నటుడు సోనూ సూద్ ఆమ్ ఆద్మీ క్రేజీ వాల్ ను కలవడంపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. సోనూ సూద్ రాజకీయ రంగ ప్రవేశం మీద కూడా ఓ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆయన రాజకీయాల్లోకి రావాలని సోనూ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఈరోజు ఉదయం ఆయన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ ప్రభుత్వం దేశ్‌కే మెంటర్స్ ప్రొగ్రామ్‌ను త్వరలో ప్రారంభించబోతోంది.
దీనికి సోనూ సూద్ ను బ్రాండ్ అంబాసిడర్ గా కేజ్రీవాల్ ప్రకటించారు. ఎంతో మంది విద్యార్థులకు మెంటార్ గా వ్యవహరించే అవకాశం రావడం తనకెంతో సంతోషంగా ఉందని సోనూ అంటున్నారు. వీరిద్దరి కలయిక ఇక్కడితో ఆగిపోతుందా? ఓ బృహత్తర రాజకీయ శక్తిగా ఏర్పాటవడానికి నాంది పలుకుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి.
ఆమ్ ఆద్మీ తీర్థం పుచ్చుకుంటారా?
సోనూ ఓ పక్క సినిమాల్లో చాలా బిజీగా ఉన్నారు. అలాగని తన సేవా కార్యక్రమాలను కూడా ఆపడం లేదు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సోనూ పోటీ చేయవచ్చనే ప్రచారం సాగుతోంది. లేదా తన సోదరిని ఎన్నికల బరిలోకి దించే అవకాశం కూడా ఉంది. సోనూ స్వస్థలం పంజాబ్ లోని మోగా. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆయన స్పందించిన తీరుకు యావత్ భారత దేశం ఆయనను శ్లాఘిస్తోంది. ఆయన అందించిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఈరోజు క్రేజీ వాల్ ను కలవడంతో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ లో చేరవచ్చన్న ప్రచారం ఊపందుకుంది. ఇంతకుముందు తెలంగాణ మంత్రి కేటీ రామారావును కూడా ఆయన కలిశారు. అలాగని టీఆర్ఎస్ లో చేరతారని అనుకోవడం కూడా పొరపాటే. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ పాలసీ సోనూ విధానాలకు దగ్గరగా ఉంటుంది. అది సామాన్యుల పార్టీ. అందుకే సోనూ ఆ పార్టీ పట్ల ఆకర్షితుడయ్యారని అంటున్నారు. గతంలో కూడా సోనూ రాజకీయ ప్రవేశంపై వార్తలు వచ్చాయి. శివసేనలో చేరతారన్న ప్రచారం సాగింది.
తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని సోనూ ఓ సందర్భంలో అన్నారు. ఇప్పుడు మాత్రం అలా అనుకోడానికి వీల్లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మరింతగా ఎదగడానికి సోనూ చేరిక కీలకమవుతుంది. ప్రస్తుతం సోనూ పంజాబ్‌లో సీఎం అమరీందర్ సింగ్ సారథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గానూ ఉన్నారు. కరోనా నివారణకు ప్రజల్లో అవగాహన పెంచడానికి అక్కడి ప్రభుత్వం సోనూ సేవలను ఉపయోగించుకుంటోంది. ఒకవేళ భాజపా వ్యతిరేక శక్తులను కూడగట్టడానికి ఇది ఓ మంచి అవకాశంగా కాంగ్రెస్ లాంటి పక్షాలు ఊహించి ఉండవచ్చు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరి భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
ఆమ్ ఆద్మీ పార్టీలో ఆయన చేరితేనే బాగుంటుందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తన రాజకీయ రంగ ప్రవేశానికి ఇదే సరైన సమయమని సోనూ భావిస్తున్నట్టు కూడా సమాచారం. పంజాబ్ ఎన్నికలను ఓ మోడల్ గా తీసుకుంటే 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఆయన పాత్ర ఏమిటన్న దాని మీద స్పష్టత వస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. సినిమాలకు స్వస్తి చెప్పేసి రాజకీయాల వైపే ముగ్గుచూపుతారా? లేదా ఓ వైపు సినిమాలు చేసుకుంటూ సేవా కార్యక్రమాలే లక్ష్యంగా ముందుకెళతారా అన్నది కాలమే నిర్ణయించాలి.
Must Read ;- సోనూసూద్ అంకుల్ ను కొడతావా.. టీవీ పగులకొట్టిన బుడ్డోడు!











