ఈసారి ఉమ్మడి నిజమాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు లాంఛనంగానే నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో కవిత విజయం దాదాపు ఖాయమైనట్లే. అక్కడ ఉన్న స్థానిక సంస్థ ప్రతినిధుల ఓట్లలో దాదాపు 500కు పైగా ఓట్లు తెరాస ఖాతాలోనే ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలకు ఉన్న ఓట్లతో ఇవి పోల్చితే తెరాస ఓట్ల సంఖ్య రెండు మూడు రెట్లు అధికం. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురే స్వయంగా ఇక్కడ నుంచి పోటీలో ఉండటంతో క్రాస్ ఓటింగ్ జరగకుండా ఓట్లన్నీ గంపగుత్తగా కవితకే పడేటట్లు కెటిఆర్, కవిత జాగ్రత్తలు తీసుకుంన్నారు.
క్యాబినేట్‌లో ఛాన్స్ దొరికేనా…
మెజార్టీ ఓట్లు తెరాస ఖాతాలోనే ఉండడంతో కవిత గెలుపు నల్లేరుమీద నడకే. ఎమ్మెల్సీగా కవిత గెలవడం దాదాపు ఖాయం. ఇక గెలిచి శాసన మండలిలో కవిత అడుగుపెట్టడం తరువాయి. లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన కవిత.. బిజెపి అభ్యర్థి అరవింద్‌కుమార్ చేతిలో ఓటమి చవిచూసింది. అయితే అప్పటి నుంచి రాజకీయాల్లో అంతగా యాక్టివ్‌గా కవిత ఉండడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ యాక్టివ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతోంది. ఎమ్మెల్సీగా గెలిచి అందరిలో ఒకరిగానే మండలిలో కవిత అడుగుపెడుతుందా? లేక క్యాబినేట్‌లో తనకు బెర్తు కన్ఫామ్ చేసుకొని చట్టసభలో కాలుపెడుతుందా అనే చర్చ పార్టీ వర్గాల్లో జరగుతోంది. కవితను మంత్రివర్గంలో తీసుకుంటారనే వార్త కూడా కొన్ని రోజులుగా బాగా వినిపిస్తుంది.
తెరాసాలో పార్టీ వాయిస్ బలంగా వినిపించే బలమైన మహిళా నాయకురాళ్లు అంతగా లేరు. ఒకరిద్దరు మహిళా నేతలు ఉన్నప్పటికిీ మహిళా లోకాన్ని ఆకర్షించడంలో వారు అంతగా సక్సెస్ కావడంలేదని టాక్. ఈ నేపథ్యంలో మహిళా ఓటర్లను తమ పార్టీ వైపు ఆకర్షించాలంటే కవితను ఎమ్మెల్సీగా గెలిపించుకొని, మంత్రిపదవి ఇచ్చి చట్టసభలకు పంపడం ద్వారా పార్టీకి మరింత లాభం చేకూరుతుందని తెరాస భావిస్తోంది. అసెంబ్లీలో ప్రతిపక్షాలను కూడా కట్టడిచేసే అవకాశం ఉంటుందనే ఆలోచనలో టిఆర్ఎస్ మదిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నిక అనంతరం కవితను క్యాబినెట్‌లో తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
రాష్ట్రంలో ఎన్నికల నగరా..
రాష్ట్రంలో కొన్ని సిగ్మెంట్లలో జరగాల్సిన ఎలక్షన్లకు ఎన్నికల నగరా మోగింది. ఇప్పటికే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు అక్టోబర్ 9న జరగనున్నాయి. దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరగాల్సిన ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. నవంబర్ 3న పోలీంగ్ జరిగితే నవంబర్ 10న ఫలితాలు వెలవడనున్నాయి. ఇదిలా ఉంటే జిహెచ్ఎంసి కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి మున్సిపల్‌శాఖ మంత్రి కెటిఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు మంగళవారం చేశారు. నవంబర్ 11 తరువాత జిహెచ్ఎంసి ఎన్నికలు జరుగుతాయని చెప్పి ఎన్నికల ఉత్కంఠకు తెరలేపారు. అంటే కెటిఆర్ చెప్పిన దానిప్రకారం చూస్తే నవంబర్ చివరి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరి వరకు మొత్తం ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. ఆ తరువాత ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత గానీ లేకుంటే ముందుగానీ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో వరుసగా ఎన్నికలు జరగనున్నాయి.