ఏపీలో దళితులపై దాడులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం ఐనంపూడి గ్రామంలో ఓ దళిత కుటుంబానికి చెందిన పూరి గుడిసెకు పొరుగున ఉన్న వడాలి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త అర్థరాత్రి నిప్పుపెట్టడంతో వివాదం రాజుకుంది. ఆ సమయంలో ఆ ఇంట్లో ఆరుగురు కుటుంబ సభ్యులు నిద్రిస్తున్నారు. అదృష్ణవశాత్తూ వారంతా ప్రాణాలతో బయటపడ్డారు.
వారిని పరామర్శించేందుకు వెళుతున్న కృష్ణా జిల్లా టీడీపీ నేతలు వర్ల రామయ్య, బచ్చుల అర్జునుడు, మాజీ మంత్రి దేవినేని ఉమ, తంగిరాల సౌమ్య, మరికొందరు దళిత నేతలను అడ్డాడ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. దళిత కుటుంబం మొత్తాన్ని చంపాలని చూసిన అనుమానితులను అరెస్టు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ సీనియర్ నేతలు వర్ల రామయ్య మండిపడ్డారు. వెంటనే పోలీసు ఉన్నతాధికారులు స్పందించి దళిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే?
ముదినేపల్లి మండలం ఐనంపూడి గ్రామానికి చెందిన 19యేళ్ల దళిత బాలికను పెళ్లి చేసుకుంటానంటూ, పక్కగ్రామం వడాలికి చెందిన వైసీపీ కార్యకర్త ఆమెను లొంగదీసుకున్నారు. పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయడంతో అగ్రవర్ణానికి చెందిన ఆ వైసీపీ కార్యకర్త ఎలాగైనా వదిలించుకోవాలని చూశాడని సమాచారం. గతంలోనే అతనిపై బాధిత మహిళ పోలీసు కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి కక్ష పెంచుకుని బాధితురాలి కుటుంబంపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడు.
తాజాగా అందరూ నిద్రస్తున్న వేళ ఇంటికి నిప్పంటించాడని సమాచారం. ఈ ప్రమాదంలో ఆ దళిత మహిళ ఇళ్లు కాలి బూదిదైంది. పోలీసు కేసు పెట్టినా నిందితులను ఇంత వరకూ అరెస్టు చేయలేదు. దీంతో దళిత సంఘాలు, టీడీపీ నేతలు బాధితురాలిని పరామర్శించాలని ఐనంపూడి బయలు దేరారు. అయితే అడ్డాడ హైవే వద్ద 300 మంది పోలీసులు టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.











