తెలంగాణ ఏర్పాటులో ఉద్యోగులది మరవలేనిపోరాటం. ఎన్ని ఉద్యోగ సంఘాలు ఉన్నా ఒకే మాట మీద నిలబడే వారు. రాజకీయ పార్టీలు ఇచ్చిన పిలుపుకైనా.. మరేసంఘం ఇచ్చిన పిలుపుకైనా ఒక్క పిలుపుతో ఉద్యమంలో చురుగ్గా పాల్గొనే వారు. ఉద్యోగ సంఘాల నేతలంటే అప్పటి ప్రభుత్వాలకు సైతం కాస్త భయం ఉండేది. ఇక తెలంగాణ ఏర్పాటైతే మన పాలనలో మనం ఇబ్బందులు లేకుండా ఉద్యోగాలు చేసుకోవచ్చని.. పదోన్నతులు కూడా వస్తాయంటూ ఆశపడ్డారు.
అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన వెంటనే ఉద్యోగులకు 42శాతం వేతనాలు పెరిగాయి. ఉమ్మడి రాష్ట్రంతో పోల్చితే సౌకర్యాలు పెరిగాయి. ఇదంగా రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్ళలో. ఆ తరువాత పూర్తిగా రివర్స్. ఉద్యోగు సంఘాల నేతలను పట్టించుకునే వారే కరువయ్యారు. తమ సమస్యలు చెప్పుకుందామన్నా వినేవారు లేకుండా పోయారు. ఇక ఆ తరువాత జీతభత్యాల పెంపు ఊసే లేదు. ఇప్పటికే రెండు పీఆర్సీలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని ఆగ్రహంతో ఉన్నారు ఉద్యోగులు.
దీంతో ఉద్యోగుల ఆగ్రహం పెరిగిన ప్రతిసారి ముఖ్యమంత్రి ఏదో ఒక వంకతో ఉద్యోగ సంఘాల నేతలను ప్రగతి భవన్ కు పిలిపించుకుని.. లేదంటే ఏదైనా అవకాశం ఉంటే ఉద్యోగు సంఘాల నేతలే ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్ళినప్పుడు కొద్ది రోజుల్లోనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామంటూ మాటలు చెబుతుంటారు సీఎం. దీంతో ముఖ్యమంత్రి మాటలకు ఉప్పొంగి పోయే ఉద్యోగు సంఘాల నేతలు పాలాభిషేకాలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.
అయితే ఆ తరువాత కనీసం హామీలు ఏమయ్యాయని అడిగేందుకు కూడా అవకాశం ఉండదు నేతలకు. ఉద్యోగుల నుండి ఒత్తిడి పెరిగే కొద్దీ సంఘాల నేతలు తప్పించుకు తిరిగే ప్రయత్నం చేస్తుంటారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలపై పూర్తిగా నమ్మకం కోల్పోయే పరిస్థితి తలెత్తింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు చెప్పటిన సమ్మె కు ఏ ఉద్యోగ సంఘం మద్దతివ్వలేదు.
ఎందుకంటే అదే సమయంలో ఉద్యోగు సంఘాల నేతలను ప్రగతి భవన్ పిలిపించుకున్న సీఎం కేసీఆర్ వారికి పీఆర్సీ ఇవ్వడంతో పాటు డీఏను కూడా ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. దీంతో ఆర్టీసీ సమ్మెకు ఉద్యోగుల నుండి మద్దతు లేకుండా పోయింది. దీంతో సమ్మెలో ప్రభుత్వమే పైచేయి సాధించింది. ఆర్టీసీలో ఉద్యోగు సంఘాలు కనుమరుగై పోయాయి.
తాజాగా వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు ఆర్థిక సాయం చేసేందుకు మరోసారి ముఖ్యమంత్రిని కలిసారు ఉద్యోగ సంఘాల నేతలు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. త్వరలోనే ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తానని .. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు ఉబ్బితబ్బిబవుతున్నారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు బకాయిలు ఉన్నాయి.. ఇక మూడో డీఏ కూడా రావాల్సి ఉంది. అయితే ఒక డీఏను తక్షణమే విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసారు.. ఇక డీఏ విధానంలో మార్పులు రావాలని ముఖ్యమంత్రి సూచించారు. కేంద్ర నుండి వచ్చే వరకు ఆగకుండా ప్రతి 6నెలలకు డీఏ సవరిస్తామని ఉద్యోగ సంఘాలకు తెలిపారు. అయితే ఇదైనా అమలు చేస్తారా గతంలో లాగానే అప్పటి కప్పుడు ప్రకటించి ఆ తరువాత మరచి పోతారా చూడాలి. మొత్తానికి ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రిని కలిసిన ప్రతిసారి ఇలాంటి ఒక హామీ రావడం ఆ తరువాత అది ఎప్పటికి అమలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.