‘లవకుశ’ సినిమాలో ‘వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా’ పాట వినగానే మనం మైమరచి పోతాం. శ్రీరాముడిగా ఎన్టీఆర్, సీతాదేవిగా అంజలీదేవిల నటన ఒక ఎత్తయితే, ఇందులో లవకుశులుగా నటించిన నాగరాజు, నాగ సుబ్రహ్మణ్యంల నటన ఒక ఎత్తు. 1963లో పూర్తిస్థాయి కలర్ లో విడుదలైన తొలిసినిమా ఇది. సి.పుల్లయ్య, సి.ఎస్. రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఘంటసాల సంగీతం సమకూర్చారు. ఈ లవకుశ పాత్రధారుల్లో ఒకరైన నాగరాజు ఈరోజు ఉదయం చనిపోయారు. లవుడు పాత్రధారి నాగరాజు, కుశుడు పాత్రధారి సుబ్రహ్మణ్యం ఆ సినిమా తర్వాత మంచి స్నేహితులుగా మారిపోయారు. ఈ సినిమా విడుదలై 57 సంవత్సరాలైనా అది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ చిత్రమే. నిజానికి ఈ సినిమా షూటింగ్ పూర్తికావడానికి అనేక కారణాల వల్ల ఐదేళ్లు పట్టింది.
వరించి వచ్చిన అవకాశాలు
అవకాశం మాటేమోగాని ఈ బాలనటుల వయసు సినిమా పూర్తయ్యే సరికి ఐదేళ్లు పెరిగిపోయింది. అందుకే సినిమా చూస్తుంటే ఆ తేడా కనిపిస్తుంది. వీరికి ఆ అవకాశం ఎలా వచ్చిందో చూద్దాం. కుశుడి పాత్రధారి నాగసుబ్రహ్యణ్యం ఊరు అమలాపురం. తండ్రి ఉయ్యూరు సబ్బారావు దగ్గర బుర్ర కథలు చెప్పటం నేర్చుకుని ఎనిమిదో ఏట నుంచే బుర్రకథలు చెప్పేవారు. ఓ రోజు అతని ప్రదర్శనకు దర్శకుడు సి. పుల్లయ్య రావడం, లవకుశ సినిమాలో కుశుడి పాత్ర అవకాశం ఇవ్వడం జరిగింది. అలా తన 11వ ఏట షూటింగులో అడుగుపెట్టారు.

ఇక లవుడు పాత్రధారి నాగరాజు విషయానికి వస్తే అతని తండ్రి ఏవీ సుబ్బారావు కూడా నటులే. ఆయన పల్లెటూరు పిల్ల, కీలుగుర్రం,పెద్ద మనుషులు తదితర చిత్రాల్లో నటించారు. చిత్తూరు నాగయ్య గారు అనుకోకుండా నాగరాజును చూడటం, ఆయన నిర్మిస్తున్న భక్త రామదాసులో రాముడి పాత్రకు ఎంపిక చేయడం జరిగింది. అప్పుడు నాగరాజు వయస్సు ఏడేళ్లు. ఆ తర్వాత మరో రెండు చిత్రాల్లో నటించారు. అతని తండ్రికి సి.పుల్లయ్య స్నేహితుడు కావడంతో లవుడి పాత్రకు ఎంపిక చేశారు. అలా ఈ ఇద్దరికీ లవకుశలో చోటుదక్కింది.
స్వభావాల ప్రకారమే వేషాలు
ఈ ఇద్దరినీ ఆయా పాత్రలకు ఎంపిక చేయడం కూడా తమాషాగానే జరిగింది. వీరి స్వభావాలను బట్టి ఆ పాత్రలు ఇచ్చారు. లవుడు చురుకుగా ఉండాలి కాబట్టి అలా ఉండే నాగరాజుకు ఆ పాత్ర ఇచ్చారు. సుబ్రహ్మణ్యం నిదానస్తుడిగా కనిపిస్తాడు కాబట్టి కుశుడి పాత్ర ఇచ్చారు. ఇద్దరికీ ఆరు నెలల పాటు రోజుకు రెండు గంటల చొప్పున శిక్షణ ఇచ్చారు. వెంపటి పెద్దసత్యం, చినసత్యంల వద్ద నాట్యం, బాణాలు వేయడంలో ట్రైనింగ్ ఇచ్చారు. డైలాగ్ డెలివరీ, లిప్ మూవ్ మెంట్ తదితర అంశాలన్నీ నేర్పారు. లవకుశ తర్వాత సీతారామ కల్యాణం, వెంకటేశ్వర మహత్యం, వెలుగునీడలు చిత్రాల్లో సుబ్రహ్మణ్యం నటించారు.
నాగరాజు పరిపూర్ణానందస్వామి నిర్మిస్తున్న గోమాత వైభవం’ సిరియల్లో కపిల మహర్షి వేషం వేశారు. లవకుశ తర్వాత ఈ ఇద్దరూ కొంతకాలంపాటు కలుసుకోవడం కుదరలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు అమలాపురంలో కలుసుకున్నారు. అప్పటినుంచి వీరి స్నేహం కొనసాగింది. సుబ్రహ్మణ్యం అమలాపురంలోనే టైలర్ గా సెటిలయ్యారు. ఆయనకు ముగ్గురు కుమారులు. నాగరాజుకు ముగ్గురు కుమార్తెలు. ఆయన హైదరాబాద్ లోనే గాంధీనగర్ లో సెటిలయ్యారు.
ఈరోజు నాగరాజు మరణించారు. నిజానికి వయసులో నాగరాజు కన్నా వయసులో సుబ్రహ్మణ్యమే పెద్ద. లవకుశ సినిమా ద్వారా బాలనటులుగా ఈ ఇద్దరికీ మంచి పేరు వచ్చింది. వీరికి ఇప్పుడు వయసు మీద పడింది. అనారోగ్యం నాగరాజును కబళించింది. సుబ్రహ్మణ్యానికి నాగరాజు మరణం పెద్ద లోటుగానే భావించాలి. ఎందుకంటే అన్నదమ్ములు కాకపోయినా సినమాలో అన్నదమ్ములుగానే నటించారు కాబట్టి వీరి మధ్య కూడా అలాంటి అనుబంధమే పెనవేసుకుంది.











