కేవలం మూడే మూడు సినిమాలతో టాలీవుడ్ స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు విజయ్ దేవరకొండ. హిట్లు, ప్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ లాంటీ డిజాస్టర్ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ ‘ఫైటర్’ సినిమాను చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు పూరి. మొదటి షెడ్యూల్ 40 రోజుల పాటు ముంబైలో చిత్రీకరణ జరుపుకుంది. ఆతర్వాత కరోనా విజృభిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ‘ఫైటర్’ షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.
దాదాపు ఏడు నెలల తర్వాత సినిమా షూటింగ్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయినా సరే ఇప్పటివరకూ ‘ఫైటర్’ షూటింగ్ మొదలు కాలేదు. కారణం ఈ సినిమా షూటింగ్ ధారావిలో జరగాల్సి ఉంది. దేశంలో కరోనా విస్తృతి తగ్గినా, ధారావిలో మాత్రం షూటింగ్ జరుపుకునే అవకాశం లేదు. లాక్ డౌన్ ముగిసినప్పటికీ ధారావిలో షూటింగ్ జరపడం అంత శ్రేయస్కరం కాదని భావిస్తుందట చిత్ర యూనిట్. అందుకనే ఈ చిత్ర షూటింగ్ ను దసరా తర్వాత బ్యాంకాక్ లో జరపడానికి సన్నాహాలు చేస్తున్నాడు దర్శకుడు పూరి. గత కొన్ని రోజులుగా యూరప్ లో ఉన్న హీరో విజయ్ ఇటీవలే హైదరాబాద్ చేరుకున్నాడు.
దసరా పండుగ వెళ్లిన వెంటనే ఈ చిత్ర బృందం బ్యాంకాక్ లో వాలిపోతారని సమాచారం. ఇక ‘ఫైటర్’ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమాలో విజయ్ ఒక డాన్ కి కొడుకుగా కనిపిస్తాడట. తండ్రి కొడుకుల మధ్య పోరు రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా హిందీ భామ అనన్య పాండే నటిస్తుండగా ఛార్మి, కరణ్ జోహార్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంకా ఇందులో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తోనట్లు సమాచారం. ఈ సినిమా పై విజయ్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా విజయ్ అభిమానులను ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.