ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా వినోద్ అనంతోజు దర్శకత్వంలో రూపొందిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఇటీవలే ప్రేక్షకులను పలకరించింది. గుంటూరు నేపథ్యంలో .. ఒక మధ్యతరగతి కుర్రాడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమాలో కథానాయకుడిగా తండ్రి ‘కొండల్రావ్’ పాత్రకి మంచి ఆదరణ లభించింది. ఒక మధ్యతరగతి తండ్రి తన పిల్లల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు? ఒక వైపున వాళ్లపై కోప్పడుతూనే వాళ్ల అవసరాలను తీర్చడానికి ఎంతగా తాపత్రయ పడతాడనేది ఈ సినిమాలో ‘కొండల్రావ్’ పాత్ర ద్వారా చూపించారు. ప్రతి మధ్యతరగతి తండ్రి ఈ పాత్రలో తనని తాను చూసుకునేలా ఈ పాత్రను తీర్చిదిద్దారు. ఆ పాత్రను అంత గొప్పగా పండించిన నటుడి పేరే ‘గోపరాజు రమణ’.
రంగస్థలం నటుడిగా గోపరాజు రమణకి మంచి అనుభవం వుంది. చాలా ధారావాహికల ద్వారా ఆయన బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమే. అడపాదడపా సినిమాల్లోను మెరిసిన ఆయన, తాజా ఇంటర్వ్యూలో ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ సినిమాకి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. “ఒకసారి నేను ‘రవీంద్రభారతి’లో ఒక నాటకంలో నటిస్తూ ఉండగా, ఈ సినిమా దర్శకుడు వినోద్ అనంతోజు నన్ను చూశాడట. ‘కొండల్రావ్’ పాత్రకి నేనైతే బాగుంటుందని అనుకున్నారట. ఆ తరువాత మా స్వగ్రామమైన ‘కొలకలూరు’లో కూడా నాటకాలు వేస్తుండగా ఆయన చూశారు. ఆ నాటకాల్లో నటించిన కొంతమందిని ఈ సినిమా కోసం తీసుకోవాలనే నిర్ణయానికి ఆయన వచ్చాడు.
నేను హైదరాబాద్ వచ్చిన తరువాత ఆయన తన ఆఫీస్ కి నన్ను పిలిపించి కథ చెప్పాడు. ఆ పాత్రకి గల ప్రాధాన్యత కారణంగా నేను వెంటనే ఒప్పేసుకున్నాను. “లొకేషన్ ఎక్కడ సార్?” అని నేను అడిగితే, “మీ ఊర్లోనే .. “అని ఆయన చెప్పడంతో ఆశ్చర్యపోయాను. ‘కొలకలూరు’లోనే నేను పుట్టిపెరిగాను .. అక్కడే చదువుకున్నాను .. అక్కడే ఉద్యోగం కూడా చేశాను. మా సొంత ఊరు కావడం వలన మా చిన్నబ్బాయి కూడా దర్శక నిర్మాతలకు మంచి సహకారాన్ని అందించడం జరిగింది. కొండల్రావ్ పాత్ర పోషణ విషయంలో నేను ఎవరినీ అనుకరించలేదు .. దర్శకుడు చెప్పినట్టుగా చేశాను. ఆ పాత్రకు మంచి పేరు రావడంతో చాలా ఆనందంగా వుంది.
ఈ సినిమాను నిర్మించిన భవ్య క్రియేషన్స్ ఆనంద్ ప్రసాద్ గారి గురించి ముందుగా చెప్పుకోవాలి. కథ .. కథనం .. నటీనటుల విషయమై నిర్మాతలు ఎంతగానో ఆలోచన చేస్తారు. ఈ సినిమాకి సంబంధించి దర్శకుడు కొత్త .. రచయిత కొత్త .. ఆర్టిస్టులు చాలావరకూ కొత్తవారే. హీరోహీరోయిన్లు కూడా ఒకటి రెండు సినిమాలు చేసిన వాళ్లే. అయినా ఆనంద్ ప్రసాద్ గారు దర్శకుడిపట్ల గల నమ్మకంతో ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు రావడం విశేషం. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికీ .. ఇంతగా ఆదరణ పొందడానికి కారణమైన ఆయనకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అంటూ తన మనసులోని మాట చెప్పుకొచ్చారు.











