చూస్తుంటే నాగశౌర్య మాంఛి కసి మీద ఉన్నట్టుగానే కనిపిస్తున్నాడు. తన సినిమాలను ఒకదాని తరువాత ఒకటిగా థియేటర్లలో దిగబెట్టడానికి ఒక రేంజ్ లో కష్టపడుతున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల జాబితాలో ‘వరుడు కావలెను‘ ఒకటిగా కనిపిస్తోంది. టైటిల్ ను బట్టే ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే విషయం అర్థమవుతోంది. నాగశౌర్య జంటగా రీతూ వర్మ నటిస్తున్న ఈ సినిమాకి, లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహిస్తోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగును రిలీజ్ చేశారు.
“చూపులే నా గుండె అంచుల్లో కుంచెలా .. ” అంటూ ఈ సాంగ్ సాగుతోంది. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన బాణీకి, రాంబాబు గోసాల సాహిత్యాన్ని అందించాడు. మొదటిసారిగా విన్నప్పుడు ఒక పాఠంలా .. అలికినట్టుగా అనిపించినప్పటికీ, ఆ తరువాత సాహిత్యంలో పదాలను విడదీసుకుంటూ వెళితే అందమైన భావాలే తగులుతున్నాయి. సిద్ శ్రీరామ్ ఆలాపన ఈ పాటకు ప్రాణం పోసినట్టుగా అనిపిస్తుంది. మెలోడీ పాటలతో మాయచేసే మధురమైన గాత్రం సిద్ శ్రీరామ్ సొంతం. అందువలన ఆయన ఆలాపన పాట వెంట పరుగులు తీయిస్తుంది .. తేనె పాకం తాగిస్తుంది.
లవర్ బాయ్ గా మార్కులు కొట్టేసిన నాగశౌర్య, ఈ మధ్య ప్రయోగాల పేరుతో అమ్మాయిలు ఆశించినట్టుగా తెరపై కనిపించలేదనే చెప్పాలి. అలాంటి నాగశౌర్య ‘వరుడు కావలెను‘లో చాలా హ్యాండ్ సమ్ గా కనిపిస్తున్నాడు. మంచి ఫీల్ ఉన్న ఒక ప్రేమకథను ఆయన చేస్తుండటం అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయం. లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కథలకు ప్రేక్షకుల సపోర్టు ఎక్కువగా ఉంటుంది గనుక, ఈ సారి హిట్ నుంచి నాగశౌర్య తప్పించుకోలేడనే అనిపిస్తోంది. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Must Read ;- దూకుడు మీదున్న నాగశౌర్య











