ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ ఘాటు విమర్శలు గుప్పించారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు ప్రస్తుతం ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుండగా,ఈ అంశంపై లోకేష్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. డ్రైవర్ ను చంపిన ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ సజ్జలను కలిశారని..తనను హత్య కేసు నుంచి రక్షించాలని ఆయనను కోరారని అన్నారు.
డ్రైవర్‌ను చంపేసి వైసీపీ ఎమ్మెల్సీ పెళ్లిళ్లకు తిరుగుతున్నారని… కానీ పోలీసులు మాత్రం అరెస్ట్ చేయడం లేదని ఆయన మండిపడ్డారు. కేసు రిజిస్టర్ అయి 72 గంటలు కావస్తున్నా ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదని లోకేష్ ప్రశ్నించారు.ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్‌ను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని… లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఇన్నాళ్లు ప్రజలను, టీడీపీ నేతలను వేధించిన జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తలనూ వేధిస్తోందని ఆగ్రహించారు. రాష్ట్రంలో ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. ఉదయ్ భాస్కర్‌పై కేసు పెట్టడానికి తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. గంజాయి సరఫరాలో ఉదయ్‌భాస్కర్ ప్రధాన భూమిక పోషిస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతుంటే సజ్జల ఏం చేస్తున్నారని లోకేష్ ప్రశ్నించారు.
అదేసమయంలో మృతుడు సుబ్రహ్మణ్యం కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల పరిహారాన్ని చెల్లాంచాలని లోకేష్ డిమాండ్ చేశారు.అసలు ఇంత వరకు సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని హోంమంత్రి వనిత ఎందుకు పరామర్శించలేదని దుయ్యబట్టారు.











