విశాఖలో జరిగిన శిరోముండనం కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేన పార్టీ తన స్టాండ్ ను తెలియచేసింది. ఈ ఘటనలో నిందితులతో జనసేనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రధాన నిందితుడు పవన్ అభిమాని కావడంతో ఆయనకు జనసేనతో సంబంధాలు ఉన్నాయంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న అసత్య, అసందర్భ ప్రచారాన్ని ఖండిస్తున్నామని పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది బాధితుడు శ్రీకాంత్ కు నిందితుడు నూతన నాయుడుకు మధ్య జరిగిన వ్యవహారమని ఈ విషయంలో పవన్ పేరును తీసుకురావడమేంటని పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేసాయి.
అమానవీయమైన ఘటనకు బాధ్యులైన నిందితులు తమ పార్టీకి చెందిన వారు కాదని పార్టీ స్పష్టం చేసింది. నిందితులు తమ పార్టీ సభ్యులు కూడా కాదని వెల్లడించింది. అన్యాయాన్ని సహించే తత్వం పవన్ ది కాదని ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసని అభిప్రాయపడింది. అన్యాయాన్ని ఎక్కడున్నా జనసేన వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకర్ అన్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా నిచ్చింది. తమపై దుష్ప్రచారం జరగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న వరుస ఘటనలపై పవన్ బలంగా స్పందించిన తీరును గుర్తు చేశారు.
లక్షలాది మంది అభిమానులు ఉన్న హీరో పవన్ కళ్యాణ్ అనే విషయం అందరికి తెలుసని నిందితుడు కూడా ఆయన అభిమాని అయిండొచ్చని అంత మాత్రాన నిందితుడికి పవన్ తో లింకులు అంటగడతారా? అంటూ ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలో పవన్ పేరును తీసుకురావడం దురదుష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ప్రమేయం లేని విషయాలలో పవన్ పేరును కానీ, [పార్టీ పేరును కానీ ప్రస్తావిస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
శుక్రవారం నుంచి జనసేనపై జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకే పార్టీ తరుపున ఈ లేఖను విడుదల చేసినట్లు అర్ధమవుతోంది. కానీ ఈ స్పందనను చూస్తే జనసేన చేతులు దులిపేసుకున్నట్లు అర్ధమవుతోంది. నాగబాబు ‘గాడ్స్’ని మెచ్చుకున్న సమయంలోనూ ఆయన వ్యాఖ్యలకు జనసేనకు సంబందం లేదని పార్టీ ఓ ప్రకటన చేసింది. నూతన్ నాయుడు జనసేనకు చెందిన వాడా? కాదా? అనే విషయాన్ని ప్రక్కన పెడితే పవన్ కళ్యాణ్ పేరిట వచ్చిన ఈ లేఖతో జనసేన చేతులు దులిపేసుకుందని అర్ధమవుతోంది.











