మంచి పని ఎవరు చేసిన మెచ్చుకోవాలి. అందునా సీఎం లాంటి పెద్ద వ్యక్తి నుండి ప్రశంసలందితే ఆ ఆనందానికి అవధులు ఉండవు. అలాంటి సంఘటనే ఎదురైంది ఆంధ్ర రైతుకి. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం ఘంటసాలపాలెంకు చెందిన ఉప్పల ప్రసాదరావు అనే ఆంధ్ర ఆదర్శ రైతుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేసి సాగు వివరాలు అడిగారు.
అనుకోని సంఘటన
ఒక మామూలు రైతుకు పక్క రాష్ట్ర సీఎం ఫోన్ చేస్తాడని ఎవరైనా అనుకుంటారా? ఆ రైతు కూడా అలాగే భావించాడు. మామూలు ఫోన్ గానే భావించాడు. కానీ చేసింది కేసీఆర్ అని తెలియగానే ఆశ్చర్యపోయాడు. శనివారం ఉదయం 9:30 సమయంలో కేసీఆర్ ఆంధ్ర రైతుకు ఫోన్ చేసి మరీ సాగు, తదితర విషయాల గురించి విచారించారు.
ఫోన్ వివరాలిలా ఉన్నాయి
ఇప్పటి కాలంలో వెద పద్ధతి తప్పనిసరి అవుతుందని రైతు చెప్పుకొచ్చాడు. 35 ఎకరాల్లో సీడ్రిల్ ఉపయోగించి సాగు చేసి ఎకరానికి 40-45 బస్తాలు పండించానని చెప్పారు రైతు. ఈ పద్ధతి వల్ల సాగు ఏమాత్రం తగ్గదని, ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ పద్ధతి ద్వారా తక్కువ నీటితో వరిని సాగు చేయచ్చని కూడా రైతు చెప్పడం గమనార్హం. చివరిగా ప్రసాద్ రావును భోజనానికి ఆహ్వానించారు కేసీఆర్. త్వరలో కారు పంపుతానని.. ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లాలని ఫోన్‌లో ఆహ్వానం అందించారు కేసీఆర్. తెలంగాణ వ్యవసాయ పద్ధతులు గమనించి సలహాలు అందించాలని కూడా కోరారు. కేసీఆర్ ఫోన్ చేయడంతో అక్కడి రైతులు ప్రసాద్ రావును అభినందించారు.
Also Read: ఢిల్లీకి కేసీఆర్ : ఎజెండా అదొక్కటేనా? ఇంకా ఉన్నాయా?