ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజుల నుంచి వాడివేడిగా జరుగుతున్నాయి. కొన్ని సార్లు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న కామెంట్లపై వారి కరడుగట్టిన అభిమానులు చప్పట్లు కొడుతున్నా.. సగటు ప్రజానీకం మాత్రం ఈసడించుకునే పరిస్థితి తలెత్తుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు రాజకీయాల్లో సాధారణం. అయితే అవి వ్యక్తిగత దూషణలకు తావిచ్చే విధంగా ఉండకూడదు. ఏపీ అసెంబ్లీలో సభ్యులు మాట్లాడుతున్న తీరు అందుకు భిన్నంగా ఉంది. ఇక సభను నడిపించడంలో కీలకపాత్ర పోషించాల్సిన సీఎం జగన్ సభ్యులకు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలు చూపిస్తున్నారు. అవి ఆయన హోదాకు ఏమాత్రం గౌరవం తెచ్చేవిగా లేవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
లీడర్ ఆఫ్ ది హౌస్‌దే..
మూడు రోజుల పాటు సభను చూసిన వారికి, రాజకీయ అవగాహన ఉన్నవారిలో తలెత్తుతున్న ప్రశ్న ఒక్కటే. ప్రతిపక్షాన్ని నిలదీయాలనుకోవడంలో తప్పులేదు..కాని ఆ నిలదీతలో దిగజరుడు అవసరమా అనే ప్రశ్నే తలెత్తతుతోంది. మరి విలువలు ప్రతిపక్షానికి అవసరం లేదా అంటే.. వారికీ అవసరమే. అయితే లీడర్ ఆఫ్ ది హౌస్ స్థానంలో ఉన్న వ్యక్తిపైనే ఎక్కువ బాధ్యత ఉంటుంది. అందుకే సభలో సీఎం మాటలు, హావభావాలు, సెటైర్లు..ఇవన్నీ ప్రజలు ఆసక్తిగా గమనిస్తారు.
నిలదీస్తుండడంతో జగన్‌లో విసుగు
కేవలం నామమాత్రంగా మారిందనుకున్న ప్రతిపక్షం..తమను ఇంతలా ప్రశ్నిస్తుందా..పోలవరం, తుపాను పరిహారం, టిడ్కో ఇళ్లు..ఇలా ప్రతి అంశంలోనూ తమను నిలదీస్తుండడంపై జగన్ విసుగెత్తినట్టు కనిపిస్తోంది. అందుకే ఎలాగైనా.. ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టడమా..లేక మరింత హేళన చేయడమా అనే టార్గెట్ గా సీఎం జగన్ కామెంట్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఆ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వీడియోలను అసెంబ్లీలో ప్రస్తావించడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాలను విమర్శించాలన్నా, ఎదుర్కోవాలన్నా.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పవచ్చు.. చర్చకు సిద్ధమని ప్రకటించవచ్చు. గతంలో ఇలాగే ఉండేది.
Also Read ;- చిరు గ్యాప్ ఇచ్చారా..? గ్యాప్ వచ్చిందా..?
సభాముఖంగానే వైఎస్ సమాధానం
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనూ, ప్రతిపక్షంలోనూ ఇలాంటి చర్చలు, వాగ్వాదాలు చాలా జరిగేవి. అంతెందుకు.. స్వయంగా జగన్‌పైనే అప్పట్లో విమర్శలు వచ్చిన సందర్భంలో సభాముఖంగానే వైఎస్ సమాధానం చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. స్పీకర్‌గా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలో.. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి, ఇందిరమ్మ ఇల్లు, తదితర అంశాలపై ప్రతిపక్ష టీడీపీ అధికార పక్షాన్ని నిలదీసేది. అప్పట్లో కొన్నిసార్లు సహనం కోల్పోయిన వైఎస్ కూడా ప్రతిపక్ష టీడీపీపై ముఖ్యంగా చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేసేవారు. చంద్రబాబు తల్లిని ఉద్దేశించి కూడా ఒక సందర్భంలో నోరు జారారు. అయితే తరువాత దానిపై ఆయన స్వయంగా వివరణ కూడా ఇచ్చారు. వైఎస్ సభలో లేని సమయంలో అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న రోశయ్య కూడా ప్రతిపక్షాన్ని తనదైన శైలిలో విమర్శించినా..అక్కడి వరకే పరిమితం అయ్యేది. వెక్కిరింపులు, ఈసడింపులు చాలా తక్కువగా కనిపించేవి. విమర్శలు విమర్శల్లాగానే ఉండేవి.
రాజన్న రాజ్యం తెస్తానని..
మరి వైఎస్ పాలన, రాజన్న రాజ్యం తెస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ప్రతిపక్షపార్టీపై వ్యక్తిగత దూషణలకు, హేళనకు ప్రాధాన్యం ఇవ్వడం, సాధారణ కార్యకర్తలు చేస్తున్న రీతిలో నాయకులు కూడా విమర్శించడంపైనే చర్చ నడుస్తోంది. పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ ఏం మెస్సేజ్ ఇద్దామనుకుంటున్నారనే చర్చ మొదలైంది. ఇతర సోషల్ మీడియాలతో పోల్చితే.. వైసీపీ సోషల్ మీడియా ఇప్పటికే విమర్శల పాలైంది. అది వారి అభిమానులు సమర్థించవచ్చేమో కాని.. వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లలో సబ్జెక్ట్ తక్కువ.. దూషణలు ఎక్కువ అనే పరిస్థితి కనిపిస్తోంది. న్యాయస్థానాల విషయంలో నాయకుల కామెంట్లను ఆదర్శంగా తీసుకున్న కొందరు అభిమానులు సదరు నాయకులకంటే ఎక్కువగానే న్యాయస్థానాలపై కామెంట్లు చేశారు. సీబీఐ విచారణ నేపథ్యంలో వారు కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా తలెత్తింది. ఇది సదరు అభిమానులే స్వయంగా ఆ కామెంట్లు చేశారు అనే కంటే.. నాయకులు ఏ బాట చూపిస్తే ఆ బాటలోనే పార్టీ సోషల్ మీడియా శ్రేణులు వెళ్లాయని చెప్పాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సభలో ప్రతిపక్షానికి సహేతుకమైన సమాధానం చెప్పడం మానేసి హేళనలు, సోషల్ మీడియాలో ఉన్న వీడియోలను అసెంబ్లీలో చూపించడాలు.. సీఎం జగన్ స్థాయిని దిగజార్చుతున్నాయని చెప్పవచ్చు.
Must Read ;- కొవిడ్ నిబంధనలు అటకెక్కాయా.. మాస్క్‌ల నుంచి వైసీపీకి మినహాయింపా..?