కృష్ణా జిల్లా పరిటాలలో రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు, పోలీసులు కొట్టారనే అవమానంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితం గ్రామంలో పేకాట ఆడుతున్న ఏడుగురు యువకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. స్థానిక టీడీపీ నేత కోగంటి బాబు, పోలీసులతో సంప్రదించి వారిని విడిపించారు.

స్టేషన్ నుంచి బయటకు వచ్చిన రాజశేఖర్ రెడ్డి, తిరుగులేని టీడీపీ నేత కోగంటి బాబు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో స్థానిక వైసీపీ నేతలు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు పేకాట ఆడిన ఏడుగురిని మళ్లీ స్టేషన్ కు తరలించారు. ఆరుగురిని పక్కన పెట్టి రాజశేఖర్ రెడ్డి అనే 25 సంవత్సరాల యువకుడిని మాత్రమే తీవ్రంగా కొట్టారని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. అనంతరం వారిని విడిచిపెట్టారు.
వైసీపీ నేతల వల్లనే పోలీసు లాఠీ దెబ్బలు రుచిచూడాల్సి వచ్చిందని రాజశేఖర్ రెడ్డి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడని అంటున్నారు. వెంటనే సమీపంలోని కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడంతో పరిటాలలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
అది సరదా పేకాటేనట..
పరిటాల గ్రామంలో సరదాగా డబ్బు పెట్టకుండా పేకాట ఆడుతుండగా పోలీసులు అరెస్టు చేశారని నిందితుల తరఫు వ్యక్తులు అంటున్నారు. సరదాగా పేకాడుతున్న వారిని కూడా తీసుకెళ్లడంపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. వారిని మందలించడం లేదా కేసు కట్టడం వరకూ బాగానే ఉంటుంది. కానీ వారిని తెదేపా నేత ఒత్తిడితో ఒకసారి వదిలేసి, వైసీపీ నేతల ఒత్తిడితో మరలా తీసుకువెళ్లడం, వారిలో ఒక్కడిని తీవ్రంగా కొట్టడంతోనే.. రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని అంటున్నారు.. ఇందులో వైసీపీ నేతల పాత్ర, పోలీసుల అత్యుత్సాహం కనిపిస్తోందని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ వారు ఆందోళనకు దిగారు. మరికాసేపట్లో రాజశేఖర్ రెడ్డి మృత దేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి, పరిటాల గ్రామం తరలించనున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు పెద్ద ఎత్తున పరిటాల చేరుకున్నారు.
రాజశేఖరరెడ్డిదే అత్యుత్సాహమా?
పేకాడుతున్న వారు పోలీసులకు చిక్కారు. వారి తరఫున తెలుగుదేశం నాయకుడు కోగంటి బాబు రంగప్రవేశం చేశారు. పోలీసులతో మాట్లాడి తమ వాళ్లను విడిపించారు. అంతవరకు బాగానే ఉంది. వ్యవహారం అంతటితో ఆగిపోయి ఉంటే ఎలాంటి సమస్య ఉండేది కాదు. అసలు ఈ పేకాట – అరెస్టు గొడవ గురించి మరొక్కరికి తెలిసేదే కాదు. కానీ.. తమను పోలీసుల నుంచి విడిపించిన కోగంటి బాబు మీద తన భక్తిని చాటుకోవడంలో రాజశేఖర రెడ్డి కాస్త అత్యుత్సాహం ప్రదర్శించాడు. పేకాట కేసు నుంచి తప్పించినందుకు ‘తిరుగులేని నేత కోగంటి బాబు’ అంటూ సోషల్ మీడియాలో కీర్తించాడు. సహజంగానే.. ఇది అందరి దృష్టికి వెళ్లింది.
ఇదే పని వైకాపా కార్యకర్తలు, వైకాపా నేత ఆధ్వర్యంలో జరిగిఉంటే… అప్పుడు తెలుగుదేశం నాయకులు నానా యాగీ చేసి ఉండేవారు. చంద్రబాబు లోకేష్ ట్వీట్లతో హోరెత్తించి ఉండేవారు. ఇంకా చెప్పాలంటే.. అరెస్టయని వ్యక్తి కులానికి, అధికార పార్టీకి ముడిపెట్టి కూడా ఆరోపణలు గుప్పించేవారు. అదే పని ఈ సంఘటనలో వైకాపా నాయకులు చేశారు. తెలుగుదేశం నాయకుడి ఒత్తిడికి తలొగ్గి తాము పేకాటరాయుళ్లని విడిచిపెట్టేసిన వ్యవహారం.. సోషల్ మీడియా ద్వారా రచ్చకెక్కేసరికి.. పోలీసులు తప్పు దిద్దుకోడానికి అరెస్టయిన వాళ్లను మళ్లీ పట్టుకొచ్చారు. రాజశేఖర రెడ్డి సోషల్ మీడియా అత్యుత్సాహాన్ని కంట్రోల్ చేసుకుని ఉంటే గనుక.. అసలు ఈ రాద్ధాంతమే జరిగి ఉండేది కాదనే అభిప్రాయం కూడా సర్వత్రా వినిపిస్తోంది.











