(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను వందశాతం ప్రైవేటీకరణ చేసి తీరుతామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడాన్ని ఖండిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ (అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల ఐక్య వేదిక) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నరేంద్ర మోడీ దిష్టి బొమ్మని కార్మిక సంఘాల నాయకులు తగలబెట్టారు. దిష్టిబొమ్మను తగల పెట్టకుండా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా ఆందోళనకారులు దహన కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
స్టీల్ ప్లాంట్ అమ్మే హక్కు ఎవడిచ్చారు..
ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ప్రజా సంఘాల ఐక్యవేదిక చైర్మన్, సిఐటియు గ్రేటర్ విశాఖ నగర ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మే హక్కు ఎవడిచ్చాడని, అమ్మితే బీజేపీకి పుట్టగతులు ఉండవని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాల ద్వారా స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుంటారని బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆంధ్ర రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు ఇవ్వని బీజేపీ ఉన్నవి అమ్మేయడానికి సిద్ధపడటం దుర్మార్గమన్నారు.
స్టీల్ ప్లాంట్ అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ప్రజలు రోజూ ఆందోళనలు చేపడుతుంటే దానికి తలొగ్గకుండా పుండు మీద కారం చల్లినట్లు పరిశ్రమని అమ్మితీరుతామని ప్రకటించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. కేంద్ర ప్రకటన రాగానే స్టీల్ ప్లాంట్‌లో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారని అన్నారు. అలాగే జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి, దానికి సహకరిస్తున్న జనసేన పార్టీను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అముతామన్న బీజేపీపై పార్లమెంట్లో తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపి పార్టీల ఎంపీలు ఏకమై పోరాడాలని కోరారు.
Must Read ;- విశాఖ స్టీల్‌లో రాష్ట్రానికి వాటానే లేదట.. వైసీపీ ఆడేదంతా నాటకమేనా