ఏపీలో అభివృద్ధి పురోగతిని చూడడం ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. ప్రభుత్వం బటన్లు నొక్కి లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు వేయడం తప్ప.. కొత్త ప్రాజెక్టులు కట్టించడం, అభివృద్ధిపై ఫోకస్ చేయడం లాంటివి ఎప్పుడో వదిలేసింది. కనీసం ఉన్న వసతులు, మౌలిక సదుపాయాలను కాపాడుకోవడం కూడా ప్రభుత్వానికి తలకుమించిన భారంగా తయారైంది. ఇందుకు సాక్ష్యమే తాజాగా నీటిపారుదల ప్రాజెక్టులో ఓ గేటు కొట్టుకుపోవడం. జగన్ సర్కారు అలసత్వానికి నిదర్శనంగా నిలుస్తున్న ఈ ఘటన గుండ్లకమ్మ ప్రాజెక్టులో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా మద్దిపాడు మండలం మల్లవరంలో ఉన్న గుండ్లకమ్మ రిజర్వాయర్ రెండో గేటు కాస్త భాగం శుక్రవారం రాత్రి కొట్టుకుపోయింది. ఈ ప్రాజెక్టులోనే ఇలా గేటు కొట్టుకుపోవడం ఇది రెండోసారి. ఇప్పటికే ఒక గేటు ఏడాది క్రితం కొట్టుకుపోయింది.
ఏడాది నాడు కొట్టుకుపోయిన గేటు స్థానంలోనే కొత్తది ఏర్పాటు చేయలేదు. మిగిలిన గేట్ల రిపేర్లు చేయాల్సిన జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వాటిని వదిలేసింది. దీంతో శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో రెండో గేటు కూడా విరిగిపోయి కొట్టుకుపోయింది. దీంతో రిజార్వాయర్‌లో పదిలంగా నిల్వ ఉండి రైతన్నల అవసరాలకు ఉపయోగపడాల్సిన సాగునీరు.. వృథాగా బయటకు పోతోంది. అనవసరంగా సముద్రంలో కలుస్తున్నాయ. గుండ్లకమ్మ రిజర్వాయర్ కింద కుడి, ఎడమ కాలువల పరిధిలో 80 వేల ఎకరాల భూమి సాగు అవుతోంది. రిజర్వాయర్‌లో చేపల వేట చేస్తూ దాదాపు స్థానిక 2 వేలకు పైగా మత్స్యకార కుటుంబాలు ఆధారపడ్డాయి. ఇంత ప్రాధాన్యం ఉన్న రిజర్వాయర్ మరమ్మతులను జగన్ సర్కారు గాలికి వదిలేయడం.. ప్రభుత్వ చేతగానితనాన్ని చాటుతోంది.
గుండ్లకమ్మ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 3.8 టీఎంసీలు. గత సంవత్సరం ఆగస్టులో ఓ గేటు కొట్టుకుపోయే సమయంలో కూడా రిజర్వాయర్ లో 3 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. గేటు కొట్టుకుపోవడంతో 1.5 టీఎంసీలు సముద్రంలోకి వృథాగా పోయాయి. గేటు రిపేరు చేయాలంటే మొత్తం రిజర్వాయర్ ఖాళీ చేయాలని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. తర్వాత ఆ గేటుకు తాత్కాలికంగా రిపేరు చేశారు. ఆ తర్వాత రిజర్వాయర్ లో నీటి నిల్వను 1.7 టీఎంసీలకు మించి పెంచలేదు. మిగ్జాం తుపానుకు ముందు దీంట్లో 1.3 టీఎంసీలే ఉంటే.. తుపాను వల్ల ఎగువ ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో ఎక్కువగా రావడంతో జలాశయంలోకి 2.5 టీఎంసీల నీరు చేరింది.
బుధవారం రెండు గేట్లు ఎత్తి కొంత నీరు కిందికి వదిలారు. ఉద్ధృతి తగ్గిందనుకొని మళ్లీ గేట్లు మూసివేశారు. ఇంకా ప్రవాహం బాగా పెరిగిపోవడంతో అప్పటికే తుప్పుపట్టి ఉన్న రెండో గేటులోని కింది భాగం విరిగి కొట్టుకుపోయింది. దీంతో నీళ్లన్నీ సముద్రంలోకి పోతున్నాయి. అలా ఇప్పటిదాకా 0.5 టీఎంసీ నీళ్లు వృథాగా పోయాయి. గేటు కొట్టుకుపోయిందని తెలిసి స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మరోవైపు, అధికారులు విద్యుత్తు సరఫరాను నిలిపేశారు. వరద పెద్ద ఎత్తున కిందికి వస్తుండడంతో పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా గ్రామాల్లో అధికారులు దండోరా వేయించారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొత్త ప్రాజెక్టులు ఎలాగూ కట్టలేని స్థితిలో ఏపీ సర్కారు.. కనీసం ఉన్న ప్రాజెక్టులను కాపాడుకోలేదని దీన స్థితిలో ఉన్నట్లుగా దీన్ని బట్టి అర్థమవుతోంది.











