కరోనా మహమ్మారి రోజురోజుకూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో 1,26,265 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేసులు, మరణాలు పెరుగుతుండటంతో, ఈ విషయమై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ గురువారం సాయంత్రం సమావేశం కానున్నారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడిచేయడానికి తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి ప్రధాని ఈ సందర్భంగా చర్చించనున్నారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రాకింగ్ విధానాలను సమగ్రంగా అమలు చేయడం ఎలా అనే దానిపై చర్చించున్నారు. రోజూవారి కేసుల సంఖ్య లక్షకు చేరుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టగా.. ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గతంలో 76 రోజుల్లో రోజువారీ పాజిటివ్ కేసులు గరిష్ఠంగా 97,894కు చేరితే.. ప్రస్తుతం 25 రోజుల్లో లక్ష దాటేయడం భయాందోళనకు గురిచేస్తోంది.
అవసరమైతే పబ్బులు, క్లబులు బంద్
కరోనా నేపథ్యంలో తెలంగాణ హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రోగులకు కోసం బెడ్లు, టెస్టుల సంఖ్య పెంచనున్నట్లు ప్రకటన చేశారు. టీకా వేసినందుకు ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నాయని, అలాంటి హాస్పిటళ్లపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. లాక్ డౌన్, కర్ఫూ ఎలాంటి పరిస్థితుల్లో ఉండదని, అవసరమైతే క్లబులు, పబ్బులు బంద్ చేస్తామని ఆయన ఈ సందర్భంగా అన్నారు.