దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని ఏపీపీసీసీ చీఫ్ గిడుగు రుద్ర రాజు వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. షర్మిల ఏపీకి వస్తే స్వాగతిస్తామని ఆయన స్పష్టం చేశారు. గత కొన్నేళ్లుగా వైఎస్ షర్మిల తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి.. చురుగ్గా వ్యవహరించారు. తీరా ఎన్నికలు వచ్చేసరికి ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని ప్రచారం జరిగింది. అందుకు కాంగ్రెస్ అధిష్ఠానం తాత్సారం చేయడంతో ఇక షర్మిల పోటీకి సిద్ధమయ్యారు. అభ్యర్థులు కూడా ఎవరూ ముందుకు రాకపోవడంతో తాను మాత్రమే పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.
ఇంతలో వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పాలేరు నుంచి బరిలోకి దింపింది. దీంతో షర్మిల వెనక్కి తగ్గి.. తాను కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు పలుకుతానంటూ స్పష్టం చేశారు. ఇందుకు రేవంత్ రెడ్డే తెరవెనుక వ్యూహం చేశారనేది టాక్. మొత్తానికి ఇక తెలంగాణలో తన రాజకీయ భవిష్యత్తును షర్మిల తనకు తానే ప్రశ్నార్థం చేసుకున్నారు. ఇక తెలంగాణలో తనకు ఏ దారి లేకపోవడంతో షర్మిలను ఏపీ కాంగ్రెస్ వైపు మళ్లించాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వెళ్లడానికి రేవంత్ రెడ్డే దారులు వేస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఆ ప్రకారమే ఏపీపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు షర్మిల ఏపీ కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తారని అన్నారని అంటున్నారు. రుద్రరాజు తాజా వ్యాఖ్యలను బట్టి షర్మిలను తెలంగాణ నుంచి సైడ్ చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ గిడుగు రుద్రరాజు చెప్పిందే నిజం అయితే.. ఏపీలో అధికార పార్టీకి అంతకుమించిన ఎదురుదెబ్బ మరొకటి ఉండదు. స్వయంగా అధికార పార్టీ అధినేత జగన్‌కు సొంత చెల్లెలు అయిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తే జగన్ కు ముఖం ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంటుంది. తన అన్న జైలులో ఉండగా.. పాదయాత్ర చేసి ఆయన అధికారంలోకి రావడం కోసం ఎంతో శ్రమించిన షర్మిలను.. జగన్ తరిమేశారనే ప్రచారం ఏపీలో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తే.. ముఖ్యమంత్రి జగన్ పరువు మొత్తం పోయినట్లే అవుతుంది. ఇక ఎలాగూ అధికారం కోల్పోయే సంగతి అటుంచితే.. సొంత పార్టీలోని ఎమ్మెల్యేలంతా పార్టీని వీడే అవకాశం లేకపోలేదు.
ఇంకా గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ తరపున ఏపీలో వైఎస్ షర్మిల ప్రచారం చేయడంతో పాటుగా.. త్వరలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఏపీలో పర్యటిస్తారని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి రాహుల్ గాంధీ, అమరావతి రాజధాని ఉద్యమానికి ప్రియాంక గాంధీ మద్దతు ఇస్తారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది ఒక్క కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు.











