ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పెద్ద వివాదాలకే దారితీసేలా ఉంది. పేదలకు సెంటు భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం రూ.7 వేల కోట్లు ఖర్చు చేసింది. 24 వేల ఎకరాల భూమి కొనుగోలు చేసింది. చాలా ప్రాంతాల్లో లే అవుట్లు వేసి సిద్దం చేసింది. మొదటిసారి ఉగాది రోజు సెంటు భూమి ఇవ్వాలని భావించారు. అయితే కోర్టు కేసుల కారణంగా వాయిదా పడింది. మరోసారి ఆగష్టు 15న ఇవ్వాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ తరవాత గాంధీ జయంతినాడు అక్టోబర్ 2న పంపిణీ చేయాలని భావించారు. అది కూడా సాధ్యం కాలేదు. తాజాగా డిసెంబరు 25న 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడంతోపాటు, అదే రోజు 15 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు ఉచితంగా నిర్మించి ఇవ్వాలని భావించడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాలు తీసుకునే లబ్దిదారుల్లో అన్ని మతాల వారు ఉన్నారు. కానీ ప్రభుత్వం క్రిస్మస్ రోజు ఇంటి జాగా ఇవ్వడంతోపాటు, అదే రోజు ఇంటికి శంకుస్థాపన చేస్తామని ప్రకటించింది. దీనిపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల స్థలాలు పొందే వారిలో 90 శాతం మంది హిందువులు ఉన్నారని, వారిని మతమార్పిడి చేసేందుకు వైసీపీ అధినేత కుట్ర పన్నారని ఆయన ఆరోపిస్తున్నారు.
ఓటు బ్యాంకులుగా తయారు చేసే కుట్ర దాగి ఉందా?
గ్రామాలకు, పట్టణాలకు దూరంగా ప్రత్యేకంగా భూమి కొనుగోలు చేసి ప్రభుత్వం ఒకే చోట వేలాది మందికి సెంటు భూమి చొప్పున ఉచితంగా ఇచ్చే ప్రయత్నం చురుగ్గా చేస్తోంది. సెంటు భూమి ఇవ్వడంతోపాటు, అందులో ఇంటిని కూడా నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఆయా కాలనీలను వైఎస్ఆర్ కాలనీలుగా నామకరణం చేసి, వైసీపీ ఓటు బ్యాంకులుగా మార్చాలనే కుట్ర దాగి ఉందనే అనుమానాలు వస్తున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇవ్వగానే ఆయా కాలనీల్లో మతమార్పిడులు చేయాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీకి చెందిన ఎంపీ విమర్శలు చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల కాలనీలు ఏర్పాటు చేసి, మతమార్పిడీలతో వైసీపీ ఓటు బ్యాంకుగా మార్పుకోవాలనే కుట్ర సాగుతోందని, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు అనుమానం వ్యక్తం చేశారు.
పేదల కాలనీలు ఏర్పడితే చాలు గద్దల్లా వాలిపోతారు?
ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే ఇళ్ల స్థలాల్లో మరో మూడేళ్లలో గృహాలు నిర్మించి కాలనీలుగా మార్చాలని వైసీపీ అధినేత భావిస్తున్నారట. ఇంటి స్థలంతోపాటు, ఇంటికి కూడా ఉచితంగా నిర్మించి ఇచ్చి, ఆయా కాలనీల్లో చేరిన లబ్దిదారులను మతమార్పిడి చేసే ప్రయత్నాలు ప్రారంభిస్తారని వైసీపీ ఎంపీ చేస్తున్న విమర్శలు సంచలనం రేపుతున్నాయి. ఇదే జరిగితే ఏపీలో పెద్ద ఎత్తున మతమార్పిడులు జరిగే ప్రమాదం ఉందని, ఇది సామాజిక అశాంతికి కూడా దారితీయవచ్చని ఎంపీ రఘురామరాజు ఆందోళన వ్యక్తం చేశారు.
క్రిస్మస్ రోజు ఎందుకు, జనవరి ఒకటిన ఇవ్వొచ్చుగా?
ఉచితంగా సెంటు భూమి కార్యక్రమం ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. చివరకు క్రిస్మస్ రోజు ఇవ్వాలని నిర్ణయించారు. మరో వారం ఆగి నూతన సంవత్సరం రోజు ఇస్తే అన్ని మతాల వారు సంతోషిస్తారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు సలహా ఇచ్చారు. ప్రభుత్వం స్థలాలు పంపిణీ ప్రారంభించేలోగా ఎవరైనా కోర్టును ఆశ్రయించే అవకాశం లేకపోలేదని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక వివాదాలకు దారితీసిన పేదలకు సెంటు భూమి కార్యక్రమం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.