కె.ఎఫ్.సి. చికెన్ కు ఇది పోటీ కంపెనీ అనుకుంటున్నారా?.. కాదండీ బాబూ మెగాస్టార్ చిరంజీవి తన మనవరాళ్ల కోసం ఇచ్చిన కంపెనీ. ఎంకేసీ అంటే మెగాస్టార్ కొణిదెల చిరంజీవి చికెన్ అన్నమాట.
మెగాస్టార్ చిరంజీవి నలభీముడనే విషయం ఈ కరోనా కాలంలోనే అందరికీ తెలిసింది. ఆయన చేతి వంట మనం తినలేదుగానీ తిన్న వారు మాత్రం ‘వావ్ ’అంటూ లొట్టలేస్తున్నారు. ఆ మధ్య అమ్మ కోసం దోశెలు వేసి పెట్టిన చిరు ఈసారి మనవరాళ్ల కోసం ఏకంగా కేఎఫ్ సీ చెకెన్ చేసి పారేశారు.. సారీ చేసి తినిపించేశారు. ప్రస్తుతం ఆయన ఇంటికే పరిమితమయ్యారు.
ఇంకా షూటింగులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఆయన తన మనవరాళ్ల కోసం చేసిన చెకెన్ వంట వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది విపరీతంగా వైరల్ అయ్యింది.‘ఆదివారం కదా.. బోర్ కొడుతోంది ఏం చేద్దాం?’ అంటూ మనవరాళ్ళతో కూర్చుని మాట్లాడుతూ వీడియో మొదలు పెట్టేశారు. ఆయనతో ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు. ఒకరు సుస్మిత కూతురు, ఇంకొకరు శ్రీజ పెద్ద కూతురు ఉన్నారు. సుస్మిత కూతురు బయటి నుంచి కెఎఫ్సీ చికెన్ తెచ్చుకుందాం అంటుంది.
దానికి చిరు కోవిడ్ టైమ్లో బయటి నుంచి అలాంటివేవీ వద్దంటారు.‘ఇంట్లోనే చేసుకుందాం’ అంటూ వంట ఇంట్లోకొచ్చారు. అసలు కేఎఫ్ సీ చికెన్ చేయాలంటే ఏమేం కావాలి? ఎలా తయారు చేయాలి అంటూ మొదలెట్టేశారు. నాలుగు నిముషాల నిడివి ఉండే వీడియో అది. అది చూస్తే చిరు వంటల్లో ఎంతటి ఘనాపాటో అర్థమవుతుంది. చక్కటి చికెన్ వంటాకాన్ని చేసి నోరూరించేశారాయన.
మెగాస్టార్ చిరంజీవి మనవరాళ్లు కూడా తాతకు మించినవారిలానే ఉన్నారు. వారూ తాతకు ఓ చేయి అందించేసి తమకు కావలసిన చికెన్ తినేశారు. మీరు కూడా ఈ వీడియో చూసి ఎలా చేయాలో నేర్చుకోండి మరి. పైగా చిరంజీవి ఓ ట్విస్ట్ కూడా ఇచ్చారు. రేపటి తరం అభిరుచికి నచ్చేటట్టు చేయగలిగితే ఆ కిక్కే వేరప్పా అంటూ తన ట్విట్టర్ లో తమ్ముడు వవన్ తరహా డైలాగ్ ఒకటి కొట్టేశారు. దటీజ్ మెగాస్టార్.
రేపటి తరం అభిరుచికి నచ్చేటట్టు, రుచిగా ఏమన్నా చేయగలిగితే…ఆ కిక్కే వేరప్పా. Here it is..https://t.co/wIH22bHUKN
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 1, 2020