చేతిలో అధికారం ఉన్నప్పటికీ అందరూ అంత హ్యాపీగా ఉండలేరు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సి రావటం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న ఆందోళన పట్టి పీడిస్తుంటుంది. ఇలాంటి సమయాల్లో కావాల్సినంత పవర్ ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు అలాంటి ఇబ్బందినే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నారని చెప్పక తప్పదు. ఆదాయానికి మించి ఆస్తుల కేసుల ఆయన్ను వెంటాడుతూనే ఉంది. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను ఆయన పరపతిని వాడేసుకొని వేలాది కోట్లు వెనకేసుకున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కోవటం.. దానికి సంబంధించిన కేసులు వెంటాడుతూనే ఉన్నాయి.
ఈ కేసుల్లో భాగంగా ఇప్పటికే కొన్నాళ్లు జైలు ఊచల్ని లెక్కపెట్టిన జగన్ కు ఇప్పుడు సరికొత్త దిగులు పట్టుకున్నట్లుగా చెబుతున్నారు. రాజకీయ నేతల మీద ఉన్న కేసుల్ని సత్వరమే విచారణ పూర్తి చేయాలన్న సుప్రీంకోర్టు మాట నేపథ్యంలో.. నేతలపై ఉన్న కేసు ఫైళ్లకు పట్టిన బూజు దులిపేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ మీద ఉన్న కేసుల్ని రోజువారీ విచారణ చేపట్టాలని భావిస్తున్నారు.
అదే జరిగితే.. కేసు విచారణ త్వరగా పూర్తి కావటమే కాదు.. అనుకోనిది ఏదైనా ఎదురైతే.. చాలా తక్కువ వ్యవధిలోనే దాన్ని అనుభవించాల్సి ఉంటుంది. అక్రమాస్తుల కేసులు నమోదైన నేతలు ఏదో ఒక రోజున ఇబ్బంది పడినోళ్లే తప్పించి.. సింపుల్ గా బయటపడిన దాఖలాలు పెద్దగా లేవని చెబుతారు. ఈ క్రమంలో మిగిలిన కేసుల సంగతి ఎలా ఉన్నా.. అక్రమాస్తుల కేసు విషయంలో జగన్ దిగులుగా ఉన్నట్లుగా చెబుతారు.
ఇటీవల కాలంలో కోర్టుల నుంచి ఎదురుదెబ్బలు ఎక్కువగా తింటున్న జగన్ కు తాజాగా కేసు విచారణకు ప్రతి రోజు హాజరు కావాల్సిన అవసరం లేదన్న ప్రత్యేక మినహాయింపు ఇవ్వటం ఆయనకు కొంతమేర ఊరటను ఇవ్వటం ఖాయం. ఆయనతో పాటు.. ఆయనకు అత్యంత సన్నిహితుడు విజయసాయి రెడ్డికి సైతం విచారణ నుంచి మినహాయింపు ఇచ్చారు.
అవసరమైన పక్షంలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరవుతామని జగన్ చెప్పటంతో న్యాయస్థానం అందుకు ఓకే చెప్పింది. విచారణ సందర్భంగా న్యాయస్థానానికి హాజరు కాకుండా మినహాయింపు ఓకే అయినా.. రోజువారీగా సాగే విచారణ మాత్రం ఏపీ అధినేతకు దిగులుగా మారటం ఖాయమన్న మాట చెప్పక తప్పదు.











