పాట ఎంత మధురంగా ఉన్నా తేడా వస్తే ఎన్ని పాట్లు పడాలో ఇప్పుడు ‘లవ్ స్టోరీ’ చిత్ర యూనిట్ కు అర్థమైంది. సారంగ దరియా పాటపై ఏర్పడిన వివాదానికి చరమ గీతం పాడాలన్న నిర్ణయానికి ఆ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల వచ్చారు.
తెలుగు సినిమా రంగంలో రాముడు మంచి బాలుడు లాంటి దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇప్పటిదాకా ఆయనపై ఎలాంటి మరకలూ లేవు. ఈ పాట పుణ్యమా అని ఆయన గళం విప్పాల్సి వచ్చింది. సారంగ దరియా పాట గురించి సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది కాబట్టి సోషల్ మీడియా వేదికగానే ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ పాట గురించి శేఖర్ కమ్ముల ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.
‘చాలా ఏళ్ళ క్రితం రేలారే రేలా ప్రోగ్రామ్ లో శిరీష అనే అమ్మాయి సారింగ దరియా పాట పాడింది. ఆ పాట అలా నా మదిలో గుర్తుండిపోయింది. ఈ సినిమాని విజువలైజ్ చేస్తున్నప్పుడల్లా ఈ పాట నా మనసులోనే తిరుగుతోంది. నా మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్ లో లక్కీ అలీ పాట ఉంటుంది. ఆ పాటని సినిమాలో వాడినందుకు సోనీ కంపెనీకి నేను డబ్బు చెల్లించా. సినిమాలో కూడా క్రెడిట్స్ ఇచ్చా. తర్వాత తీసిన ‘ఆనంద్’ సినిమాలో లక్కీ అలీతో ఓ పాట కూడా పాడించుకున్నా. ‘ఆనంద్’ సినిమాలో సుబ్బలక్ష్మి గారి పాట నుంచి ‘ఫిదా’ లో ఉపయోగించుకున్న ‘మల్లీశ్వరి’ సినిమా అప్పగింతల పాట వరకూ స్టోరీ రాస్తున్నప్పుడు నాకు ఒక్కో సినిమాకి ఒక్కో పాట నా మనసులో తిరుగుతుంటుంది.
అలా మనసులోకి వచ్చిన పాట ఇది
‘లవ్ స్టోరీ’ సినిమా చేసేటప్పుడు ఈ పాట కూడా అలా నా మనసులోకి వచ్చింది. సుద్దాల అశోక్ తేజ గారిని కలిశా. ఈ పాటని సినిమాకి అనుకూలంగా రాయాలి అని అడిగా. పాట పల్లవి తీసుకుని చరణాలు రాశారాయన. ఈ పాటకు అంత బాగా రాసి ఇచ్చినందుకు నాకెంతో సంతోషం కలిగింది. మా టీమ్ లోని ఒకరు శిరీష ఫోన్ నంబర్ సంపాదించి ఆమెని సంప్రదించారు. అయితే ఆమెకి అప్పటికి డెలివరీ టైమ్ కావడంతో మేము ఏమీ చేయలేకపోయాం. కరోనా కారణంగా సినిమా ఆగిపోయి మళ్లీ ప్రారంభమైంది. చిన్న బిడ్డతో ఉండే శిరీషను పిలిచి ఇబ్బంది పెట్టాలనిపించలేదు. ఈ పాటను నవంబరులో చిత్రీకరించాం. అది కూడా ట్రాక్ సింగర్ పాడిన వెర్షన్ తోనే చిత్రీకరణ జరిపాం. ఫిబ్రవరి ఆఖరులో మంగ్లీతో ఈ పాటను పాడించాం.
ప్రోమో రిలీజ్ అయ్యాక సుద్దాల గారు ఫోన్ చేశారు. ఇద్దరు సింగర్లు ఆ పాట తామే పాడాలంటున్నారని చెప్పారు. వారిద్దరి నంబర్లూ ఇచ్చారు. మా టీమ్ ఆ ఇద్దరితోనూ మాట్లాడారు. నేను సుద్దాల గారి ఇంటికి వెళ్లాను. ఈలోగా ఆయన వివరాలు సేకరించి ఉంచారు. ఆ ఇద్దరిలో కోమలే ఈ పాటను వెలికి తెచ్చిందని, కోమలితోనే పాడిద్దామని అన్నారు. నా ముందే ఆయన కోమలికి ఫోన్ చేశారు. పాట రిలీజ్ చేయబోతున్నామని ప్రకటించి ఉన్నాం కాబట్టి కోమలిని వెంటనే రమ్మని అడిగాం. వరంగల్ నుంచి ఆమె రావడానికి ఏర్పాట్లు చేస్తామని కూడా చెప్పాం. మ్యూజిక్ డైరెక్టర్ ను చెన్నై నుంచి రప్పించాం. జలుబు ఉన్నందున రాలేనని కోమలి అంది. పాట అనౌన్స్ చేశాం కాబట్టి మాకున్న ఇబ్బంది చెప్పాం. తనకు క్రెడిట్స్ ఇస్తే అభ్యంతరం లేదని అంది.
కోమలికి క్రెడిట్స్ తో పాటు డబ్బు కూడా ఇస్తాం
‘జన్యూన్ కేస్ సార్.. క్రెడిట్స్ తో పాటు డబ్బులు కూడా ఇస్తే బాగుంటుంది’ అన్నారు సుద్దాల గారు. కోమలిని అడిగితే మీ ఇష్టం సార్ .. ఎంత ఇస్తే అంత ఇవ్వండి అంది. కచ్చితంగా ఇస్తామని కూడా చెప్పాను. ఆడియో ఫంక్షన్ లో పాడాలని, విజిబిలిటీ బాగా ఉంటుందని, కచ్చితంగా రావాలని నేనే కోమలికి చెప్పాను. ఆమె సరేనని అంగీకరించింది కూడా. సుద్దాల గారి ఇంటి నుంచి ఫోన్లో కోమలితో చెప్పినట్లుగానే పాట విడుదల చేసేటప్పుడు ఫేస్ బుక్ లో కోమలికి థ్యాంక్స్ కూడా చెప్పాను. మరుగున పడిన జానపద గీతాన్ని వెలికి తెచ్చిన కోమలికి మేం ప్రామిస్ చేసినట్టుగానే సినిమాలో క్రెడిట్స్ ఇస్తాం. డబ్బు కూడా ఇస్తాం.
ఆడియో ఫంక్షన్ ఫిక్స్ అయితే అందులో పాడాల్సిందిగా కోమలికి ఆహ్వానం పంపిస్తాం. పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల నేను టీవీలో ఈ పాటపై జరుగుతున్న చర్చలు ఫాలో కాలేదు. అందుకే మళ్లీ ఫేస్ బుక్ ద్వారానే అందరికీ ఈ సమాచారం ఇస్తున్నా’ అని శేఖర్ కమ్ముల అన్ని విషయాలూ వివరించారు. ఈ వ్యవహారం వెనక ఇంత కథ నడిచింది కాబట్టి ఈ వివాదానికి ఇంతటితో చరమగీతం పాడినట్లే. కోమలి కోరుకున్నట్లుగానే ఆమెకు ఈ సినిమాలో క్రెడిట్స్ తో పాటు డబ్బు కూడా దక్కుతుంది.
మొత్తానికి ఈ పాట వివాదం వల్ల కోమలి ఎవరో తెలియని వారికి కూడా ఆమె గురించి తెలిసింది. ఈ ఒక్క పాట ఆమె జీవితాన్ని మార్చేసినట్టే ఉంది. మరి తన దగ్గర వంద దాకా జానపద గీతాలు ఉన్నాయని ఆమె అంటోంది. పైగా సినిమా నిర్మాతలు తమ ప్రతి సినిమాలోనూ ఒక్క జానపద గీతమైనా ఉండాలని పట్టుబడుతున్నారు. ఇలాంటి జానపద కళాకారల పంటపండినట్లే ఉంది. పాట శ్రుతిమించి రాగాన పడితే లాభాల బాటే!
– హేమసుందర్ పామర్తి
Also Read : సారంగ దరియాతో ఫిదా చేస్తున్న సాయి పల్లవి