ఏపీలో ఇసుక తవ్వకాలు, విక్రయాలు మరలా ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతోందా? ప్రభుత్వ తీరు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రస్తుతం ఏపీలో ఇసుక తవ్వకాలు, విక్రయాలను ఖనిజాభివృద్ధి సంస్థ నిర్వహిస్తోంది. అయితే ఇసుకలో నాణ్యత ఉండటం లేదంటూ అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. స్వయానా వైసీపీ ఎమ్మెల్యేలే, తాము బుక్ చేసుకున్న ఇసుక అంతా మట్టిలాగా ఉందని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
దీనికి తోడు ఇసుక ధర కూడా చాలా ఎక్కువగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. మరికొందరు అక్రమార్కులు ముందే ఇసుక బుక్ చేసుకుని బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. వీటన్నింటికి చెక్ పెట్టే విధంగా ఇసుక తవ్వకాలు, విక్రయాలను ప్రయివేటు పరం చేసే విధంగా ప్రభుత్వం పావులు కదుపుతోందని తెలుస్తోంది.
మంత్రుల కమిటీ ఏమి తేల్చింది?
ఇసుక తవ్వకాలు, విక్రయాలపై మరింత ఆదాయం పిండేందుకు ప్రభుత్వం మంత్రుల కమిటీని నియమించింది. ఇందులో నలుగురు మంత్రులతోపాటు, గనుల శాఖ అధికారులను కూడా నియమించారు. వారంతా ఇసుక తవ్వకాలు, విక్రయాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి రెండు సూచనలు చేశారని సమాచారం.
1. ఇసుక తవ్వకాలు, విక్రయాలు ప్రయివేటుకు అప్పగించాలని మంత్రుల కమిటీ మొదటి ప్రతిపాదన చేసింది. ఈ టెండర్లు పిలబడం ద్వారా ఎవరు ఎక్కువకు కోట్ చేస్తే వారికి ఇసుక రీచ్ లు అప్పగించడం ద్వారా ప్రభుత్వానికి అదనంగా రూ.150 కోట్ల ఆదాయం వస్తుందని సూచించారు. ప్రయివేటు వ్యక్తులు ఇష్టం వచ్చిన రేటుకు ఇసుక అమ్ముకోకుండా ప్రభుత్వమే ధరలను నిర్ణయించి, పర్యవేక్షించాలని మంత్రుల కమిటీ సూచించింది.
2.ప్రస్తుతం కొనసాగిస్తున్న విధానంలో కొన్ని మార్పులు చేయడం రెండవ సూచన. నాణ్యత లేని ఇసుక ఇస్తున్నారని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. అందుకే ఇసుక డంపింగ్ వద్దే వినియోగదారుడి సమక్షంలో, వారు తెచ్చుకున్న వాహనంలో ఇసుక నింపాలని సూచన చేశారు. దీని వల్ల వినియోగదారులు దగ్గరుండి ఇసుక తీసుకువెళతారు కాబట్టి ఇక నాణ్యత లేదు అనే విమర్శలకు చెక్ పడుతుందని మంత్రుల కమిటీ అభిప్రాయపడింది.
ప్రయివేటుకు ఇస్తే మరలా అరాచకమే
గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇసుక తవ్వకాల అక్రమాలతోనే సగం భష్టుపట్టిపోయిందని, మనం కూడా ఇసుక తవ్వకాలు ప్రయివేటుకు ఇస్తే అరాచకాలు చోటు చేసుకుంటాయని కొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో ఇసుక తవ్వకాలు, విక్రయాలు ప్రయివేటు వ్యక్తులకు వద్దని మంత్రుల కమిటీలోని కొందరు మంత్రులు గట్టిగా సూచించారని సమాచారం.
లెక్కలు తవ్వుతోంది అందుకేనా?
రాష్ట్రంలోని ఎన్ని ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు జరపవచ్చో అధికారులు తాజాగా లెక్కలు తీస్తున్నారు. ఏపీలో దాదాపు 200 ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు చేయవచ్చని ప్రాథమికంగా నిర్థరించారు. అధికారుల లెక్కలు తీస్తున్న తీరును గమనిస్తే కొన్ని రీచ్ లు ప్రయివేటుకు ఇచ్చి చూడాలని ప్రభుత్వం భావిస్తోందట. అక్కడ వచ్చే ఫలితాలను బట్టి, మిగిలిన రీచ్ లను కూడా ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టవచ్చనే ఆలోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇప్పటికే ఇసుక ధరలు పెరిగిపోయి, నిర్మాణరంగం కుదేలైంది. కూలీలకు పనులు దొరకడం లేదు. ఇసుక నిత్యావసర వస్తువుగా మారింది. ఇసుకను తక్కువ ధరకు అందించి లక్షలాది కూలీలకు ఉపాధి కల్పించే విధంగా ఇసుక పాలసీ ఉండాలని వామపక్షాల నేతలు సూచిస్తున్నారు.











