‘ఎంతటి వారలైనా కాపీ దాసులే’ అనుకోవాల్సిన రోజులు వచ్చేశాయి. కాదేదీ కాపీకి అనర్హం అని మన దర్శకులు నిరూపిస్తుంటే ఇలాంటి మాటలు ఎన్నయినా వస్తాయి. మనిషిని పోలిన మనుషులు 16 మంది ఉన్నపుడు కథలు ఉండవా అని మీరనుకోవచ్చు. ఈ సోది అంతా ఎందుకంటే తాజాగా ఓటీటీలో విడుదలైన నాని ‘వి’ సినిమా ఫలానా కొరియన్ సినిమాకి కాపీ అనే మాట వైరల్ అవుతోంది.
సినిమా చూడరా బాబూ అంటే కోడిగుడ్డుకు ఈకలు పీకేవారు ఎక్కువై పోవడం వల్లే మన దర్శకులకు తిప్పలు వచ్చిపడుతున్నాయి. త్వరగా కథ రాయాలి అంటే ఆమాత్రం కాపీ పోషణ లేకుంటే ఎలా? ఏది కొరియన్… ఏది ఫ్రెంచి? అంతకుమించి మాటలేమీ ఉండవా? మన దర్శకులు ఎంత హర్ట్ అవుతారో తెలుసుకోకుంటే ఎలా? కొరియన్ సినిమాలు గొప్పగా ఉంటాయి కాబట్టి వి సినిమా గొప్పగా ఉందని మనం అనుకోవాలా? ఈ లాజిక్కులేంటో అర్థంగాకుండా ఉంది.
నానీని ఆడిపోసుకుంటారేం?
హీరో నానీని ఎందుకలా ఆడిపోసుకుంటారు. అంతకుముందు ‘గ్యాంగ్ లీడర్’ విడుదలైనపుడు కూడా కొరియన్ సినిమాకి కాపీ అన్నారు. దానికి నాని కస్సుమన్నా మనకు బుద్ధిరాలేదు. గ్యాంగ్ లీడర్ సినిమా కొరియాలో Girl Scout సినిమా అట. ఆ కథ ప్రకారం ఓ నలుగురు ఆడవాళ్లు కష్టపడి పోగుచేసుకున్న డబ్బుతో ఓ సూపర్ మార్కెట్ పెడదామనుకుంటారు. అందులో ఒకరు ఆ డబ్బుతో ఉడాయిస్తారు. ఆమెను ఎలా పట్టుకుంటారనే లైన్ ను మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చేశారనేది అభియోగం. ఇంతకీ వీ సంగతేంటో చూద్దాం. ఇది i saw the devil సినిమా అంటున్నారు. మరి ఈ సినిమాని ఇంతకుముందు హక్కులు కొని హిందీలో ‘ఏక్ విలన్’ తీశారు కదా. ఆ మాత్రం తెలియదా? అదేమంటే లైన్ అదే అంటున్నారాయె.
ఆ ‘బేబీ’నే అలా చేసింది
కొరియన్ సినిమా ‘మిస్ గ్రానీ’ ఆధారంగా మొన్నామధ్య ‘ఓ బేబి’ వచ్చింది. అంతెందుకు ప్రభాస్ సినిమా సాహో చూసి మనం అహో అంటే బాలీవుడ్ అదరహో అంది. జెరోమ్ సల్లే దర్శకత్వంలో వచ్చిన హాలీవుడ్ మూవీ ‘లార్గో వించ్’ అనే ఫ్రెంచ్ సినిమా నుంచి కాపీ కొట్టేశారన్నారు. సాహో అదే అయితే త్రివిక్రమ్ ను కూడా ఆడిపోసుకున్నారు కదా అజ్ఞాతవాసికి కూడా మూలకథ అదేనని. ఏమిటీ గందరగోళం. ఈ కొరియా గిరియా ఫ్రెంచ్ మనకొద్దు ఏకంగా జర్మనీ సినిమాల్లోకి వెళితే ఎవరికీ దొరకరు కదా. అక్కడా సమస్యలే. goodbye lenin సినిమాని ‘దూకుడు’గా ఎత్తేశారంటున్నారు. విమర్శలు చేయడంలో కూడా అంత దూకుడు పనికిరాదు.
మౌళీ సాబ్ జోలికొస్తే బాగుండదు
తెలుగు సినిమా ఖ్యాతికి అంతర్జాతీయ స్థాయికి పెంచిన రాజమౌళి సారువారినీ వదలిపెట్టడం లేదు. ‘బాహుబలి’లో రానా వాహనం, ఆయన దానితో యుద్దం చేసే తీరు అచ్చుగుద్దినట్టుగా Hercules సినిమా నుంచి దించేశారనటమేంటండీ బాబూ. అలాగే ఎద్దులు కొమ్ములు కాలుతుండగా పరిగెత్తే సీన్ ఒక వెబ్ సిరీస్ నుండి కాపీయట. మాటలనడానికైనా మర్యాదుండాలి. అదేంటే ‘మర్యాద రామన్న’ హాలీవుడ్ మూకీ మూవీ Our Hospitality కాదా అనడం ఒకటి. సౌత్ కొరియాలో హిట్ అయిన బోలెడన్ని సినిమాలను ఎంచక్కా ఎత్తేశారట. నాని ‘పిల్ల జమీందార్’ ఆ మధ్య వచ్చిన ‘నెక్ట్స్ నువ్వే’ వంటి వన్నీ దక్షిణ కొరియా దయాదాక్షిణ్యాలేననుకోవాలేమో.
తమళ పరిశ్రమ కూడా మనకన్నా తక్కువేమీ కాదు. ఈమధ్యే విజయ్ మీద పడ్డారు. ఆయన ‘మాస్టర్’ సినిమా కొరియన్ సినిమాకు ఫ్రీమేక్ అట. ఇందులో విజయ్ మూగ బధిర విద్యార్థులకు ట్యూటర్‌గా నటిస్తున్నాడు. కొరియన్ మూవీ సెలెన్సడ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందట. ఆ మాట కొస్తే మన విజయ్ సినిమాని కాపీ కొట్టి ఆస్కార్ అవార్డు సాధించుకున్నవారు లేరా అని మీరనవచ్చు. అదేంటో తెలుసా ‘పారసైట్’ సినిమా. దీనికి ఇటీవలే ఆస్కార్ అవార్డు వచ్చిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓ కొరియన్ చిత్రం ఆస్కార్ అవార్డు గెలవడం ఇదే మొదటిసారి.
ఆ మాటకొస్తే పారసైట్ కథ మనది కాదా?
విజయ్ హీరోగా కె.ఎస్.రవికుమార్ రూపొందించిన ‘మిన్సార కన్నా’తో ‘పారసైట్’కు పోలికలు ఉన్నాయనేది అభియోగం. వింటే మీకే బుర్ర తిరిగిపోయి ఉండాలి. బిలియనీర్ అయిన హీరో తన ప్రేమ కోసం హీరోయిన్ ఇంటిలో పనివాడిగా చేరతాడు. తన కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి ఆ ఇంట్లో పనివాళ్లుగా పెడతాడు. చివరకు తన ప్రేమను అతడు ఎలా గెలిపించుకున్నాడు అనేదే ఆ కథ. పారసైట్ లైన్ కూడా అదేమరి.
పారసైట్ కథేంటంటే ఓ ధనిక కుటుంబాన్ని ఓ పేద కుటుంబం బోల్తా కొట్టించి వాళ్ల ఇంట్లో పనివారిగా ప్రవేశిస్తుంది. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులన్న విషయం యజమానుల దగ్గర దాచిపెట్టి యజమాని కుటుంబం విహారయాత్రకు వెళ్లినప్పుడు అక్కడి సౌకర్యాలను ఉపయోగించుకుంటూ గడుపుతుంటారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని యజమానికి తెలిస్తే.. వాళ్ల ఉద్యోగాల పోతాయన్న భయంతో వారేం చేశారు? అన్నదే ఈ సినిమా.
కాబట్టి ఎవరు ఎవర్ని కాపీ కొట్టారన్నది కాదు ప్రేక్షకుల గుండెల్లో దిగిందా లేదా అన్నదే ఇక్కడ ముఖ్యం. కాపీ కొట్టే గుండె ధైర్యం కూడా కావాలి. మంచి డైరెక్టర్ అనిపించుకోవాలంటే బాగా కాపీకొట్ట గలగలగాలి. చిన్నప్పటి నుంచి కాపీలు కొట్టడం బాగా అలవాటున్నవాళ్లు మాత్రమే ఆ పనిబాగా చేయగలరు. మనం స్టార్ డైరెక్టర్ అనిపించుకుని మన స్టార్ మారాలంటే తప్పదేమో. అసలీ గోలంతా ఎందుకు మనం ఈ తలుగు సినిమాలు చూసి ఈకలు పీకడం కోసం మళ్లీ కొరియన్ సినిమాలు చూసే బదులు ఏకంగా కొరియన్ సినిమాలే చూసేస్తే పోలా. మన టైమూ వేస్ట్ కాదు మనీ కూడా వేస్ట్ కాదు.
– హేమసుందర్ పామర్తి