ఎయిడెడ్ విలీనాన్ని ఒప్పకోమంటే ఒప్పకోం!
ఎయిడెడ్ ను యథాతథంగా నడింపించి పేద, మధ్య తరగతి విద్యార్థులను అధిక ఫీజుల భారీ నుంచి ఆదుకోవాలి, లేకుంటే ప్రభుత్వం కళాశాలలను ఏర్పాటుచేసి ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్న డిమాండ్స్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకుండా .. నిరసనలు, ఆందోళన బాటపట్టిన విద్యార్థి సంఘాలపై పోలీసు చర్యలను ప్రయోగిస్తోంది. మొన్నటికి మొన్న అనంతపురం ఎస్ఎస్బీఎన్ కళాశాలలో విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీచార్జి గాయాలను మరవకమునుపే మళ్లీ కాకినాడలోని ఐడియల్ ఎయిడెడ్ విద్యార్థులపై లాఠీలను ఝళిపించారు. ఎయిడెడ్ విద్యాంసంస్థల విలీనానికి వ్యతిరేకంగా కాకినాడలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు ప్రతాపం చూపించారు. జిల్లా కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా విద్యార్థులు కలెక్టర్ కార్యాలయం గేటు ముందు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ‘సీఎం .. ఢాన్ ఢౌన్’ అంటూ నినదించారు. కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి వెనుతిరిగేదే లేదని భీష్మించారు. ఒక దశలో విద్యార్థుల కార్యాలయం గెట్లు ఎక్కి దూకేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడున్న పోలీసులు లాఠీచార్జి చేశారు. దొరికిన వారిని దొరికినట్లు లాఠీలతో చితక్కొట్టారు. మరికొందరు విద్యార్థులు కలెక్టర్ గేటును నెట్టి లోపలకు వెళ్లే ప్రయత్నం చేయగా .. అడ్డుకున్నారు. పోలీసులు జరిపిన విచక్షరహిత లాఠీచార్జిలో తగిలిన గాయాలను భరించలేక విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతపురంలో జరిగిన లాఠీచార్జిలో పలువురు విద్యార్థుల తీవ్రంగా గాయపడిన సంగతి విదితమే. అలానే గుంటూరు జిల్లా నగరం మండలంలో కూడా ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు.
దాడులతో పరిష్కారం దొరకదు!
జగన్ రెడ్డి ఎయిడెడ్ విద్యాసంస్థల విలీన ఆలోచన పెద్ద సాహసమే కాదనడంలేదు. కానీ అదేదో కొంపలు మునిగిపోయినట్లుగా ఎవరితో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకోకుండా ఏక పక్ష నిర్ణయమే ఈ విషయంలో తీవ్ర ఉద్రిక్తలకు దారితీస్తోంది. జీవో నెంబర్ 35, 42, 50 ద్వారా ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించినట్లు అర్థమౌతోందని పలువురు సందేహన్ని లేవనెత్తుతున్నారు. దీంతో రాష్ట్రంలోని 137 ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న 1.65 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది. ఇది ఒక ట్రైలర్ మాత్రమే. ఆ తరువాత జూనియర్ కళాశాలు, పాఠశాల వంతు మిగిలింది. వీటిని కూడా విలీనం చేసుకుంటామని జీవోల ద్వారా ప్రభుత్వం ఎపుడో క్లియర్ గా చెప్పేసింది. ఈ క్రమంలో ఎయిడెడ్ విద్యా సంస్థలను విలీనం చేయడం ఇష్టంలేక యాజమాన్యాలు విద్యార్థులకు టీసీ ఇచ్చి, సంస్థలను మూసివేసేందుకు సిద్ధమవుతున్నారు.











