ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి స్పష్టంగా కనిపిస్తుండడంతో వైఎస్ఆర్ సీపీ అధిష్ఠానం ఇక కాడి కింద పడేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి జగన్ కు వచ్చే ఎన్నికల కోసం కలిసి వచ్చే ఒక్క అంశం అనుకూలంగా జరగడం లేదు. కొంత మంది సొంత పార్టీ నేతలే రెబల్ గా వ్యవహరిస్తుండడం, చంద్రబాబు అక్రమ అరెస్టు ఎఫెక్ట్, తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం.. వెరసి సర్వేలన్నీ టీడీపీకే అనుకూలంగా రావడం.. ఇలా అన్నీ జగన్ కు కలవర పెట్టేలాగే పరిణామాలు ఎదురవుతున్నాయి. వీటికి తోడు ఇటీవల జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా తన పాండిత్యాన్ని ప్రదర్శించడం.. పొటాటోని ఉల్లిగడ్డ అంటూ దొరికిపోవడం లాంటివి ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెడుతున్నాయి. ఇక ఏం చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం అవ్వదని గ్రహించి చేతులెత్తేసినట్లుగా తెలుస్తోంది.
అయినప్పటికీ గెలిచే ప్రయత్నాల్లో భాగంగా ఈ మధ్యే తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ నుంచి ఓ గుణపాఠం చేర్చుకున్నారు.. జగన్. ఎమ్మెల్యేలపై స్థానికంగా బాగా వ్యతిరేకత ఉన్నప్పటికీ తన ముఖం చూసి జనం ఓట్లు గుద్దుతారని భావించి కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చలేదు. దీంతో అభ్యర్థులపై వ్యతిరేకతతో ఓట్లు కాంగ్రెస్ కు పడ్డాయి. కేసీఆర్ చేసిన ఈ తప్పును జగన్ చేయకూడదని భావించి.. ఇప్పటికే ప్రజా వ్యతిరేకత ఉన్న ఓ 50 మంది ఎమ్మెల్యేల లిస్టును సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పుడు వారి స్థానంలో కొత్త వారికి టికెట్ ఇవ్వాలన్నా.. టీడీపీ, జనసేన నిలిపే అభ్యర్థికి సమఉజ్జీ దొరకడం చాలా చోట్ల కష్టమే. అలా కాకుండా సిట్టింగ్ అభ్యర్థినే ఉంచితే ఓట్లు రావు. కాబట్టి, ఈ వ్యవహారం వైసీపీ అధిష్ఠానానికి సంకటంగా మారింది.
అంతేకాకుండా, కొంత మంది ఎమ్మెల్యేలు అధిష్ఠానంపై అంతర్గతంగా వ్యతిరేకతతో ఉంటే ఇంకొంత మంది బహిరంగంగానే ఇష్టం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. ఆయన తాను మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన నాటి నుంచి ఇలాగే వ్యవహరిస్తున్నారు. అటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి లాంటి కీలక నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. వారి దారిలోనే మరికొంత మంది అసంతృప్త నేతలు వైసీపీ నుంచి బయటకు వస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఏలూరు ఎంపీ తాను పోటీ చేయబోనని స్పష్టంగా చెప్పేశారు. మరికొంత మంది ఎంపీలు కూడా పోటీ చేయడానికి ఆసక్తిగా లేరు. ఈ సర్దుబాట్లు చేయాలంటే వైసీపీ అధిష్ఠానానికి తలకు మించిన భారమే అవుతుంది. అసలు జగన్ అంటేనే.. ఏపీ ప్రజలకు విరక్తి ఏర్పడిపోయిన సందర్భంలో ఎన్ని సర్దుబాట్లు చేసినప్పటికీ, ఎంత బలమైన అభ్యర్థులను నిలిపినప్పటికీ ప్రయోజనం ఏమీ ఉండదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ.. ఓటమికి ఫిక్సయిపోయినట్లేనని విశ్లేషణలు వస్తున్నాయి.