెందిన వారు ఉన్నారు. అణగారిన వర్గాల వారిని కూడా చూస్తున్నామని క్రిమీలేయర్ విధానాన్ని సుప్రీం ప్రస్తావించింది. క్రిమీలేయర్ విధానం కూడా జగన్ ను తీవ్ర ఇబ్బందులలో నెట్టనుంది. క్రిమీలేయర్ విధానాన్ని అమలు చేస్తే అనేక వర్గాల ఓట్లను ఆయన పోగొట్టుకోనున్నారు.
ఒకవేళ వర్గీకరణకు సాహసిస్తే మాత్రం రెండు సామాజిక వర్గాలకు సమన్యాయం చేయవలసి ఉంది. ఏ మాత్రం తేడా వచ్చినా రాష్ట్రం రావణకాష్టంగా మారడం ఖాయం. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు, ఎస్సీ, ఎస్టీ నాయకులు సుప్రీం నిర్ణయం మేరకు వర్గీకరణ చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఏ నిర్ణయం తీసుకొంటారా? అని ఆసక్తి నెలకొంది. మొత్తానికి సుప్రీం తీర్పును అనుసరించి.. వర్గీకరణ అనుకూల నిర్ణయం తీసుకోకుంటే మాదిగలు ఆగ్రహిస్తారు. తీసుకుంటే మాలలు అలుగుతారు. అలాంటి ఇబ్బంది జగన్మోహన్ రెడ్డికి ఎదురుకావచ్చుననే అంచనాలు సాగుతున్నాయి.