(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
పొరుగునే ఉన్న తెలుగు రాష్ట్రంలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలకు ఏమాత్రం తీసిపోని విధంగా గాజువాక వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఓట్లకు, అభివృద్ధికి లింకు పెట్టారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కుటుంబం నుంచి కొడుకు, కోడలు గ్రేటర్ అభ్యర్థులుగా బరిలో దిగారు. వారి తరఫున ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే నాగిరెడ్డి పోలైన ఓట్లు ఆధారంగానే అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జనరల్‌గా ఇచ్చేయవచ్చు కానీ, తాను బూత్‌ల వారీగా పార్టీకి వచ్చిన ఓట్లను లెక్కించి, ఆదరించిన ప్రాంతాల్లో మాత్రమే అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ఏ బూత్‌లో ఎన్ని ఓట్లు తగ్గాయో చూసుకొని అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. అందులో అనుమానం కూడా వద్దని స్పష్టం చేశారు. “ ఎవరైతే ఆదరించారో ఆ ఏరియాను మాత్రమే అభివృద్ధి చేస్తా” అని కుండ బద్దలు కొట్టినట్టు తెలిపారు.
పార్టీలకు అతీతం అని ప్రగల్భాలు..
సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా తమ ప్రభుత్వం అందిస్తుందని, ఓటు వేసినా వేయకపోయినా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు చేరుస్తామని గత రెండేళ్లుగా చెప్పని రోజంటూ లేదు. సచివాలయ ఉద్యోగాల నియామకం నుంచి అన్ని విషయాల్లోనూ పార్టీ రహితంగా పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపి ప్రభుత్వమని మంత్రులు, ఎమ్మెల్యేలు ఉదర కొట్టడం ప్రజలకు కొత్తేమీ కాదు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి.
ప్రతిపక్షంపై నోరు పారేసుకోవడం..
ఇప్పటి వరకు ప్రతిపక్ష నేతలపై నోరు పారేసుకుంటున్న అధికారపార్టీ నేతలు ఇప్పుడు ఓటర్ల పై పడినట్టు ఉన్నారు. ఎంతో హుందాగా వ్యవహరించాల్సిన మంత్రులు నోటి వెంట బూతులు వెలువడుతూ.. ఆ పదవులకే కళంకం తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా.. తెలుగుదేశం పార్టీ నేతలపై నిరాధారంగా, ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబుని తిట్టకుంటే వీరెవరికీ రాత్రులు నిద్ర కూడా పట్టదు. అన్ని ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని.. కనీస గౌరవం లేకుండా దూషించడంపై ఇప్పటికే ప్రజల్లో ఎంతో వ్యతిరేకత ఉంది. అక్కడితో ఆగకుండా ఇప్పుడు ఓట్లు వేయని ప్రజలను కూడా టార్గెట్ చేస్తున్నట్టు ఎమ్మెల్యే వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయకుండా కట్టడి చేసేందుకు ఎన్ని రకాల కుయుక్తులు పన్నారో ప్రజలంతా కళ్లారా చూశారు. ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చించేయడం, కాదంటే బలవంతంగా పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం, తప్పుడు కేసులు బనాయించడం ఒక్కటేంటి ఇలా ఎన్నో చేశారు. ప్రజా క్షేత్రంలో ఉన్న నేతలు కావడంతో వాటిని తట్టుకుని నిలబడగలుగుతున్నారు.
ఇప్పుడు ప్రజల వంతు..
అడిగిన వాడికి, అడగనోడికి డబ్బులు పంచుతున్నాం కదా… ఎవడి కోసం ఓటు వేయరు అన్న అహంకారం అధికార పార్టీ నేతల్లో హెచ్చుమీరుతున్నట్టు వారి వైఖరి స్పష్టం చేస్తోంది. బూతుల వారీగా ఓటర్ల సంఖ్యను లెక్కించి తక్కువ ఓట్లు వేసిన ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తామని, అధికార పార్టీకి ఓట్లు వేసిన ప్రాంతాలను మాత్రమే అభివృద్ధి చేస్తామని ఓటర్లను బెదిరించే వరకు నేతలు దిగజారడం ప్రారంభించారు. ఇటువంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఓట్లకు డబ్బులు తీసుకుంటున్న ఓటర్ల పట్ల వ్యవహరించినట్లుగానే ఓటర్ల అందరి పట్ల వ్యవహరించడంతో ఇప్పుడు ఆగ్రహం పెల్లుబుకుతోంది.
కేసులు కూడా బనాయిస్తారేమో!
అధికార పార్టీ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే, ఆ పార్టీకి ఓటు వేయకుంటే పోలీసు కేసుల్లో ఇరికిస్తారేమో అన్న భయం వ్యక్తమవుతోంది. ఆ పార్టీ ఎంతకైనా తెగిస్తుందని ప్రతిపక్ష నేతలు అభిప్రాయపడుతున్నారు.
Must Read ;- ఇంత అరాచకమైన ఎన్నికలు ఎన్నడూ చూడలేదు..











