రాష్ట్ర ఎన్నికల సంఘం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పురపాలక సంఘాల్లో జరిగిన ఏకగ్రీవాల విషయంలో బలవంతపు ఉపసంహరణ విషయాన్ని పరిశీలించాలని జిల్లా ఎన్నికల ప్రధానాధికారులను ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికల్లో గతంలో బలవంతపు ఉపసంహరణలు జరిగిన చోట చర్యలు తీసుకుంటామని, బలవంతపు నామినేషన్ల ఉపసంహరణపై సమీక్షిస్తామని, నామినేషన్ల ఉపసంహరణపై ఫిర్యాదులు వస్తే స్వీకరిస్తామని.. అలాంటి వారికి మరో అవకాశం ఇస్తామని ప్రకటించింది. కాగా గత ఏడాది విడులైన నోటిఫికేషన్ ప్రకారం.. జరిగిన ఏకగ్రీవాల్లో 80 శాతం వైసీపీవి ఉన్నాయి. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం వైసీపీ పార్టీకి షాక్‌గా భావించవచ్చు. బలవంతపు ఏకగ్రీవాలపై వచ్చే నెల రెండో తేదీలోగా ఫిర్యాదులను కమిషన్‌కు పంపాలని సూచించారు. ఈ ఫిర్యాదులను, ఎన్నికల అధికారులు ఇచ్చిన నివేదికలను పరిశీలించి అభ్యర్థిత్వాల పునరుద్దరణపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
గతేడాది విడుదలైనా..
కాగా ఏపీలోని పురపాలక సంఘాల ఎన్నికలకు 2020 మార్చిలో నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. పరిశీలన కూడా జరిగింది. ఉపసంహరణ తేదీ మాత్రమే మిగిలింది. ఈ సమయంలో కొవిడ్ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసినట్టే..పురపాలక ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికలు ముగిసిన వెంటనే పురపాలక ఎన్నికలు జరగనున్నాయి. అప్పట్లో ఆగిన చోట నుంచి మళ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. అదే క్రమంలో పలుచోట్ల నామినేషన్లు వేయనీయకపోవడం, నామినేషన్లు వేయనివ్వడం లేదని ఫిర్యాదులు అందడం, వీడియోలు బయటకు వచ్చాయి. వందల సంఖ్యలో బలవంతపు నామినేషన్ల ఉపసంహరణలు జరిగాయని ఆరోపిస్తూ విపక్షాలు రీనోటిఫికేషన్‌కు డిమాండ్ చేశాయి. పూర్తి అంశాలు పరిశీలించాక ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. గతంలో జరిగిన అసాధారణ నామినేషన్ల ఉపసంహరణను పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఎన్నికల స్ఫూర్తికి బలవంతపు ఉప సంహరణలు విఘాతం కలిగిస్తాయని, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని ఎన్నికల సంఘం గతంలోనే వ్యాఖ్యానించింది. దాడులు, బెదిరింపుల కారణంగా బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించినట్టు తేలిన చోట్ల మాత్రమే నామినేషన్లు వేసేందుకు అవకాశం ఇస్తామని ప్రకటించింది. మరోవైపు గుంటూరు, చిత్తూరు, కడప జిల్లాల్లోని ఆరు మున్సిపాల్టీల్లోని వివిధ వార్డుల్లో సింగిల్ నామినేషన్ దాఖలు అయ్యాయి. కొన్నిచోట్ల నామినేషన్లు దాఖలైనా…ఉపసంహరించుకున్నారు. దీనిపై కలెక్టర్ల నుంచి ఎస్ఈసీ నివేదిక కోరింది. ఈ నెల 20లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
పులివెందులతో సహా..
సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల సహా రాయచోటి, మాచర్ల, పుంగనూరు, పలమనేరు, తిరుపతి కార్పోరేషన్లల్లోని వివిధ వార్డుల్లో సింగిల్ నామినేషన్‌లు దాఖలయ్యాయి. పులివెందుల, రాయచోటిలో 21 వార్డులు, పుంగనూరులో 16, పలమనేరు, మాచర్లల్లో చెరో పది వార్డులు, తిరుపతి కార్పొరేషన్లోని 6 డివిజన్లల్లో సింగిల్ నామినేషన్ దాఖలయినట్టు చెబుతున్నారు. వీటిపై ఎన్నికల సంఘం పరిశీలన జరుపుతోంది.
వైసీపీ విమర్శలు..
ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో అధికార వైసీపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై విమర్శలకు పదును పెట్టనుందనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే SEC రమేష్ కుమార్ పై పలు ఆరోపణలు చేస్తూ.. విమర్శలకు దిగుతున్న వైసీపీ ఎలా స్పందిస్తుందనేది చూడాలి.
Must Read ;- ఫిర్యాదులు పరిశీలించి చర్యలు తీసుకోండి.. ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీకి హైకోర్టు సూచన