చెదురుమదురు ఘటనలు మినహా ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 71 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో 7552 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పంచాయతీ ఎన్నికలతో పోల్చుకుంటే ఓటింగ్ శాతం బాగా తగ్గింది. కొన్ని జిల్లాల్లో పోలీసుల తీరు విమర్శలకు దారి తీసింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో 7వ డివిజన్ లో టీడీపీ అభ్యర్థి భర్తపై వైసీపీ నేతలు దాడికి దిగారు. పోలీసులు వచ్చినా ప్రేక్షకపాత్ర వహించారు. టీడీపీ వారిపై దాడి చేసిన వారిపై కనీసం కేసులు కూడా నమోదు చేయకపోవడం అనేక విమర్శలకు దారి తీసింది.
రిగ్గింగ్ అడ్డుకున్నందుకు దాడి
చిత్తూరు జిల్లాలో మున్సిపాలిటీల ఎన్నికల తీరు వావాదాస్పదమైంది. చిత్తూరు కార్పొరేషన్ 29 వార్డు డివిజన్‌లో వైసీపీ కార్యకర్తలు రిగ్గింగ్‌కు యత్నించారు. అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వనిత భర్త శ్రీనివాసులు రిగ్గింగ్ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు అతనిపై దాడికి దిగాయి. తనకు న్యాయం చేయాలంటూ వనిత భర్త ఎస్ ఐ శ్రీనివాసులు కాళ్లు పట్టుకుని చాలా సేపు వదల్లేదు. వైసీపీ నేతల నుంచి తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ఈ ఘటన చిత్తూరులో కలకలం రేపింది. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు చేదు అనుభవం ఎదురైంది. తన మనవరాలు పోటీలో ఉన్న వార్డు సమీపంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు సుగుణమ్మ ఓ ఇంట్లోకి వెళ్లారు. ఈ సమయంలో పోలీసులు వచ్చి కెమెరాలతో వీడియో రికార్డింగ్ ప్రారంభించారు. దీంతో సుగుణమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను అక్కడ నుంచి పంపించి వేశారు. ఇక తిరుపతి కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉండగా ఇప్పటికే 22 ఏకగ్రీవం అయ్యాయి. ఏడో డివిజన్ ఎన్నికలను ఎస్‌ఈసీ నిలిపివేసింది. మిగిలిన 27 డివిజన్లలో ఎన్నికలు నిర్వహించారు. 21 డివిజన్లలో టీడీపీ తన అభ్యర్థులను పోటీలో నిలిపింది. తిరుపతిలో 65 శాతం ఓటింగ్ నమోదైంది.
సేవ్ వైజాగ్ స్టీల్..
విశాఖ కార్పొరేషన్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఓటర్లు సేవ్ వైజాగ్ స్టీల్ అనే స్లిప్పులను కూడా ఓటుతో పాటు వేశారు. శ్రీకాకుళం, విజయనగరంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉత్తరకోస్తా జిల్లాల్లో 68 శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఉభయగోదావరి జిల్లాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఏలూరు కార్పారేషన్లో ఓటు వేయడానికి వెళ్లిన మంత్రి ఆళ్ల నానికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఓటు స్థానంలో మహిళ పేరు ఉండటంతో మంత్రి ఆళ్ల నాని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. విజయవాడలో చెదరుమదులు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుంటూరు అంకిరెడ్డిపాలెం డివిజన్లో వైసీపీ శ్రేణులు రిగ్గింగ్‌కు ప్రయత్నించారు. టీడీపీ నాయకులు అడ్డుకోవడంతో వారు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. పిడుగురాళ్ల, మాచర్ల మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. ప్రకాశం జిల్లాలోనూ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ మూడు జిల్లాల్లో 62 శాతం పోలింగ్ నమోదైంది.నెల్లూరు జిల్లాలో స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగానే ముగిశాయని చెప్పవచ్చు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు. రాయలసీమ నాలుగు జిల్లాల్లో 63 శాతం ఓటింగ్ నమోదైంది.
ఓటమి భయంతోనే దాడులు
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగడం హేయమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు దాడులకు తెగబడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఏపీలో జరిగిన ఎన్నికల ప్రక్రియను చూస్తే అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
Must Read ;- విశాఖ స్టీల్, పోలవరంపై సెల్ప్ గోల్.. వైసీపీ పవర్ ఫుల్ డ్రామా