ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకులు వ్యక్తిగత కక్షలు ప్రజల పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిపై కక్ష సాధించినట్లుగా వ్యవహరించడం ఆనవాయితీగా మారుతోంది. కుల కక్షలు, మత వివాదాలు, రాజకీయ కార్పణ్యాలు రోజురోజుకు పెరిగిపోవడం పట్ల ఆవేదన వ్యక్తం అవుతోంది. ఈ కక్షలకు సామాన్యులు, అతి సామాన్యులు బలైపోవడం రివాజుగా మారుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం, వై.ఎస్.ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఒకరిపై ఒకరు కక్షపూరితంగా వ్యవహరించడంతో రెండు పార్టీలలోని కిందిస్థాయి కార్యకర్తలు నానా యాతన పడుతున్నారు. ఒకరిపై ఒకరు కేసులు వేసుకోవడం పోలీసుల చుట్టూ తిరిగి వారికి ఆమ్యామ్యాలు సమర్పించుకుని ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు.
గ్రామాల్లో యుద్ద వాతావరణం…
గ్రామాలలో రాజకీయ కక్షలు నానాటికి పెరిగిపోతూండడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంటోంది. పాత కక్షలకు నెలవైన కొన్ని గ్రామాలలో రాజకీయ కక్షలు కూడా తోడవడంతో గ్రామాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులున్నాయి. రాయలసీమ జిల్లాలో గడచిన దశాబ్ద కాలంగా నిలిచిపోయిన గ్రామకక్షలు ఈ మధ్య కాలంలో మళ్లీ పురుడుపోసుకుంటున్నాయి అంటున్నారు. అక్కడి గ్రామాలలో పాతకక్షలు మరిచిపోయిన వాళ్లు తిరిగి రాజకీయ పార్టీల ప్రొద్బలంతో తిరిగి వేళ్లూనుకుంటున్నాయనే ప్రచారమూ జరుగుతోంది. చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని గ్రామాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఎప్పుడు ఏ వివాదం చెలరేగుతుందో, ఎవరి మీద ఎలాంటి కేసులు నమోదవుతాయో తెలియక ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంతో పాటు ప్రకాశం జిల్లాలోని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొందంటున్నారు. గ్రామాలలో ఎప్పటి నుంచో రెండు గ్రూపులుగా విడిపోయి రోడెక్కుతున్నారు. ఒకరిపై దాడులు చేసుకోవడంతో ఆసుపత్రుల పాలు కావడమే కాదు…. జైళ్ల పాలవుతున్నారు. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులు వారిని వెంటాడుతున్నాయి. కేసుల నుంచి బయటకు రాలేక అప్పులు చేసి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ఈ వివాదాలకు కారణమైన రాజకీయ పార్టీలు కాని, కుల పెద్దలు కాని బాధితుల వైపు తొంగి చూడడం లేదు.
పట్టణాల్లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి
గ్రామాల్లో పాత కక్షలు కారణమైతే పట్టణాల్లో ఆధిపత్య పోరు కారణమవుతోంది. ఒక వర్గం వారిపై మరో వర్గం వారు ఆధిపత్యం చెలాయించాలనే లక్ష్యంతో దాడులకు తెగబడుతున్నారు. ఇక్కడ కూడా పోలీసు కేసుల వరకూ వెళ్తున్నారు. సెటిల్ మెంట్లు, వివాదాల పరిష్కరించే పెద్ద మనుషులుగా వెళ్తూ ఆ తర్వాత ఇరు వర్గాలు కత్తులు దూసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయని పోలీసులే చెబుతున్నారు. దీనికి కూడా రాజకీయ ఆధిపత్యంతో పాటు పెత్తనం వంటివే కారణంగా తెలుస్తోంది.
నగరాల్లో తక్కువే… కాని…
గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలతో పోలిస్తే నగరాల్లో ఇలాంటి వివాదాలు తక్కువే అంటున్నారు. ఇక్కడ సెటిల్ మెంట్లు రాజకీయ పార్టీల పరంగా కాకుండా వ్యక్తిగతంగా జరుగుతాయని, అందుకని పోలీసుల జోక్యం కూడా అలాగే ఉంటుందని అంటున్నారు. అయితే, ఇటీవల నగరాల్లో కూడా ఈ తరహా వివాదాలు ఎక్కువవుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. పోలీసుల జోక్యం కూడా మితిమీరడంతో వివాదాలు మరింత పెరగుతున్నాయి. పోలీసులు ఒక వర్గం వారికే ఎక్కువ మేలు చేసేలా ప్రవర్తించడంతో ఇవి మరింత కక్షపూరితంగా మారుతున్నాయని అంటున్నారు.