నాలాల్లో కొట్టుకుపోయి, మ్యాన్ హోళ్లలో పడి మృతి చెందిన ఘటనలు జరగడం ఇది మొదటి సారో…రెండవ సారో..కాదు. ఇలాంటి సంఘటనలు హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసినప్పుడల్లా చోటు చేసుకుంటునే ఉన్నాయి. ఈ దురదృష్ట ఘటనలు బాధిత కుటుంబాల్లో విషాదాన్ని నింపితే..అధికారులకు మాత్రం ఇంకా కనువిప్పు కలగడంలేదు. హైదరాబాద్ నేరేడ్‌మెట్‌లో అదృశ్యం అయిన బాలిక కథ విషాదంతం అయ్యింది. నిన్న రాత్రి సైకిల్‌పై బయటకు వెళ్లిన సుమేధ తిరిగి ఇంటికి రాలేదు. నాలాలో కొట్టుకుపోయి ఈరోజు బండచెరువులో శవమై తేలినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇంటి దగ్గరలో ఉన్న నాలాలో పడి మరణించిందని తెలుస్తోంది.
జరిగిందేంటి?…
హైదరాబాద్ నేరేడ్‌మెట్ కు చెందిన సుమేధ నిన్న రాత్రి సైకిల్‌పై బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌తో కలిసి నిన్నరాత్రి నుంచి సహాయక చర్యలు చేపట్టారు. బాలిక సైకిల్‌పై బయటకు వెళ్లిన ఫుటేజ్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. సుమేధ సైకిల్ నాలాలో దొరకడంతో నాలాలో కొట్టుకుపోయిందేమోనని అధికారులు, పోలీసులు జోరుగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇవాళ(శుక్రవారం) బండచెరువులో బాలిక మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. అప్పటివరకు తమ పాపా ఏదో ఓ చోట క్షేమంగా ఉంటుందని అనుకున్న తల్లిదండ్రులు చిన్నారి మరణ వార్త విని కుప్పకూలిపోయారు. బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
సేఫ్ సిటీ ర్యాంకుల్లోనెనా?
ఇంకా ఏమాత్రం లోకం చూడని సుమేధా(బాలిక పేరు) డ్రైనేజీలో పడి మృతి చెందిన ఘటన తన కుటుంబ సభ్యులనే కాదు అక్కడి వారందరినీ కలచివేసింది. అయితే ఈ పాపం ఎవ్వరిది? అని అక్కడికి వచ్చినవారందరూ ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ నగరం…మెట్రో సిటీ అనీ, ప్రపంచంలోనే ది బెస్ట్ సిటీ అనీ..నివాసయోగ్యమైన నగరాల్లో కెళ్లా దేశంలోనే నంబర్ వన్ అనేది…ఉత్తిదేనా? అని జనం అభిప్రాయ పడుతున్నారు. హైదరాబాద్ సేఫ్ సిటీ అని…కేవలం ర్యాంకుల్లోనెనా? రియాలిటీలో లేదా? అని ఎవరికి వారు ప్రశ్నించుకుంటున్నారు. ఇంటి నుంచి బయటికి వెళ్లి డ్రైనేజీలో శవంలా తేలిన వారిలో సుమేధా ఒక్కటే లేదు. ఇలాంటి ఘటనలు నగరంలో మనం చాలానే చూశాం. విన్నాం కూడా. దిన పత్రికల్లో వార్తలుగా, మీడియాలో కథనాలుగా పుంకానుపుంకాలుగా వచ్చిన విషయం తెలిసిందే.
చెరువులను తలపించిన రోడ్లు….
మొన్న హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ మాట ఎందుకంటున్నానంటే…ఆ రోజు కురిసిన వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమైతే, ననగర రోడ్లు చెరువలను తలపించాయి. బైకులు, కార్లు, ఆటోలు వర్షానికి కొట్టుకుపోయిన దృశ్యాలను మనం టీవీల్లో, సోషల్ మీడియాల్లో చెక్కర్లు కొట్టిన వీడియోలు అందరికీ బాగా గుర్తే. ఎక్కడికక్కడ నాలాలు, డ్రైనేజీలు వరద నీటితో పొంగిపొర్లాయి. జనం నానా ఇబ్బందులు పడ్డారు. ఇలా ఇదే మొదటి సారా…అంటే కాదు. గతంలో ఎన్నో సార్లు ఇలాంటి సమస్యలను నగరవాసులు ఎదుర్కొంటూనే ఉన్నారు. కానీ అధికారులు మాత్రం వీటి నుంచి ఎలాంటి పాఠాలు నేర్వడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే సహాయక చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటన్నారు తప్పితే, నాలాల విస్తరణ, పూడిక తీసివేత, నాలాల ఆక్రమణ లాంటి పై చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. మొన్న వరంగల్…నిన్న హైదరాబాద్…నేడు ఎక్కడా? అని బస్తీ ప్రజలు భయం గుప్పిట్లో బతుకీడుస్తున్నారు. ఎందుకంటే భారీ వర్షాలు కురిసినప్పుడు ప్రభావితమయ్యేది, ఇబ్బందులను ఎదుర్కొనేది ముఖ్యంగా బస్తీ వాసులే కాబట్టి. వారి నివాసాలు స్లమ్ ఏరియాల్లో, నాలాలకు సమీపంలో ఉండడం కూడా ఒక కారణమే. గతంలో కూడా సుమేధా లాంటి వారెందరో నాలాల్లో, మ్యాన్ హోళ్లల్లో పడి కొట్టుకుపోయిన ఘటనలు చూశాం.











